వికేంద్రీకరణకే మొగ్గు

Andhra Pradesh To Have 3 Capitals For Decentralised Development - Sakshi

అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం క్యాంప్‌ ఆఫీసు

విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంప్‌ ఆఫీసు, హెచ్‌ఓడీ కార్యాలయాలు

కర్నూలులో హైకోర్టు.. విశాఖపట్నం, అమరావతిల్లో బెంచ్‌లు

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం కాంక్షిస్తూ

జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక

వేసవికాల అసెంబ్లీ సమావేశాల్ని విశాఖలో నిర్వహించాలని సిఫార్సు

అమరావతిలో ప్రస్తుత నిర్మాణాల్ని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి

పాలన సౌలభ్యం కోసం నాలుగు మండళ్ల ఏర్పాటుకు సూచనలు

నదీ పరీవాహక ప్రాంతంలో కాల్వల వ్యవస్థను ఆధునీకరించాలి

రాష్ట్రంలోని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. అభివృద్ధిని కొనసాగించాలని సలహా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌), విశాఖలో పరిపాలన రాజధాని(ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది.

విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్‌ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రికి నివేదిక అందచేసిన అనంతరం కమిటీ కన్వీనరు జీఎన్‌ రావు, సభ్యులు విజయమోహన్, ఆర్‌.అంజలీ మోహన్, డాక్టర్‌ మహావీర్, డాక్టర్‌ సుబ్బారా>వు, కేటీ రవీంద్రన్, అరుణాచలంలు మీడియాతో మాట్లాడారు.
(చదవండి : చేనేతలకు ఆపన్నహస్తం)

కమిటీ ప్రధాన సిఫార్సులు..
►మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన(లెజిస్లేచర్‌) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్‌ ఉండాలి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి.
►అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోట ఉంచాల్సిన అవసరం లేదని కె.సి.శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాల్ని ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తైన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును నేషనల్‌ హైవేకు అనుసంధానించాలి.
►శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.
►పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు.

ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వృథా కారాదు
అమరావతిలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి... అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. తుళ్లూరు ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టింది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల్ని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించాలి. అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడినవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి.

డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంబించాలి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం.

2 వేల మంది రైతులతో మాట్లాడాం: జీఎన్‌ రావు
రాజధాని, అభివృద్ధి అంశాలపై కమిటీ సభ్యులమంతా అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడితే.. మరికొన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వాటి మధ్య సమతూకం సాధించాలి. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు పలు నదులు, అడవులు ఉన్నాయి. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా పలు సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే అన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని సూచనలు ఇచ్చాం. మాకు మొత్తం 38 వేల విజ్ఞాపనలు అందగా.. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడాం.

జిల్లాలకు వెళ్ళి.. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. వాటికి అనుగుణంగా అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్ర పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం.  పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్‌లుగా విభజించాలని సూచించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. రాజధానికి అనుకూలం కాదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలి. రాజధాని ఎక్కడో చెప్పడం మా పని కాదు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి, సమతుల్యతపై కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేశాం.  మేము రైతులతో మాట్లాడలేదన్నది అవాస్తవం.

ప్రాంతీయ అసమానతల్ని తగ్గించాలి
‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ మధ్య, ఉత్తర కోస్తాలోనే ఉంది. అందువల్ల ప్రాంతాల మధ్య అభివృద్ధి– సమతూకంపై అధ్యయనం చేసి సూచనలిచ్చాం. అదే సమయంలో రాష్ట్రంలోని అభివృద్ధి వల్ల పర్యావరణం దెబ్బతినకూడదు. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి సాగాలి. రాష్ట్రంలో రాయలసీమ బాగా వెనకబడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తీరానికి దూరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అడవుల్ని పరిరక్షించడంతో పాటు మరిన్ని పెంచాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి’ అని జీఎన్‌ రావు చెప్పారు.

బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక వచ్చాకే...
రాజధానిపై బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక కూడా వచ్చాకే.. జీఎన్‌ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరో పది రోజుల్లో బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక రానుంది. ఈ రెండు నివేదికలపై ఒకేసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. అందువల్ల ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో జీఎన్‌ రావు కమిటీ నివేదికపైనే చర్చించకపోవచ్చని సమాచారం.

తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి
రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి.

►రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. అమరావతిలోని కొన్ని అధికార వ్యవస్థలను ఆ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
►అన్ని జిల్లాల్లోని సహజ వనరుల మేరకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి.
►గిరిజనులు, మత్స్యకార వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడి, అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాలి.
►రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి.
►పొడవైన తీర ప్రాంతంలోని వైవిద్య భరితమైన పర్యావరణం, మడ అడవులు, బీచ్‌ల్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలి.
►పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొత్త పోర్టులు ఏర్పాటు చేయాలి. రెండు పోర్టుల మధ్య కనీస దూరం, రోడ్డు, రైలు సౌకర్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పోర్టులు నెలకొల్పాలి.
►విద్యుత్‌ సరఫరా సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వమే సౌర విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టాలి.
ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
►పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం అధిక వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. తద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించవచ్చు.
►డెల్టా కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లీకేజీలు అరికట్టి.. ఆయకట్టుకు సమర్ధంగా నీటిని అందించేందుకు కాలువల వ్యవస్థను ఆధునికీకరించాలి.
►పరీవాహక ప్రాంతం ఆధారంగా గొలుసుకట్టు చెరువులను మైక్రో వాటర్‌షెడ్‌ విధానంలో అభివృద్ది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేసి.. అధిక ఆయకట్టుకు నీటిని అందించడంపై దృష్టి సారించాలి.
►రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో భారీగా చెట్ల పెంపకాన్ని చేపట్టి.. పచ్చదనాన్ని పెంచాలి.

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఇవే..
1. ఉత్తరాంధ్ర:  శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
2. మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
3. దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
4. రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం
►అన్ని ప్రాంతాల అభివృద్ధికి వనరులు,అవకాశాలకు అనుగుణంగా విస్తృత విధానాలు, వ్యూహాలు అమలు చేసి ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని కమిటీ ఆకాంక్షించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top