కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లా ప్రజల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చడానికి తుంగభద్ర జలాశయం ఒక్కటే శరణ్యం.
కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లా ప్రజల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చడానికి తుంగభద్ర జలాశయం ఒక్కటే శరణ్యం. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో పేరుకుపోయిన పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 103 టీఎంసీలకు పడిపోయింది. నీటి వినియోగం కూడా 230 నుంచి 170 టీఎంసీలకు పడిపోయింది. మొత్తం మీద నీటి నిల్వ సామర్థ్యంలో 33 టీఎంసీలు, వినియోగంలో 60 టీఎంసీలు తగ్గిపోయింది.
దీంతో దామాషా ప్రకారం కాలువలకు రావాల్సిన నీటి కోటాలో కోత విధిస్తున్నారు. ఫలితంగా అనంతపురం జిల్లాకు కేటాయింపులు తగ్గిపోయి సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రతి ఏటా వరదలు వచ్చినపుడు తుంగభద్ర జలాశయం నిండిపోయి వందలాది టీఎంసీల నీరు వృధాగా వెళ్లిపోతోంది. ఈ ఏడాది ఇప్పటికే 70 టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయింది. ఈ నీటిని వాడుకునే విధంగా వరద కాలువ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) నిర్మాణం జరగాలని గతంలో పలుమార్లు బళ్లారి, అనంతపురం జిల్లాల ఇరిగేషన్ అధికారులు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఎలాంటి ఫలితం రావడం లేదు. అధికారులు కాకుండా ఇరు ప్రభుత్వాల సీఎంలు భేటీ అయి చర్చిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందుకు బళ్లారి, అనంతపురం జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగాలి.
సమాంతర కాలువ ఏర్పాటు చేస్తే రెండు జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇదిలాగుండగా శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వరకు నీరు వచ్చే వరకు కిందకు నీటిని విడుదల చేయకూడదని నిబంధన. అయితే ఈ ఏడాది అధికారులు 754 అడుగులకే నీటిని కిందకు వదిలేశారు. ఇలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో హంద్రీ-నీవా కాలువకు క్రిష్ణా జలాలు రావడం కష్టమే. ఈ పరిస్థితిలో సాధ్యమైనంత నీటిని తుంగభద్ర ద్వారా తెచ్చుకోవడమే ‘అనంత’కున్న ఏకైక మార్గం. ఇందుకు సమాంతర కాలువను మించిందిలేదంటున్నారు నిపుణులు.. సామాజిక, రాజకీయ వేత్తలు. వారి అభిప్రాయాలు ఇలా..
ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలి
అనంతపురం, బళ్లారి జిల్లాల వంటి మెట్ట ప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు తుంగభద్ర జలాశయం వరద నీటిని వాడుకునేందుకు సమాంతర కాలువ ఏర్పాటు విషయంలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు స్పందించాలి. ఇందుకు ఏపీ ప్రభుత్వమే మరింత చొరవ తీసుకోవాలి. మెకంజీ తుంగభద్ర జలాశయం నిర్మాణానికి రూపకల్పన చేశారు. అప్పటి కర్ణాటక ప్రభుత్వం 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో, 230 టీఎంసీల నీటి వినియోగంతో జలాశయాన్ని నిర్మించారు. నీటి ఆవిరి, పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 103 టీఎంసీలు, వినియోగ సామర్థ్యం 164 టీఎంసీలకు తగ్గిపోయింది. ఫలితంగా హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్‌కు కేటాయించిన జలాల్లో ప్రతి యేటా కోతపడుతోంది. హెచ్‌ఎల్‌సీకీ 32.5 టీఎంసీలు కేటాయింపులు ఉండగా, ఎప్పుడు ఈ మేరకు రావడం లేదు. గతంలో సమాంతర కాలువ అంటే బళ్లారి జిల్లా ప్రజలు భయపడేవారు. ఇప్పుడు వారిలో కూడా చైతన్యం వచ్చింది. సమాంతర కాలువ కోసం అక్కడి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు.
దీంతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు సమాంతర కాలువ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. కాలువ నిర్మాణానికి, భూసేకరణకు అవసరమైన డబ్బులు మేమే భరిస్తామని చెప్పినా కర్ణాటక ప్రభుత్వం ముందుకురాలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని చర్చలు సాగించాలి.
- ఇమాం, కదలిక ఎడిటర్, అనంతపురం.
కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడం లేదు
తుంగభద్ర జలాశయం నుంచి వృథాగా వెళ్లే వరద నీటిని జిల్లాకు మళ్లించుకునేందుకు వరద కాలువ ఏర్పాటు మంచిదే. అయితే అందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆ ప్రభుత్వం ముందుకు వస్తే చర్చలు జరిపి కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా బళ్లారిలో కొంత మంది రైత నాయకులు దీనిపై రాజకీయం చేస్తున్నారు. సానుకూల వాతవరణం ఏర్పడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అయినప్పటికీ వరద కాలువ ఏర్పాటుకు కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. తుంగభద్ర నుంచి జిల్లాకు 32.5 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా ప్రతి ఏడాది 22 టీఎంసీలకు మించి రావడం లేదు. ప్రతి ఏడాది మన వాటా నష్టపోతూనే ఉన్నాము.
- కాలవ శ్రీనివాసులు,
ప్రభుత్వ చీఫ్‌విప్, రాయదుర్గం
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
జిల్లాలో కరువు నివారణకు వరద కాలువే శరణ్యం. ఈ కాలువ నిర్మించాలని చాలా ఏళ్లుగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య చర్చలు జరుగుతున్నా ఫలితం కనిపించలేదు. వరద కాలువ వల్ల బళ్లారి రైతులకూ ఎంతో ఉపయోగం. కొత్తగా ప్రాజెక్టులు నిర్మించడంతో పోలిస్తే వరద కాలువ నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుంది. వృధాగా దిగువకు పారే నీటిని ఉపయోగించుకునేందుకు అక్కడి రైతులూ ఇపుడు సుముఖంగా ఉన్నారు. ఎటొచ్చీ అంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇపుడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. దీనిపై అసెంబ్లీలో మాట్లాడుతాను. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వరద కాలువ నిర్మాణానికి చొరవ చూపేలా వెంటపడతాము. ఈ విషయంపై ప్రజాప్రతినిధులందరూ మూకుమ్మడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలి.
- వై.విశ్వేశ్వరరెడ్డి,
ఎమ్మెల్యే, ఉరవకొండ
హెచ్చెల్సీ సామర్థ్యం పెంచాలి
వరద కాలువ నిర్మించడం అనేది యుద్ధప్రాతిపదికన జరగాలి. లేదంటే ఇపుడున్న హెచ్చెల్సీ కాలువను 6,500 క్యూసెక్కుల సామర్థ్యం మేరకు విస్తరించాలి. ఏటా వందలాది టీఎంసీల నీరు దిగువకు వృధాగా పోతోంది. డ్యాంలో పూడిక పేరుకు పోవడంతో ఏడాదికేడాది జిల్లాకు రావాల్సిన కోటా లో కోత పడుతోంది. ఎన్నో ఏళ్లుగా వర ద కాలువ కోసం పోరాటం చేస్తున్నాం. ఇన్నాళ్లూ కర్ణాటక ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంత రైతులు వరద కాలువకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. కర్ణాటక ముఖ్యమంత్రిని చర్చలకు ఆహ్వానించాలి.
- అనంత వెంకటరామిరెడ్డి,
మాజీ ఎంపీ, అనంతపురం
చిత్తశుద్ధితో చొరవ చూపాలి
అనంతపురం జిల్లాకు ప్రధానమైన నీటి వనరు తుంగభద్ర జలాశయమే. అయితే ఏ ఏటికాయేడు ఈ జలాశయం నుంచి జిల్లాకు కేటాయింపులు తగ్గిపోతున్నాయి. జిల్లాకు 32 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఏనాడు ఆ మేర వచ్చిన దాఖలాలు లేవు. అయితే జలాశయంలో పూడికపేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. ప్రతి ఏడాది ఎగువ ప్రాంతాల్లో కురిసే వరదల వల్ల భారీ పరిమాణంలో నీరు వృథాగా కిందకు పోతోంది.
ఇలా వెళ్లిపోయే వరద నీరు అనంతపురం జిల్లాకు మళ్లించుకోవాలంటే హెచ్‌ఎల్‌సీకి సమానంగా వరద కాలువ నిర్మిస్తే అటు బళ్లారి, ఇటు అనంతపురం జిల్లా ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీరుతాయి. అయితే పాలకులు ఆ మేరకు చిత్తశుద్ధి కనబరచడం లేదు. గతంలో సీఎంగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి సైతం వరద సమాంతర కాలువ కోసం తిరుపతిలో కర్ణాటక ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినా అది సాకారం కాలేదు. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేకపోవడంతోనే వరద కాలువ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. నిజంగా ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కర్నాటక ప్రభుత్వాన్ని ఒప్పించి వరద కాలువ తవ్వకానికి మార్గం సుగమం చేయాలి.
- ఓబుళకొండారెడ్డి, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, అనంతపురం.
ఇక జాప్యం చేయకూడదు
ప్రతి ఏడాది కర్ణాటకలో కురిసే వరదలతో తుంగభద్ర జలాశం నిండిపోయి అందులోని వరద నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలిసి పోతోంది. దీంతో వందలాది టీఎంసీల నీరు రైతులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోతోంది.
ఇలా వృధాగా వెళ్లే నీటిని ఉపయోగించుకునేందుకు హెచ్‌ఎల్‌సీకీ పైన సమాంతరంగా సమాంతర కాలువ ఏర్పాటు చేస్తే అనంతపురం జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం అదనంగా చేయాల్సిందేమీ లేదు. వరద జలాలు అనేవి సహజ సిద్ధంగా వచ్చేవే. వాటి కోసం పంపింగ్ అవసరం లేదు. ఏమంటే వారు సమాంతర కాలువ ఏర్పాటుకు ఓకే చెబితే చాలు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ.. కేంద్రంలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఉంది కాబట్టి కేంద్ర జల సంఘం ద్వారా పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు. ఈ కాలువ వల్ల కర్ణాటక రైతులకు కూడా ఉపయోగం ఉన్న దృష్ట్యా ఆ రాష్ట్రం కూడా సమ్మతించే అవకాశం ఉంది. ఇకనైనా ఏపీ ప్రభుత్వం మేల్కోకపోతే ప్రజలు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం.
- జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి, అనంతపురం.
ఇదే సరైన సమయం
ఎన్నో ఏళ్లుగా వర ద కాలువ నిర్మా ణం గురించి చర్చ జరుగుతోంది. ఆచరణలో సాధించింది శూన్యం. ఏపీ ప్రభుత్వం చూపాల్సినంత చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో పుట్టపర్తికి వచ్చినపుడు ఏపీ సీఎం జనార్ధనరెడ్డి, కర్ణాటక సీఎం బంగారప్ప పీవీ సమక్షంలో వరద కాలువ నిర్మాణంపై చర్చించారు. తర్వాత ఆ చర్చ ముందుకు సాగలేదు.
సార్వత్రిక ఎన్నికల ముందు బెంగళూరులో ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి రాష్ట్రం తరఫున అప్పటి మంత్రులు రఘువీరారెడ్డి, సుదర్శనరెడ్డి హాజరయ్యారు. చర్చ కొంత మేర ఫలితం వచ్చేలా సాగింది. తదుపరి చర్చ హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించా రు. ఈ పరిస్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని కర్ణాటక సీఎంను చర్చలకు ఆహ్వానించడానికి ఇదే సరైన తరుణం. వారిద్దరూ కూర్చుని మాట్లాడితేనే ఫలితముంటుంది.
- సి.విశ్వనాథ్, సీనియర్ పాత్రికేయుడు, అనంతపురం
చర్చలు కొనసాగించాలి
తుంగభద్ర జలాశం నుంచి అనంతపురం జిల్లా వరకు సమాంతర కాలువ విషయంలో మేం చేసేది ఏమీ లేదు. అడిగితే అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించడం వరకే మా పని. అయితే ప్రతి ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి వృథాగా వెళ్తున్న నీటికి అడ్డుకట్టవేసి ఆ నీటిని జిల్లాకు రప్పించేందుకు సమాంతర కాలువ ఏర్పాటు చేస్తే అనంతపురం జిల్లాకే కాకుండా బళ్లారి, వైఎస్‌ఆర్ జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇందుకు కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల సీఎంలు ఇద్దరూ కూర్చొని చర్చించాల్సి ఉంది. ప్రస్తుత హెచ్‌ఎల్‌సీ కెనాల్‌కు ఎగువన సమాంతర కాలువ చేపడితే అనంతపురం జిల్లాకు సాగు, తాగునీటి కష్టాలు తప్పుతాయి.
- ధనుంజయరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,
నీటిపారుదల శాఖ, అనంతపురం
జనం ఆందోళన బాట పట్టకముందే మేల్కోండి
తుంగభద్రకు ఏటా వరద వస్తోంది.. వందలాది టీఎంసీల నీరు దిగువకు వృధాగా వెళ్తోంది.. అదిగో వరద కాలువ.. ఇదిగో వరద కాలువ అంటూ ఏటా జూలై, ఆగస్టు నెలలో నాలుగు మాటలు మాట్లాడి చేతులు దులుపుకుంటున్నారు మన ప్రజాప్రతినిధులు. రాష్ట్ర విభజన తర్వాత అవశేషాంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి.
అభివృద్ధి అంతా ఆ మూడు జిల్లాల(విశాఖ, కృష్ణా, గుంటూరు)కే పరిమితమయ్యే స్థితి కళ్లకు కడుతోంది. ఈ స్థితిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ జిల్లా కరువును శాశ్వతంగా రూపుమాపుతామని ప్రభుత్వం చెప్పే మాటలు ఎంత వరకు నమ్మశక్యమో ప్రశ్నార్థకం. ఈ స్థితిలో హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ నిర్మిస్తే జిల్లాలో సగం కరువు తీరుతుంది. దీని కోసం జనం ఆందోళనకు సిద్ధమవక ముందే ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
- వి.కె.రంగారెడ్డి, అనంత అభివృద్ధి
సాధన సమితి కన్వీనర్