కృత్తివెన్ను..కృష్ణా కోనసీమ

కృత్తివెన్ను..కృష్ణా కోనసీమ - Sakshi

  • రాష్ట్రాన్ని దాటుతున్న కొబ్బరి ఉత్పత్తులు

  •  రైతులను ఆదుకుంటున్న కొబ్బరిసాగు

  •  పరిశ్రమలకు నోచని వైనం

  • కనుచూపు మేరలో కొబ్బరిచెట్ల అందాలతో కనువిందుచేసే కృత్తివెన్ను మండలం కృష్ణా జిల్లా కోనసీమగా పేరుపొందింది. వందల ఎకరాల్లో విస్తరించిన కొబ్బరి చెట్లు రైతులకు ఆదాయం అందించడంతోపాటు కూలీలకు ఉపాధి చూపుతున్నాయి. పొలం గట్లు, చేపలచెరువు గట్టులపైనా కొబ్బరి సాగు సాగుతోంది. కొబ్బరి కాయలు, బొండాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతవుతున్నాయి.

     

     కృత్తివెన్ను : కృష్ణా జిల్లా కోనసీమగా ప్రసిద్ధి గాంచిన కృత్తివెన్ను మండలం నుంచి కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. మండలంలోని చినగొల్లపాలెందీవిలో కొబ్బరే ప్రధాన పంట. అయితే మండల వ్యాప్తంగా ఇంచుమించు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లు ఉన్నాయి. వరి, ఆక్వా సాగుతోపాటు కొబ్బరి ఉత్పత్తులు కూడా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నాయి.



    చినగొల్లపాలెం దీవిలో 800 ఎకరాల పైచిలుకు భూముల్లో కొబ్బరి ప్రధాన పంటగా సాగవుతోంది. రైతులకు ఆదాయం సమకూరుస్తున్న ఈ కొబ్బరి సాగు కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తోంది. ఏటా వేల సంఖ్యలో లారీల్లో ఇక్కడి నుంచి కొబ్బరి ఉత్పత్తులు మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి.



    రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో సైతం దీవి వాసులు జలమార్గం ద్వారా పడవలపై సుదూర ప్రాంతాలకు కొబ్బరి ఉత్పత్తులు సరఫరా చేసేవారు. దీంతో పాటు మండలంలోని మిగిలిన గ్రామాల్లో పంట పొలాలు చేపలు, రొయ్యల చెరువుల వెంబడి పెద్ద ఎత్తున కొబ్బరిచెట్ల       సాగు జరుగుతోంది. దీని ద్వారా వ్యవసాయంతో పాటు రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.

     

    వేసవిలో బొండాల ఎగుమతి



    ఒక్కొక్క కొబ్బరి చెట్టు నుంచి రైతుకు సంవత్సరానికి వెయి రూపాయల నుంచి రూ.1500 వరకూ ఆదాయం సమకూరుతోంది. వేసవిలో పెద్ద ఎత్తున కొబ్బరి రైతులు బొండాల ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి నిత్యం వేసవిలో సుమారు 50 వేల నుంచి 70 వేల బొండాలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ప్రాంతానికి రెండో పంట సైతం లేని రోజుల్లో రైతులను కొబ్బరి చెట్లు ఆదుకున్నాయని అంటే అతిశయోక్తి కాదు.



    కృత్తివెన్ను మండలంలో పెద్ద ఎత్తున కొబ్బరి సాగుతోంది. ఎగుమతులు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. అయితే కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఒక్కటి కూడా లేకపోవడాన్ని మండల ప్రజలు దురదృష్టంగా భావిస్తున్నారు. సంబంధిత పరి శ్రమలను ఈ ప్రాంతంలో స్థాపిస్తే మంచి గిట్టుబాటు ధరతో పాటు ఇక్కడి ప్రజల నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని రైతులు పేర్కొం టున్నారు. కొత్త రాష్ట్రంలో పాలకులు తీరప్రాంతమైన మండల ంలో దృష్టిసారించి పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా పనిచేస్తే తమ జీవితాల్లోనూ వెలుగులు నింపిన వారవుతారని స్థాని కులు సూచిస్తున్నారు.

     

     పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు

     నేను 30 ఏళ్లుగా కొబ్బరి కాయలు వలుస్తున్నా. రోజంతా కష్టపడినా చాలీచాలని జీతమే. మా మండలానికి కొబ్బరి అనుబంధ పరిశ్రమలైనా వస్తే నాలాంటి వారితో పాటు చదువుకున్న నిరుద్యోగులకు పని దొరుకుతుంది.

     -బుల్లబ్బాయి, కృత్తివెన్ను

     

     ఒళ్లు హూనమవుతోంది

     కొబ్బరి ఒలుపు కార్మికుడిగా 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఒళ్లు హూనం అవటమే గానీ గిట్టుబాటు కూలి లభించడంలేదు. మా లాంటి వారి కష్టాలు తీరాలంటే మా ప్రాంతానికి కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి.                

     - రంగ, అడ్డపర్ర

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top