మరో దొంగ దెబ్బ

మరో దొంగ దెబ్బ - Sakshi


రైతుల రుణ మాఫీపై సీఎంగా చేసిన ప్రకటననూ తుంగలో తొక్కిన చంద్రబాబు

 

ఈ ఏడాది మార్చి 31 వరకున్న రుణాలన్నీ మాఫీ అని జూన్ 21న సీఎం ప్రకటన

మార్గదర్శకాల్లో మాత్రం గతేడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలకే వర్తింపు

డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకు ఈ మార్చి వరకే వడ్డీ చెల్లింపంటూ మెలిక

ఆయా రుణాలపై మార్చి 31వ తేదీ తరువాత పడే వడ్డీని రైతులే చెల్లించుకోవాలి

ఈ జనవరి నుంచి మార్చి వరకు తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాఫీ వర్తించదు

ఆ కాలంలో రైతులు బంగారం కుదువపెట్టి ఎక్కువ రుణాలు తీసుకున్నందున కుదింపు

లక్షల్లో రైతుల రుణ ఖాతాలను, వేల కోట్లలో మాఫీ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ

నిజానికి ఎన్నికల ముందు గోల్డ్‌పై రుణాలు తీసుకోవాలంటూ టీడీపీ నేతల ప్రచారం

ఇంటింటికి వెళ్లి మరీ ప్రోత్సాహం.. బంగారాన్ని బాబు విడిపిస్తారని నమ్మించారు

అధికారంలోకి వచ్చాక ఆ రైతు కుటుంబాలను నట్టేట ముంచిన టీడీపీ సర్కారు


 

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటల బండారం మరోసారి బయటపడింది. నమ్మించి మోసం చేయటం ఆయన నైజమని మళ్లీ రుజువైంది. రైతుల వ్యవసాయ రుణాల మాఫీ హామీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి దొంగ దెబ్బతీసింది. రుణ మాఫీని ఇప్పటికీ అమలు చేయకుండా అనేక సాకులు చెప్తూ.. ఆంక్షలు పెడుతూ నాన్చుతున్న చంద్రబాబు ఇటీవల సీఎం హోదాలో.. ఈ ఏడాది మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలను -తిరిగి చెల్లించని వారివి, చెల్లించిన వారివి కూడా- మాఫీ చేస్తామని స్వయంగా బాహాటంగా చెప్పిన మాటనూ తుంగలో తొక్కేశారు. గతేడాది డిసెంబర్ 31లోగా తీసుకున్న పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి తీసుకున్న పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మధ్యకాలిక రుణాలుగా మార్చిన రుణాలకే మాఫీ వర్తిస్తుందని ఆ తర్వాత జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు తమను నమ్మించి మరీ నిలువునా మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడు నెలల్లో ఎన్నో పిల్లి మొగ్గలు...అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా రైతాంగానికి హామీ ఇవ్వడం తెలి సిందే. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణ మాఫీ అమలుపై విధివిధానాలకు కమిటీ అని, నిధుల సమీకరణకు కమిటీ అని, ఆర్‌బీఐ ద్వారా రీషెడ్యూల్ చేయిస్తానని.. అనేక పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చటం తెలిసిందే. ఈ లోగా రైతులు రుణాలు చెల్లించాల్సిన గడువు ముగిసిపోవడం, వారంతా డిఫాల్టర్లుగా మారారంటూ బ్యాంకర్లు రుణాల వసూళ్ల కోసం నోటీసులు ఇవ్వడం, ఆ రుణాలపై 13% వడ్డీ భారం పడటం, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలు లభించకపోవడం, రైతాంగం పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం తెలిసిందే.మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలన్నీ అన్నారు...ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి నిరసనలు, ప్రతిపక్షం నుంచి ఒత్తిడులు పెరుగుతుండటంతో.. సీఎం చంద్రబాబు గత నెల (జూలై) 21వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి రుణ మాఫీ అమలుపై నిర్ణయం తీసుకున్నట్లు అనంతరం ఆయన స్వయంగా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలను, రుణాలు తీసుకుని చెల్లించిన వారి, చెల్లించని వారి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాల పర్యటనల్లో పలు బహిరంగ సభల్లోనూ.. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు.డిసెంబర్ 31 వరకూ మాత్రమేనని మార్గదర్శకాలు...కానీ.. ఈ నెల 14న రుణ మాఫీపై జారీ చేసిన మార్గదర్శకాల్లో మాత్రం ఆ మాటకూ కట్టుబడకుండా దొంగ దెబ్బ తీశారు. గతేడాది డిసెంబర్ 31లోగా తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. అంతేకాదు.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించదని తేల్చిచెప్పారు. అంతే కాకుండా వ్యవసాయ రుణాలపై వడ్డీ చెల్లింపులో కూడా మరో మెలిక పెట్టారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలకు ఈ ఏడాది మార్చి వరకు అయ్యే వడ్డీని మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకువస్తామని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అంటే ఈ ఏడాది మార్చి తరువాత వడ్డీని ఆయా రైతులే భరించుకోవాల్సి ఉంది. అలాగే.. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 1.50 లక్షల మేర మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందని, ఆయా కుటుంబానికి నిబంధనల ప్రకారం అర్హత మేరకు ఉన్న రుణానికి మాత్రమే ఈ మాఫీ ఉంటుందని.. అర్హతకు మించి ఉన్న రుణాలకు వర్తించదనీ నిబంధనలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ మార్గదర్శకాల్లో ఈ నిబంధనలు చేర్చడం ద్వారా.. లక్షలాది మంది రైతుల ఖాతాలను, వేల కోట్ల రూపాయల రుణ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యమని బ్యాంకుల అధికారులే స్వయంగా చెప్తున్నారు. మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలన్నిటినీ కూడా మాఫీ చేస్తామని చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక బహిరంగంగా చెప్పిన మాటకు కూడా కట్టుబడకుండా మోసం చేయడం సమజసం కాదనే అభిప్రాయాన్ని బ్యాంకు అధికారులే వ్యక్తం చేస్తున్నారు.

 

జనవరి తర్వాతే ఎక్కువ రుణాలు...


 

వాస్తవానికి జనవరి నుంచి మార్చిలోగా ఎక్కువ మంది బంగారం కుదవ పెట్టి వ్యవసాయ పంట రుణాలు తీసుకున్నారని, ఆ రుణాలను మాఫీ చేయకూడదనే ఈ నిబంధన పెట్టారని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకోవాల్సిందిగా రైతులను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలేనని రైతాంగం వాపోతోంది. పంట రుణం తీసుకున్నప్పటికీ బంగారంపైన కూడా రుణం తీసుకోవాలని, బాబు అధికారంలోకి రాగానే రుణ మాఫీ ద్వారా బంగారం విడిపిస్తారని రైతులను నమ్మించింది టీడీపీ నాయకులేనని అధికారులు కూడా గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటకే కాదు.. ఎన్నికలయ్యాక ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చెప్పిన మాటకు విరుద్ధంగా కూడా చంద్రబాబు వ్యవహరించడాన్ని బట్టే ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్థమవుతోందని పరిశీల కులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top