అవినీతి, వివాదాస్పదునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి డీఎస్పీ వీఎస్‌ఆర్ మూర్తిపై వేటు పడింది. ఆయన్ని ఏఆర్ (ఆర్మ్‌డ్ రిజర్వుడ్) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఉత్తర్వులు జారీ చేశారు.
అనకాపల్లి, న్యూస్‌లైన్ :
అవినీతి, వివాదాస్పదునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి డీఎస్పీ వీఎస్‌ఆర్ మూర్తిపై వేటు పడింది. ఆయన్ని ఏఆర్ (ఆర్మ్‌డ్ రిజర్వుడ్) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి డీఎస్పీ బాధ్యతల్ని అదనపు ఎస్పీ డి.నందకిశోర్‌కు అప్పగించారు. డీఎస్పీపై వచ్చిన పలు ఆరోపణలపై విచారణ అనంతరం ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి ముగింపు పలికినట్లయింది.
డీఎస్పీ మూర్తి అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు ప్రాధాన్యతిస్తూ, మంత్రి గంటా శ్రీనివాసరావు అడుగులకు మడుగులొత్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
సమైక్య ఉద్యమంలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన లక్షగళ గర్జనలో ఆయన అతిగా వ్యవహరించారు. పరిరక్షణ సమితి సభ్యులను బెదిరించడంతో పాటు అధికార పార్టీ నేతను స్టేజీపైకి ఎక్కించాలని ఒత్తిడి చేశారు. ఉద్యమ దీక్షలకు అనుమతి ఇవ్వడంలో వివక్ష కనబరిచారన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటిపై సమైక్యవాదులు డీఎస్పీ వైఖరికి నిరసనగా పట్టణ బంద్ కూడా నిర్వహించారు. ఎస్పీకి రాజకీయ నాయకులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు సమగ్రంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన డీఎస్పీ మూర్తిపై విచారణ జరపాలని అడిషనల్ ఎస్పీ డి. నందకిషోర్‌ను ఆదేశించారు. ఆ మేరకు విచారణ జరిపి ఎస్పీకి నివేదిక సమర్పించారు. అనంతరం డీఎస్పీ చర్యకుపక్రమించారు. రూరల్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఇక్కడ అప్పటికే పనిచేస్తున్న డీఎస్పీ చంద్రబాబును విజయనగరంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో అక్కడికి పంపారు. మూర్తి స్థానంలో ఆ బాధ్యతలను అడిషనల్ ఎస్పీ నందకిషోర్‌కు అదనంగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గంటాకు ఎదురుదెబ్బ...
డీఎస్పీపై వేటు నిర్ణయంతో మంత్రి గంటా, ఆయన వర్గీయులకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. నేతల అడుగులకు మడుగులొత్తుతూ ఏకపక్షంగా వ్యవహరించే అధికారులకు ఇలాంటి పరిణామం కనువిప్పు కలిగిస్తుందన్న భావన పట్టణ వాసుల్లో వ్యక్తమవుతోంది