లాక్‌డౌన్‌ వేళ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా

Andhra Pradesh Government Take All Precautions In Lockdown Period - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు, ప్రభుత్వం  తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని కుదించారు. పట్టణ ప్రాంతాల్లో నిత్యావసర కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు అనుమతిచ్చారు. గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకూ అవకాశం కల్పించారు. నిత్యావసరాలు అధిక ధరలకు అమ్మితే జైలు పంపుతామని హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని.. అందులో కాల్‌ సెంటర్‌ నెంబర్‌ కూడా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.  

ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం:
లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా రాçష్ట్రవ్యాప్తంగా రేషన్‌ సరుకుల ఉచిత పంపిణీ ఆదివారం ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అన్ని చోట్ల రేషన్‌ షాపుల్లో కిలో పప్పుతో సహా, 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకోకుండా, వార్డు వలంటీర్ల సహాయంతో రేషన్‌ సరుకులు పంపిణీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా:
 జిల్లా ప్రజల అవసరాల కోసం కూరగాయలు, నిత్యావసర సరుకులు, మందులు అందుబాటులో ఉంచామని సంయుక్త కలెక్టర్‌ కే శ్రీనివాసులు తెలిపారు. ప్రజలకు కూరగాయలు డోర్‌ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో నాలుగు, కోటబొమ్మాలిలో రెండు, ఆమదాలవలసలో ఒకటి చొప్పున మొత్తం ఏడు మొబైల్‌ రైతు బజార్లను ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రైతుబజార్‌ మరియు పెద్ద బజార్లలో రద్దీ తగ్గించేందుకు నగరంలో ఐదు చోట్ల మార్కెట్లను ఏర్పాటు చేశామని వీటితో పాటు జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో, పది మండల కేంద్రంలో కూడా కొత్త మార్కెట్లు ప్రారంభించామని జేసీ వెల్లడించారు. 
 శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఆమదాలవలస, పాలకొండ, ఇచ్చాపురం పురపాలక ప్రాంత ప్రజలు ఫోన్‌ చేస్తే ఇంటికే నిత్యావసర సరుకులు, మందులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని, ఇప్పటివరకు 350 మంది కొనుగోలు చేసినట్లు జేసీ వివరించారు. 
► మరోవైపు టెక్కలిలో నిరుపేద కళింగ వైశ్య కుటుంబాలకు 5 కేజీల బియ్యం, కందిపప్పు, వంట నూనె, కూరగాయలతో పాటు ఇతర నిత్యావసర సరుకులను వైఎస్సార్‌సీపీ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

విజయనగరం జిల్లా:
► జిల్లాకు ఉపాధి, విద్య, ఇతర అవసరాల నిమిత్తం వచ్చి లాక్‌డౌన్‌లో చిక్కుకొని బయటకు వెళ్లలేని వారందరికీ భోజన వసతి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆ మేరకు వివిధ మండలాలు, పట్టణాల్లో ఉన్న ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి ఆయా ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో సోమవారం నుంచి భోజన వసతి కల్పించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరిజవహర్‌ లాల్‌ తెలిపారు. దీనిపై ఆయన ఆదివారం టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి వచ్చి గ్రామాలు, పట్టణాల్లో ఉంటున్న వారికి కూడా 14 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి చేయాలని, వారి వల్ల కూడా ఆయా ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు అవసరమని చెప్పారు. వారం క్రితం విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారిని వైద్య సిబ్బంది నిత్యం గమనించాలని, వారిలో ఏమైనా వ్యాధి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలని అధికారులకు కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు.
► కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో వైద్య సిబ్బంది, కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొనే ఇతర శాఖల సిబ్బందికి అవసరమైన గ్లౌసులు, మాస్క్‌ లను సరఫరా చేసేందుకు డీఆర్‌డీఏ, మెప్మా ప్రాజెక్ట్‌ డైరక్టర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.  

విశాఖపట్నం జిల్లా:
► కరోనా నిర్ధారిత పరీక్షకు పంపిన 131 శాంపిల్స్‌లో ఈరోజు 19 కేసులు నెగిటివ్‌ వచ్చాయని జిల్లా కలెక్టరు వినయ్‌చంద్‌ వెల్లడించారు.
► నిన్నటి వరకు 96 రిపోర్టులు నెగిటివ్‌ రాగా ఈరోజుతో 115 కేసులు నెగిటివ్‌ వచ్చాయని, ఇంకా 12 కేసులు విషయం తెలియాల్సి ఉందన్నారు.
► జిల్లాలో ఇప్పటి వరకు 4 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐసోలేషన్‌లో 24 మంది ఉన్నట్టు తెలిపారు.
► ఇప్పటి వరకు 110 మందిని ఐసోలేషన్‌ వార్డులలో జాయిన్‌ చేయగా వారిలో 86 మంది ఇవాళ డిశ్చార్జి అయినట్టు చెప్పారు.
► జిల్లాలో 19 ఆసుపత్రులలో 3054 ఐసోలేషన్‌ పడకలు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు.
► జిల్లాలో కరోనా అనుమానం ఉన్న 209 మంది వివిధ క్వారంటైన్‌ కేంద్రాలలో ఉన్నారని పేర్కొన్నారు.
ఇక విశాఖ జిల్లాలో కరోనా వివరాలు:

  • కరోనా పాజిటివ్‌ కేసులు: 4
  • ఐసోలేషన్‌ లో ఉన్నవారి సంఖ్య : 24
  • జిల్లాలో కరోనా  అనుమానితులు: 209
  • భీమిలి క్వారంటైన్‌ కేంద్రంలో 76 మంది
  • గాజువాక క్వారంటైన్‌లో 73 మంది
  • యలమంచిలి క్వారంటైన్‌లో 40 మంది
  •  నర్సీపట్నంలో క్వారంటైన్‌ లో 20 మంది.
  •  కరోనా నెగిటివ్‌ వచ్చిన వారి సంఖ్య : 86 
  •  ధృవీకరింపబడని వారి సంఖ్య ( రిపోర్టులు రావాల్సినవి): 12
  •  జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల సంఖ్య : 12
  •  అందుబాటులో ఉన్న ఐసోలేషన్‌ సింగిల్‌ రూమ్స్‌: 500
  •  ఐసోలేషన్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయబడిన ఆస్పత్రులు : 15 
  •  గాయత్రి మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ పడకలు: 3550 
  •  జిల్లాకు విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులు: 2795 

తూర్పు గోదావరి జిల్లా:
► జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత కేసులకు సంబంధించి 75 శాంపిల్స్‌ పరీక్షలకు పంపగా, వాటిలో 66 కేసుల్లో నెగటివ్‌ అని తేలింది.
► ఒక కేసు కరోనా–పాజిటివ్‌ అని రాగా, మరో 8 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
► విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 342 మందిలో 1035 మంది కాకినాడ, రాజమండ్రికి చెందిన వారు కావడంతో, వారందరినీ ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నారు.
► ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా 5 వేల ఐసొలేషన్‌ బెడ్స్‌తో పాటు, 15 వేల బెడ్స్‌తో క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా:
► జిల్లాలో ఇప్పటి కరోనా కేసు నమోదు కాలేదని తెలిపిన వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.
► 13 మంది పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు.
► లాక్‌డౌన్‌ దృష్ట్యా జిల్లాలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లనీ నిర్మానుష్యంగా మారాయి.
► నిత్యావసర సరకుల షాపుల మినహా మిగిలిన వాణిజ్య సముదాయాలన్నీ మూసివేశారు.
► రైతు బజార్లు, షాపుల్లో సరకుల ధరలపై అధికారుల ఆరా తీస్తున్నారు.
► ధరలు పెంచినా, సరకుల కృతిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేహాల్‌ హెచ్చరించారు.

కృష్ణా జిల్లా:
► లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా రేషన్‌ షాపుల వద్ద సామాజిక దూరం పాటించి పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 12.92 లక్షల రేషన్‌ కార్డుదారులు ఉండగా వారికీ పంపిణీ చేసేందుకు ఒక 1,65,075 క్వింటాళ్ల బియ్యం, 12.93 లక్షల క్వింటాళ్ల కందిపప్పును సిద్ధం చేశారు.
► మరోవైపు ఆదివారం కావడంతో విజయవాడ, గుడివాడ, నూజివీడు డివిజన్లలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు చికెన్, మటన్, ఫిష్‌ మార్కెట్లు ఓపెన్‌ చేశారు. ► గుడివాడలో మినహా అన్ని చోట్ల సామాజిక దూరం పాటించారు. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని ఆదేశాల మేరకు ఫిష్, చికెన్, మటన్‌ దుకాణాలను తెరవలేదు.
► జిల్లా వ్యాప్తంగా రైతు బజార్లను వికేంద్రీకరణ చేయడంతో బాగా రద్దీ తగ్గింది. దీంతో ప్రజలు ఇబ్బంది లేకుండా త్వరత్వరగా తమకు కావాల్సినవి కోనుగోలుచేస్తున్నారు.
► రైతుబజార్లలో, నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలన్న అధికారులు ఆదేశాల మేరకు వర్తకులు ధరల పట్టికలను దుకాణాల ముందు పెట్టుకున్నారు.

గుంటూరు జిల్లా:
► జిల్లాలో ఇప్పటి వరకు 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 42 మంది అనుమానితుల్లో 41 మంది రిపోర్టు రాగా అందులో 37 నెగెటివ్, 4 పాజిటివ్‌ గా తేలాయి. మరొకరి రిపోర్డ్‌ రావాల్సి ఉంది. కరోనాపై 16 నిఘా, పర్యవేక్షణ బ్రుందాలు ఏర్పాటు చేసి నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. 
► జిల్లాలో కరోనా–వివరాలు:

  • పాజిటివ్‌ కేసుల సంఖ్య : 4
  • నెగెటివ్‌ కేసుల సంఖ్య : 37
  • ఐసోలేటెడ్‌ వార్డుల సంఖ్య: 5

► జిల్లా వ్యాప్తంగా 29 క్వారంటైన్‌ కేంద్రాలు ఉండగా వాటిలో 118 విదేశీ ప్రయాణీకులు ఉన్నారు. జిల్లాలో 2606 మంది విదేశాల నుంచి తిరిగివచ్చినవారు ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రులలో దాదాపు 300 ఐసోలేషన్‌ బెడ్స్‌తో పాటు జిల్లా స్ధాయి కోవిడ్‌ ఆసుపత్రిలో మరో 300బెడ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చారు. జిల్లాలోని 88 ప్రైవేటు ఆసుపత్రుల్లో 9353 ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్దం చేశారు. వీటితో పాటు 10 క్వారంటైన్‌ కేంద్రాల్లో 1024 బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. 

ప్రకాశం జిల్లా:
► ఒంగోలులోని గొడుగుపాలెం రేషన్‌ షాపు వద్ద లబ్ధిదారులకు రేషన్‌ సరుకులను విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు.
► జిల్లా లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు.
► రేషన్‌ షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు.
► కరోనా అనుమానితులు 144 మందిలో 8 మందికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. మిగిలినవారిని అబ్జర్వేషన్‌లో ఉంచారు.
► నిత్యవసరాలు, కూరగాయలు బజార్లలో అమ్మేందుకు ఇప్పటికే ట్రాలీలకు అనుమతిచ్చారు.
► జిల్లాకు విదేశాల నుంచి 1,062 మంది రాగా, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
► లాక్‌డౌన్‌ వల్ల జిల్లాలోని రోడ్లపై జనసంచారం తగ్గింది.
► జొమాటో లాంటి సంస్థల ఆన్‌లైన్‌ అర్డర్‌ల ద్వారా ఫుడ్‌ సప్లై చేస్తున్నాయి. 
► 110 వాహనాల ద్వారా మొబైల్‌ కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
► నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలులో ప్రజలు  సామాజిక దూరం పాటిస్తున్నారు.
► 100 రూపాయలకు కూరగాయల కిట్‌ను మార్కెటింగ్‌ శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు.
► ముందస్తు జాగ్రత్తగా ఐదుగురిని క్వారంటైన్‌లో ఉంచారు. ఆసుప్రతి హోమ్‌ ఐసోలేషన్‌ వార్డులో మరో ముగ్గురు ఉన్నారు. 
► జిల్లా కు విదేశాల నుంచి 1700 మంది రాగా.. 1390 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు .
► నెల్లూరు జీజీహెచ్‌లో 600 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఐసోలేషన్‌లో 100, క్వారంటైన్‌లో మరో 100 బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.
► నెల్లూరు సహా అన్ని డివిజన్స్‌లో హోమ్‌ ఐసోలేషన్‌లో 2,200 బెడ్స్‌ అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

చిత్తూరు జిల్లా:
► చిత్తూరు జిల్లాలో ఆరుగురి కరోనా పరీక్షల వివరాలు రావాల్సి ఉంది. వీరి రక్తపరీక్షలు గతంలో అనుమానంగా ఉన్నాయి.
► జిల్లాలో 11.5 లక్షల మంది లబ్దిదారులు ఉండగా.. 1.64 లక్షల మందికి రేషన్‌  పంపిణీ చేశారు.
► గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
► రాష్ట్రం నుంచి వలస కూలీలుగా వెళ్లిన వారు కర్ణాటక ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లాలో అన్ని వైపుల నుంచి నడిచి వచ్చే ప్రయత్నం చేస్తుండగా, 100కు పైగా చెక్‌పోస్టులలో వారిని నిరోధిస్తున్నారు.

అనంతపురం జిల్లా:
► కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లాలో మరో రెండు శాంపుల్‌ కలెక్షన్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే అనంతపురం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ శాంపుల్‌ కలెక్షన్‌ కేంద్రం ఉండగా, హిందూపురం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు, బత్తలపల్లి ఆర్‌డీటీ ఆస్పత్రిలో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శాంపుల్‌ కలెక్షన్ల కేంద్రాల వల్ల కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలను త్వరితగతిన పరీక్షించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
► మరోవైపు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేదవారికి, వలస కూలీలకు భోజన వసతి కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు, చారిటబుల్‌ ట్రస్‌ లు, దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని కలెక్టర్‌ కోరారు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల లాక్‌డౌన్‌ పరిస్థితులు నెలకొనడంతో పేదవారు భోజన వసతి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేదలు, వలస కూలీలు అందరిని ఆదుకునేందుకు, వారికి భోజన వసతి కల్పించేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై తమ దాతృత్వం చాటుకుని, ఆపత్కాల పరిస్థితిలో పేదవారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ పిలుపునిచ్చారు. 

వైయస్సార్‌ కడప జిల్లా:
► కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కోరారు. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ ప్రధాని ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌ ను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ప్రభుత్వం కరోనా వైరస్‌ నిర్మూలనకు అన్ని విధాలా చర్యలు చేపడుతుందని, ఇందుకు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
► లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ ప్రభుత్వం నేటి నుంచి  బియ్యం, కిలో కందిపప్పు, గోధుమపిండి, చక్కెర, ఇవ్వడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు కార్డుదారులకు రేషన్‌ ఇస్తారని, కాబట్టి కార్డుదారులు రేషన్‌ గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రేషన్‌ షాపుల ముందు షామియానా, మంచినీరు వంటి వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కర్నూలు జిల్లా:
► జిల్లాలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేస్‌ను గుర్తించిన సంజామల మండలం నోస్సం గ్రామం చుట్టూ  3 కి.మీ.లు కరోనా కంటైన్మెంట్‌ జోన్‌ గా, మరో 7 కి. మీ.లు కరోనా బఫర్‌ జోన్‌గా ప్రకటించారు.
► ఆ ప్రాంతమంతా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఇతరులెవ్వరూ అక్కడికి వెళ్లకుండా చూస్తున్నారు. గ్రామస్తులకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. వైద్య బృందాలతో మొత్తం గ్రామ జనాభా 4,242 మందికి మెడికల్‌ స్క్రీనింగ్‌ పూర్తి చేశారు.
► కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తి కాంటాక్ట్‌లోకి వెళ్లిన వచ్చిన 18 మందిని బనగానిపల్లె ప్రభుత్వ క్వారంటైన్‌ కు తరలించి, అవసరమైన చికిత్స చేస్తున్నారు.
► కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని అన్ని కార్యాలయాలలో సోడియం హైపోక్లోరైడ్‌ రసాయన ద్రావణాలను కలెక్టర్‌ వీరపాండియన్‌ స్ప్రే చేయించారు.
► నిత్యావసరాల డోర్‌ డెలివరీ, వికేంద్రీకరించిన, మొబైల్‌ రైతు బజార్ల వ్యవస్థ విజయవంతం కావడంతో కాలేజీల గ్రౌండ్స్‌లో మరిన్ని రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
► ఢిల్లీలో ఇటీవల మత ధార్మిక కార్యాక్రమానికి హాజరై వచ్చిన 21 మందిని సి–బెలగల్‌ క్వారంటైన్‌కు తరలించారు.
► ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ట్రక్‌ డ్రైవర్లకు అవసరమైన నిత్యావసరాలు, మెడికల్‌ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్‌ను టేక్‌ అవే ద్వారా అందజేస్తూ, వారికి హైవే దాబాలలో భోజన వసతి కల్పిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top