మంత్రి సోమిరెడ్డికి మరోసారి షాక్‌! | Agriculture Officials Shocks Minister Somireddy | Sakshi
Sakshi News home page

మంత్రి సోమిరెడ్డికి మరోసారి షాక్‌!

May 1 2019 3:03 PM | Updated on May 1 2019 3:57 PM

Agriculture Officials Shocks Minister Somireddy - Sakshi

మంత్రి సోమిరెడ్డికి అధికారులు రెండో రోజు కూడా ఝలక్‌ ఇచ్చారు..

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ అధికారులు రెండో రోజు కూడా ఝలక్‌ ఇచ్చారు. మంత్రి సమీక్షకు బుధవారం కూడా హాజరు కాకుండా ఆయనకు షాక్‌ ఇచ్చారు. మంత్రి సోమిరెడ్డి నిన్న ఉద్యానవన శాఖ సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఆ సమీక్షకు వ్యవసాయ శాఖ అధికారులు ఏవరూ హాజరుకాకపోవటంతో ఖంగుతిన్నారాయన. చేసేదేమీ లేక సమీక్షను రద్దు చేసుకున్నారు. ఈ రోజైనా సమీక్ష నిర్వహించాలని భావించిన సోమిరెడ్డి! అధికారులు రావాలని ఆదేశించారు. కానీ నిన్నటి మాదిరిగానే వ్యవసాయ అధికారులు హాజరుకాకపోవటంతో భంగపడ్డ మంత్రి సమీక్ష రద్దు చేసుకున్నారు.

నిన్న ఏం జరగింది : ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలోనే వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించేందుకు ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చారు. సమీక్షకు హాజరు కావాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డితోపాటు ఇతర సిబ్బందికి ఆయన కార్యాలయం సమాచారం అందించింది. అయితే, ఎన్నికల కోడ్‌ ఉండటంతో సమీక్షకు హాజరయ్యే విషయంలో ఎన్నికల సంఘాన్ని అధికారులు స్పష్టత కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి సమీక్షకు వారు దూరంగా ఉన్నారు.

అధికారుల కోసం సచివాలయంలో  ఉదయం నుంచి దాదాపు మూడు గంటలపాటు వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి.. ఎంతకూ అధికారులు రాకపోవటంతో తిరిగి వెళ్లిపోయారు. తన సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, తన సమీక్షకు అధికారులు రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని గతంలో సోమిరెడ్డి ప్రకటించారు. అయినా, సోమిరెడ్డి సమీక్షకు అధికారులు రాకపోవడం.. సమీక్ష జరగకపోవడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని భావించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement