
‘సీమ, కోస్తాకు మధ్యలోనే రాజధాని’
రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు మధ్యలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాయచోటి: రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు మధ్యలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని రెండు ప్రాంతాలకు కేంద్ర బిందువుగానైనా ఏర్పాటు చేయాలని, అలా కాకుంటే రెండో రాజధానిగా రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రాజధానిని నిర్మిస్తే వేర్పాటువాదం మళ్లీ తలెత్తడం ఖాయమన్నారు.
శివరామన్ కమిటీ ఇప్పటికీ రాయలసీమలో పర్యటించలేదని, ఆ కమిటీ నిర్ణయం తీసుకోక మందే చంద్రబాబు ముందస్తుగానే రాజధాన్ని ప్రకటించేలా ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోందన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధానిపై నిర్ణయం తీసుకోక పోతే భవిష్యత్తు తరాల వారికి తీరని అన్యాయం చేసిన వారమవుతామన్నారు. తుఫాను తాకిడి, వాతావరణ పరిస్థితులు అనుకూలించని ప్రాంతంలో, తక్కువ స్థలంలోనే రాజధానిని నిర్మించకుండా లక్షలాది ఎకరాలున్న దొనకొండ లాంటి ప్రాంతంలో నిర్మించడం సమంజసంగా ఉంటుందన్నారు.