మరో సర్దుపోటు | Another burden on electricity consumers | Sakshi
Sakshi News home page

మరో సర్దుపోటు

Feb 16 2014 4:23 AM | Updated on Jun 4 2019 6:33 PM

విద్యుత్ వినియోగదారులపై మరో భారం పడింది. ఉరుము లేని పిడుగులా వరుసపెట్టి సర్దుబాటు చార్జీలతో విద్యుత్ సంస్థలు బాదేస్తున్నాయి.

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: విద్యుత్ వినియోగదారులపై మరో భారం పడింది. ఉరుము లేని పిడుగులా వరుసపెట్టి సర్దుబాటు చార్జీలతో విద్యుత్ సంస్థలు బాదేస్తున్నాయి. గత నెల నుంచే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా దానికి సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు. ఈ నెలలో కూడా అదే రీతిలో బిల్లు మొత్తాలు ఎక్కువగా ఉండటంతో ఆరా తీయగా సర్దుబాటు చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే స్పాట్ బిల్లింగ్ సిబ్బంది రీడింగులు తీయడంలో జాప్యం చేయడం వల్ల శ్లాబ్‌లు మారిపోయి, పెద్ద మొత్తంలో బిల్లులు రాగా, అది చాలదన్నట్లు సర్దుబాటు చార్జీలు వచ్చి చేరాయి. దీంతో పేద, మధ్య తరగతి వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ నుంచి వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు సర్దుబాటు పేరిట ఇప్పుడు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
 
 ఇంతకుముందు యూనిట్‌కు 50 పైసల లోపే సర్దుబాటు చార్జీలు ఉండేవి. ఇప్పుడు అంతకంటే ఎక్కువే వడిస్తున్నారు. గత మూడేళ్లుగా సర్దుబాటు పేరిట అదనపు వసూళ్లు చేస్తున్నారు. 2010-11, 2012-13 సంవత్సరాలకు సంబంధించిన వసూల్లు ఇప్పటికే జరిగిపోయాయి. ప్రస్తుతం 2011-12 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను ఎనిమిది నెలల పాటు వసూలు చేస్తారు. ఇది కూడా 2014 సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో యూనిట్ చార్జీ ఓ పైసా కూడా పెరగకపోగా, అటు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చార్జీలను పెంచడమే కాకుండా, సర్దుబాటు పేరిట సంవత్సరాల తరబడి అదనపు భారం మోపుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి అక్రమ వసూళ్లను ఆపివేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. విషయాన్ని ట్రాన్స్‌కో ఎస్‌ఐ పి.వి.వి.సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుండడమే నిజమేనని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement