పుష్కర యాత్రలో మరో విషాదం | Another tragedy in godavari pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కర యాత్రలో మరో విషాదం

Jul 25 2015 12:12 AM | Updated on Sep 3 2017 6:06 AM

పుష్కర యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. పుష్కరాల ప్రారంభం నుంచి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై

గండేపల్లి(తూర్పుగోదావరి): పుష్కర యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. పుష్కరాల ప్రారంభం నుంచి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పుష్కరాలకు వచ్చివెళుతున్నవారు ప్రమాదాల్లో చిక్కుకుని నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. మల్లేపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో తొమ్మిదిమంది గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పుష్కర స్నానాలు ముగిశాక రాజమండ్రి నుంచి తిరిగివెళుతున్న వ్యాను మల్లేపల్లి వద్ద తూమును వేగంగా ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడటంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం వల్లూరుకు చెందిన మీసాల సత్యం (60), పినతరిమి గ్రామానికి చెందిన మహిళ డుంకు సామాలు(35) మృతి చెందారు.
 
 కంది కృష్ణమోహన్, ఆల్తి శివ, లంక అప్పలనాయుడు, ఆల్తి నవీన్, బొత్స వెంకటపద్మావతి, గేదె సత్యనారాయణ, మజ్జి సంతోష్, మీసాల సరస్వతి, ఆల్తి రాము గాయపడ్డారు. ఆటోలో చిక్కుకున్న వీరిని స్థానికులు రక్షించారు. వీరిలో అప్పలనాయుడు, మరో మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగ్రాతులను హైవే అంబులెన్స్‌లో రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలిసింది. డ్రైవర్ పరారైనట్టు సమాచారం. సంఘటన స్థలానికి వచ్చిన ఎస్సై ఎన్.రజనీకుమార్, సిబ్బంది, హైవే సిబ్బంది, స్థానికులు వాహనం కేబిన్‌లో ఇరుక్కున్న సత్యం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement