
సాక్షి, విజయవాడ: బ్రాహ్మణుల స్థలంలో హజ్ హౌజ్ నిర్మాణం ఎలా చేపడతారంటూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం నేత జింకా చక్రధర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న స్థలం ప్రభుత్వందో, వక్ఫ్ బోర్డ్‌దో కాదని అది బ్రాహ్మణుల స్థలం అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కామకోటి నగర్‌ను ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడం సరికాదన్నారు.
బ్రాహ్మణుల స్థలంలోనే హజ్ నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. శంకుస్థాపన చేసే ముందు ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్థలాన్ని కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు, కమిషనర్‌కు, సిఎంఓ కార్యాలయాలకు లేఖలు రాసినా ఫలితం లేకపోయిందన్నారు. స్థానిక నేతల ఒత్తిడితో వారు పట్టించుకోలేదని అందుకే రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నామని అన్నారు.