జీవనం తెలుగునాడులో..అనుబంధం తమిళనాడుతో

Andhra Student Going To School In Tamil Nadu In PSR Nellore - Sakshi

తెలుగు, తమిళ సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం తడ మండలం

సగానికిపైగా ప్రజల వాడుక భాష తమిళం

చదువులు, బంధుత్వాలు ఎక్కువశాతం అక్కడే  

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని తడ మండలంలో తెలుగు మాట్లాడేవారికన్నా తమిళంతో అనుబంధం పెంచుకున్న కుటుంబాలే ఎక్కువ. మండల కేంద్రం నుంచి దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో ఎక్కువగా తమిళభాషనే మాట్లాడుతారు. ఇక్కడి కుటుంబాల్లో చాలామందికి తెలుగు మాట్లాడటం పూర్తిగా రాదు. అనేకరకాలుగా ఆ గడ్డతో అనుబంధం పెంచుకున్న వారు మనకు ఈ మండలంలో కనిపిస్తారు.

నెల్లూరు, తడ: మండలంలో 18 పంచాయతీలున్నాయి. అందులో సగానికన్నా ఎక్కువ చోట్ల తమిళ ప్రాబల్యం ఉంటుంది. తడ, తడకండ్రిగల్లో సగం తెలుగు వాళ్లున్నా పూడి, కారూరు, బీవీపాళెం, పెరియవట్టు, రామాపురం, ఇరకం, వేనాడుతోపాటు వాటంబేడు గ్రామాల్లో అత్యధిక శాతం తమిళభాషే వాడుకలో ఉంటుంది. ఈ పంచాయతీల్లో పెద్దలు తమ పిల్లలకు తెలుగు చదువులు వద్దని తమిళ చదువులు నేర్పేందుకే మొగ్గు చూపుతారు.

రాష్ట్రం విడిపోయిన సమయంలో..
సరిహద్దు పంచాయతీల్లో అత్యధికంగా మత్స్యకారులు, వన్నెకాపులు నివసిస్తుంటారు. ఉమ్మడి మద్రాస్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సమయంలో కొన్ని పంచాయతీలు ఆంధ్రాలో కలిశాయి. అదేసమయంలో మత్స్యకార, వన్నెకాపు కులాలకు చెందిన వారి బంధువులు ఎక్కువశాతం ఆ రాష్ట్రం పరిధిలోకి వెళ్లిపోయారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మద్రాస్‌తోనే ఎక్కువ అనుబంధం ఉండటంతో విభజన అనంతరం కూడా తెలుగువారు తమిళనాడుతో సంబంధాలు కొనసాగిస్తున్నారు.

తమిళనాడులో చేర్చాలని..
తమ వారంతా తమిళనాడులో ఉన్నందున మత్స్యకారులు, వన్నెకాపులు ఎక్కువగా ఉంటున్న దక్షిణ తడ గ్రామాలను తమిళనాడులో చేర్చాల్సిందిగా గతంలో పోరాటాలు కూడా నడిచాయి. మండలంలోని సుమారు 60 వేల జనాభాలో సగం వరకు ఉన్న బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ రెండు కులాలు సగం పంచాయతీల్లో శాసించే స్థాయిలో ఉన్నారు. కనీసం ఇక్కడ తమిళ పాఠశాలలు ఏర్పాటుచేసి ఆ భాష నేర్పాల్సిందిగా అధికారులు, నాయకులకు స్థానిక ప్రజలు ఎన్నోమార్లు విన్నవించుకున్నారు. కానీ ఫలితం లేకుండాపోయింది.

తెలుగు రాక ఇబ్బందులు
ఇక్కడి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు తమిళం తప్ప మరో భాష రాని పరిస్థితి ఉంది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే తహసీల్దార్, ఎస్సై, ఎంపీడీఓ, బ్యాంక్‌ అధికారులకు చాలావరకు తమిళం రాదు. దీంతో ప్రజలు తమ సమస్యలు వారికి చెప్పుకోవాలంటే తెలుగుభాష తెలిసిన వారి సహాయం తీసుకోవాల్సిందే. రామాపురం, బీవీపాళెం, పెరియవట్టు, కారూరు, ఇరకం పంచాయతీలకు సంబంధించి మహిళా సర్పంచ్‌లుండగా వీరు తమిళం తప్ప మరో భాష మాట్లాడలేరు.

పండగలు
ఈ ప్రాంతంలో తెలుగు ఉగాది కన్నా తమిళ ఉగాదికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఇక్కడ పండగలు, వివాహాది వేడుకలు జరుగుతాయి. మహిళలు, పురుషుల కట్టుబొట్టు అంతా తమిళ పద్ధతిలోనే ఉంటుంది.

తమిళ పాఠ్యాంశం లేక
తడ దక్షిణ ప్రాంతంలో సరైన ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు నెలకొనలేదు. దీంతో తమ పిల్లలను తమిళనాడులోని ఆరంబాకం, ఎళాపూరు, సున్నాంబుకుళం, గుమ్మిడిపూండి, పొన్నేరి ప్రాంతాలకు పంపి చదివిస్తున్నారు. తమిళనాడులోని సరిహద్దు గ్రామాల్లో తెలుగు మీడియంలో పాఠశాలలు చేర్పిస్తుండగా ఇక్కడ మాత్రం ఎందుకు మార్పు రావడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంత అడిగినా అక్కడికే
తెలుగు చదువు విషయంలో ఎంత చెప్పినా తమిళ పాఠశాలలకేపిల్లలను పంపుతున్నారు. దీనికితోడు వాహన సౌకర్యం పెరగడంతో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం ఒక్క తమిళ టీచర్‌ ఉన్నా కొంతవరకు విద్యార్థులకు కాపాడుకోవచ్చు. గతంలో కారూరు పంచాయతీ, కాశింగాడుకుప్పం పాఠశాలలో రెండువందలకుపైగా విద్యార్థులుండగా ప్రస్తుతం పదులసంఖ్యకు చేరింది.– జి.శ్రీనివాసులు, టీచర్‌

తమిళ పాఠశాల ఏర్పాటుకు చర్యలు
ప్రత్యేక పరిస్థితుల్లో జీవిస్తున్న ఇక్కడి ప్రజలకు ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లభించడంలేదు. విద్య విషయంలో చిన్నారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించేలా రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుచేసేందుకు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. తమిళభాష  అవసరం ఉన్న పంచాయతీల్లోని ప్రధాన పాఠశాలల్లో ఆ భాషను నేర్పేందుకు ఒక టీచర్‌ని ఏర్పాటుచేయాలని అధికారులను కోరడం జరిగింది. అయితే ఉన్న పాఠశాలలనే మూసేందుకు సిద్ధపడుతున్న టీడీపీ పెద్దలు కొత్త పోస్ట్‌లిచ్చి పాఠాలు చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోరిక మేరకు తమిళ పాఠ్యాంశాన్ని ప్రవేశపెడతాం. వెనుకబడిన తరగతుల పిల్లలకోసం రెసిడెన్షి్యల్‌ పాఠశాలను నెలకొల్పుతాం.  
– కిలివేటి సంజీవయ్య,సూళ్లూరుపేట ఎమ్మెల్యే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top