అన్ని అక్రమ కట్టడాలు తొలగిస్తాం: మంత్రి బొత్స

All Illegal Buildings Will be demolished, Says Minister Botsa Satyanarayana - Sakshi

ఈ రోజే బాబు నివాసాన్ని కూల్చేస్తున్నారని దుష్ప్రచారం

లింగమనేని నివాసం అక్రమ కట్టడమే

మంత్రి బొత్స స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కృష్ణానది కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలకు గతంలోనే నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నోటీసులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారని, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసాన్ని ఈ రోజు (సోమవారం) కూల్చేస్తున్నామంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు పాతురి కోటేశ్వరరావు భవనంలోని అక్రమ కట్టడాలు తొలగించామని తెలిపారు. చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌ అక్రమ కట్టడమేనని, చంద్రబాబు కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారని బొత్స గుర్తు చేశారు. 

రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా ఆ రోజు ఈ భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు అంగీకరించారని, కానీ, ఇప్పుడేమో దానిపై  మాట మారుస్తున్నారని బొత్స తప్పుబట్టారు. లింగమనేని నివాసానికి కూడా నోటీసులు ఇచ్చామని, చట్టప్రకారం అన్ని అక్రమ కట్టడాలను తొలగిస్తామని బొత్స తేల్చిచెప్పారు. సీఆర్‌డీఏ పరధిలోని అన్ని అక్రమ కట్టడాలు తొలగిస్తామని ఆయన తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top