జిల్లాలో ఇందిరమ్మ అమృతహస్తం పథకం పకడ్బందీగా అమలు చేయాలని ఐసీడీఎస్ సంయుక్త సంచాలకురాలు సరళ రాజ్యలక్ష్మీ అన్నారు.
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇందిరమ్మ అమృతహస్తం పథకం పకడ్బందీగా అమలు చేయాలని ఐసీడీఎస్ సంయుక్త సంచాలకురాలు సరళ రాజ్యలక్ష్మీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో ఐకేపీ, ఐసీడీఎస్, ఐసీపీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమృతహస్తం పథకంలో చాలా సమస్యలు నెలకొంటున్నాయని, అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాలికలు, తల్లులకు ఇందిరమ్మ అమృతహస్తం కింద ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ఐకేపీ, ఐసీడీఎస్ సిబ్బంది పథకాన్ని ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు.
అందరూ కలిసి పనిచేస్తేనే పథ కం పకడ్బందీగా అమలవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేస్తూ పథకం అమలు తీరుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పథకం అమలు, అంగన్‌వాడీల పనితనంపై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రోగ్రాం అధికారి శివల్‌కర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీ, డీసీపీవో రాజేంద్రప్రసాద్, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.