సైకిల్‌ డీలా... ఫ్యాన్‌ గిరా గిరా!

Andhra Pradesh Assembly Election Exit Poll Results 2019 - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతుందనే విషయం ఎగ్జిట్‌ పోల్స్‌తో స్పష్టమైపోయింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల సమరం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. 6 గంటలు దాటగానే టీవీలు, సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రత్యక్షమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలు తొలి విడతలోనే నిర్వహించడంతో ఫలితాల వెల్లడికి సుదీర్ఘ సమయం పట్టింది. గత నెల 11న పోలింగ్‌ పూర్తి కాగా.. అప్పటి నుంచి నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎట్టకేలకు దేశమంతటా పోలింగ్‌ ముగియడంతో.. ఇక మరో మూడు రోజుల్లో చేపట్టనున్న కౌంటింగ్‌ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతలో ఆదివారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ దాదాపుగా వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాయి. మొదటి నుంచీ రాష్ట్రంలో ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించబోతుందనే విషయం తెలిసిపోయింది. ఈ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలతో జిల్లాలోని టీడీపీ నేతల్లో గుబులు మొదలవగా.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

ఎగ్జిట్‌ పోల్స్‌ను నిశితంగా పరిశీలిస్తే.. జిల్లాలో వైఎస్సార్‌సీపీ 10 నుంచి 12 స్థానాల్లో విజయదుందుబి మోగించబోతుందనే విషయం అర్థమవుతోంది. అదేవిధంగా రెండు పార్లమెంట్‌ స్థానాల్లో కూడా ఆ పార్టీ విజయం ఖాయమైందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ అత్యంత బలంగా ఉన్న తాడిపత్రి, రాప్తాడు, పెనుకొండ తదితర నియోజకవర్గాల్లోనూ ఈ దఫా ఫలితాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నాయనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు, ఫ్యాక్షన్‌.. నేరచరితులకే టీడీపీ అధికంగా సీట్లు కేటాయించింది. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ విద్యావంతులను కొత్తగా బరిలో నిలిపింది. బీసీలకూ ప్రాధాన్యత కల్పించింది. ఈ కోవలోనే సామాన్య సీఐ స్థాయి అధికారి గోరంట్ల మాధవ్, గ్రూప్‌–1 అధికారి తలారి రంగయ్యలు పార్లమెంట్‌ బరిలో నిలిచారు. అలాగే మాజీ ఐపీఎస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ పరిణామాలన్నీ ఓటర్లను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా కురుబ, బోయ ఓటర్లతో పాటు బీసీలు ఆ పార్టీకి అండగా నిలిచినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పకనే చెబుతున్నాయి. 2014తో పాటు 2019లోనూ జిల్లాలో టీడీపీ ఒక్క మైనార్టీ అభ్యర్థికి కూడా టిక్కెట్‌ కేటాయించలేకపోయింది. కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించింది. ఫలితంగా మైనార్టీ ఓటర్లు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచినట్లు స్పష్టమవుతోంది.  

కంచుకోటకు బీటలే.. 
గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం, టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్థికంగా ఎదగడం మినహా ప్రజా సంక్షేమాన్ని విస్మరించడంతో ప్రజలు మార్పును కోరుకున్నారనే విషయం ఎగ్జిట్‌ పోల్స్‌ను బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా.. ఈ సారి ఫలితం ఏకపక్షంగా ఉండబోతుందనే విషయం అర్థమైపోయింది. దాదాపు 10 నుంచి 12 స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి గెలవబోతుందనే విషయం తెలిసి టీడీపీ నేతలు డీలాపడ్డారు. ఈ పరిణామం ఫలితాలకు మూడు రోజుల ముందుగానే వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో విజయోత్సాహం నింపుతోంది. 
స్వయంకృతాపరాధమే.. 
టీడీపీ శ్రేణులను మొదటి నుంచీ ఓటమి భయం వెంటాడుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుండటం, వ్యక్తిగతంగా ఎదిగేందుకు మాత్రమే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆస్తులు కూడబెట్టుకునే విషయంలోనే తలమునకలు కావడం ఆ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇదే సమయంలో అంతర్గత కుమ్ములాటలు నేతల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసింది. మొత్తంగా స్వయంకృతాపరాధమే తమ పార్టీ కొంప ముంచనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

విశ్వసనీయత కోల్పోతున్న లగడపాటి 
ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ వైఎస్సార్‌సీపీకి పట్టం కడితే.. ఒక్క లగడపాటి మాత్రమే టీడీపీకి కొమ్ము కాయడంతో ప్రజల్లో ఆయన సర్వేకు విశ్వసనీయత లేకుండా పోతోంది. గత తెలంగాణ ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతుందనే తేల్చి చెప్పగా.. లగడపాటి మాత్రమే కాంగ్రెస్‌ వస్తుందనే జోస్యం చెప్పారు. తీరా ఫలితాల ప్రకటన తర్వాత పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు భంగపాటు తప్పదనే చర్చ జరుగుతోంది.  

బెట్టింగ్‌ రాయుళ్లలో వణుకు 
ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడగానే బెట్టింగ్‌రాయుళ్లలో వణుకు మొదలైంది. వాస్తవానికి పోలింగ్‌ పూర్తయినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టబోతుందనే విషయం తేటతెల్లమైంది. జిల్లాలోనూ టీడీపీ ముఖ్య నేతలకు సైతం ఓటమి తప్పదని పోలింగ్‌ సరళిని బట్టి అర్థమైపోయింది. అయినప్పటికీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు బెట్టింగ్‌రాయుళ్లు హాట్‌ సీట్లపై బెట్టింగ్‌కు సిద్ధపడ్డారు. అయితే ఈ పందెం 1:2 స్థాయిలో సాగింది. అంటే.. వైఎస్సార్‌సీపీ తరపున బెట్టింగ్‌  వేసే వ్యక్తి రూ.2వేలు పెడితే.. టీడీపీ తరఫున బెట్టింగ్‌ కట్టే వ్యక్తి రూ.1000 ఇస్తారు. రాప్తాడు, ధర్మవరం, రాయదుర్గం, అనంతపురం తదితర నియోజకవర్గాలపై బెట్టింగ్‌ అధికంగా సాగింది. తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్‌ రాయుళ్లు పునరాలోచనలో పడ్డారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top