కరువు సీమలో.. పాలవెల్లువ

Anantapur district Kattakindapalli is the ideal for Milk production - Sakshi

ఆదర్శంగా నిలిచిన అనంతపురం జిల్లా కట్టకిందపల్లి  

గ్రామస్తులంతా పశుపోషణలోనే నిమగ్నం 

పాల ఉత్పత్తితో ఉపాధి పొందుతున్న వైనం

అనంతపురం రూరల్‌: ‘అనంత’ కరువుకు చిరునామా. తీవ్ర వర్షాభావంతో దుర్భిక్ష పరిస్థితుల్ని ఎదుర్కొన్న ప్రాంతం. ఏటా నష్టాలతో రైతులంతా కుదేలయ్యారు. చాలామంది పొట్టచేతబట్టుకుని వలస వెళ్లగా...అనంతపురం మండలం కట్టకిందపల్లి గ్రామ రైతులు మాత్రం ప్రత్యామ్నాయం ఆలోచించారు. పంటల సాగును పక్కనపెట్టి పాడిని నమ్ముకున్నారు. ఒకరిని చూసి మరొకరుగా ఊరంతా పశు పోషణపైనే ఆధారపడ్డారు. ఈ గ్రామంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 5 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అనంతపురం నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలుండగా.. 1,300 మంది జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఐదారు గేదెలు కనిపిస్తాయి.  353 కుటుంబాలు (90 శాతం మంది) ప్రత్యక్షంగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారి నుంచి పాలను సేకరించి నగరంలో విక్రయిస్తూ పరోక్షంగా పదుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి.

అనంతపురం జిల్లా కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు దంపతులు జనార్దనరెడ్డి, రాధ. గతంలో వ్యవసాయం చేసేవారు. తీవ్ర వర్షాభావం వల్ల పంట కోసం పెట్టిన పెట్టుబడులు సైతం రాక తీవ్ర అవస్థలు పడేవారు. ఈ పరిస్థితుల్లో పశువుల పెంపకంపై దృష్టి సారించారు. ఐదెకరాల పొలం ఉండటంతో ఎకరం విస్తీర్ణంలో గడ్డి పెంపకం చేపట్టి పశుపోషణ చేశారు. మొదట్లో ఒక గేదెతో ప్రారంభమైన వారి పాల వ్యాపారం.. ఇప్పుడు 8 గేదెలకు పెరిగింది. లీటరు పాలు రూ.50 చొప్పున రోజూ 70 లీటర్లు విక్రయిస్తున్నారు. ‘నెలకు దాదాపు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగులుతోంది. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం’ అని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
-జనార్దనరెడ్డి, రాధ

మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులు  
గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల ద్వారా నీరు రాక ఇదే గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పటికే గ్రామంలోని కొందరు పశు పోషణ చేపట్టి రాణిస్తుండటాన్ని చూసి వారూ అదే బాట పట్టారు. తొలుత 8 లీటర్ల పాలతో ప్రారంభమైన వారి వ్యాపారం నేడు 80 లీటర్లు విక్రయించే స్థాయికి చేరింది. ‘వ్యవసాయం చేస్తూనే పశు పోషణ చేపట్టి పాలను విక్రయిస్తున్నాం. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నాం’ అని మధుసూదన్‌రెడ్డి, రేణుక చెప్పారు. 

సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి
కట్టకిందిపల్లి రైతులను మరింత ప్రోత్సహించేందుకు స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్‌ జిల్లా ములకనూరు డెయిరీ తరహాలో రాప్తాడు నియోజకవర్గంలోను సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. త్వరలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల సభ్యులతో పాలను కొనుగోలు చేయించి పాలకు గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాం
పాడిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం 5 గేదెలను పెంచుతున్నాం. పాలను విక్రయించి నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా.  
– గోపాల్‌రెడ్డి కట్టకిందపల్లి

మా గ్రామంలోనే డెయిరీ ఏర్పాటు చేయాలి
మా గ్రామంలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేస్తే పాడి రైతులకు మేలు జరుగుతుంది. పశు వైద్యశాల నెలకొల్పడంతో దాణా పంపిణీ చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. 
– నాగలక్ష్మమ్మ, కట్టకిందపల్లి

సహకారం అందిస్తాం
పాడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలతో పాటు దాణా పంపిణీ చేయడానికి చర్యలు ప్రారంభించాం. గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం తీసుకెళతాం. 
– డాక్టర్‌ సన్యాసిరావు, జేడీ, పశు సంవర్ధక శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top