టీడీపీ నేతలకు నితిన్‌ గడ్కరీ సవాలు

AP Bjp leaders Honored Nitin Gadkari - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సాయం మరెవరూ అందించలేదని, దీనిపై టీడీపీ నేతలకు ఛాలెంజ్‌ విసురుతున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నితిన్ గడ్కరీ హాజరై మాట్లాడుతూ..' అందరికి సుపరిపాలన అందించాలన్నదే మోదీ లక్ష్యం. గత ప్రభుత్వాల హయాంలో టెర్రరిజం పెరిగిపోయింది. ప్రధానిగా మోదీ వచ్చిన తరువాత టెర్రరిజంను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. 2022 నాటికి ఆర్థికంగా వెనుకబడిన పేదలు అందరికి ఇళ్లు కట్టిస్తాము. కేంద్రం ఆర్థిక పరంగా రాష్ట్రానికి చేయాల్సినందంతా చేస్తోంది. మోదీ రాష్ట్రానికి ఎంతో చేస్తున్నా, చంద్రబాబు రాజకీయంగా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం ఖర్చు వంద శాతం  కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికి పోలవరం 62 శాతం పూర్తయింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. దీనిపై ఎవరికి సందేహాలు వద్దు. భారతమాలలో భాగంగా 44 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేస్తున్నాము. అనంతపురం అమరావతి హైవే నిర్మాణం 20 వేల కోట్లతో పూర్తి చేస్తాము. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి చేస్తాము. కాకినాడలో పెట్రో కెమికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము. బీజేపీ కుటంబ పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. యాబై ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్ల కాలంలో జరిగింది. దీనిపై మేము ఛాలెంజ్‌కు సిద్ధం. పోర్టులు, రోడ్లకు నా శాఖ నుంచి రూ. లక్ష 25 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చాము' అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించినందుకు గడ్కరీని రాష్ట్ర బీజేపీ నేతలు సన్మానించారు. 

చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుంది : కన్నా లక్ష్మీనారాయణ
కేంద్రం ఇచ్చిన పథకాలతోనే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని బీజేపీనే విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో టీడీపీ విడిపోయిన తరువాతే రాష్ట్రానికి 24 వేల కోట్ల నిధులు ఇచ్చామన్నారు. చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుంది. మోదీ అంటే భయంతో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావడం లేదన్నారు.

సర్వేలు చూస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది : విష్ణుకుమార్ రాజు
రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇసుక దోపిడీ ద్వారా రూ.2 వేల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు.16,200 కోట్లతో రోడ్ల పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఇప్పటికీ ఇసుక దోపిడీని సీఎం చంద్రబాబు అరికట్టలేక పోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారని తెలిపారు. భూములు ఆక్రమమించిన పచ్చ పాములు పేర్లు బైటకు వస్తాయని సిట్ నివేదికను తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. ఎన్నికల సర్వేలు చూస్తుంటే చంద్రబాబుకు భయమేస్తోందన్నారు. మొన్నటి వరకు బీజేపీ, వైఎస్‌ జగన్, పవన్ ఒక్కటే అని విమర్శలు చేసిన టీడీపీ నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తొలగించి టీఆర్‌ఎస్‌ పేరు చేర్చారన్నారు.

ప్రతి స్కీమ్‌ను ఒక స్కామ్‌గా మార్చారు : పురందేశ్వరి
అగ్రవర్ణాల్లో పేదల కోసం ఎవరు ఊహించని విధంగా రిజర్వేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టారని మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అగ్రవర్ణాల్లో పేదల కోసం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి స్కీమ్‌ను ఒక స్కామ్‌గా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నీతి నిజాయితీతో కూడిన పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కట్టినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top