ఉపాధి పేరిట గాలం | Sakshi
Sakshi News home page

ఉపాధి పేరిట గాలం

Published Thu, Mar 1 2018 9:13 AM

Agents for red wood smuggling Daily workers - Sakshi

పేదల అమాయకత్వం, పేదరికాన్ని కొందరు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపాధి కల్పిస్తామని నమ్మబలుకుతున్నారు. వారికి ముందుగా కొంత నగదు ఇస్తున్నారు. ఎర్రచందనం దంగలను నరికేందుకు శేషాచలం అడవుల్లోకి తరలిస్తున్నారు. అసలు విషయం తెలుసుకున్న పేదలు డబ్బు తిరిగి చెల్లించి వెనక్కి వెళ్లలేక మనసు చంపుకుని అడవుల్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా సరిహద్దు తమిళనాడులోని పలు గ్రామాల నుంచి శేషాచలం అడవుల్లోకిళ్లే కూలీల సంఖ్య పెరుగుతూనే ఉంది.

పలమనేరు : జిల్లాకు ఆనుకుని ఉన్న వేలూరు, గుడియాత్తం, పేర్నంబట్, క్రిష్ణగిరి, కావేరిపట్నం, ధర్మపురి ప్రాంతాల్లోని అటవీ సమీప ప్రాంత వాసులతోపాటు పలమనేరు, కుప్పం నియోజకవర్గంలోని మండిపేట కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాదికాలనీ, సెంటర్, నెల్లిపట్ల, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీ పెంట, గాంధీనగర్, జగమర్ల, దేవళం పెంటతో పాటు పెద్దపంజాణి, వీకోట, కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లోని అటవీ సమీప గ్రామాల ప్రజలు గతంలో అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరించి పొట్టపోసుకునేవారు. మరికొందరు అడవుల్లో పశువులను మేపుకునేవారు. ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లేవారు. కొంతకాలంగా వీరికి ఉపాధి కరువైంది. కుటుంబాలు గడవడం కష్టం మారింది. వీరి ఆకలిని ఆసరాగా తీసుకున్న ఎర్రచందనం ముఠాలు గాలం వేస్తున్నాయి.

ముందుగానే అడ్వాన్సులు
చిత్తూరు జిల్లాలో వెంచర్ల నిర్మాణం, కేబుల్‌ కొట్టే పనులు, చెట్లను కొయ్యడం లాంటి పనులు ఉన్నాయని కూలీలను నమ్మిస్తున్నారు. యువకులను ఎంపిక చేసుకుంటున్నారు. గ్రామంలోని పెద్దమనిషి ముందు వారికి బయానాగా రూ.పది వేల దాకా నగదు ఇస్తున్నారు. తాము చెప్పినప్పుడు పనికిరావాలని పేర్కొంటున్నారు. కష్టాల సమయంలో వచ్చిన డబ్బును వారు ఖర్చు పెట్టేస్తారు. దీంతో చేసేది లేక ఏజెంట్లు పంపిన చోట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతాలకు చెందిన పదుల సంఖ్యలో కూలీలు కొన్నేళ్లుగా ఇళ్లకు రాకుండా పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు అదృశ్యమైనా వారి కుటుంబ సభ్యులు  సైతం పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.

కొండకెళ్లే భక్తుల్లా జిల్లాలోకి
ఈ కూలీలు తిరుమలకు వెళ్లే భక్తుల్లా లగేజీతో బస్సుల్లో జిల్లాలోకి అడుగు పెడుతున్నారు. ఇంకొందరు కాలినడకన తిరుమలకని వస్తున్నారు. క్రిష్ణగిరి వైపు నుంచి వచ్చేవారు పుంగనూరు సమీపంలోని బోయకొండకు వచ్చి అక్కడి నుంచి పీలేరు మీదుగా భాకరాపేట అడవుల్లోకి చేరుతున్నారు.

ఊబిలోకి దిగితే  ఇక అంతే
అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టేందుకు వెళ్లిన కూలీలు మళ్లీ ఇతర పనులకు వెళ్లడం లేదు. గ్రామాల్లో తిరిగితే పోలీసులు పట్టుకుంటారని బెదిరించి ఈ కూపంలోనే కొనసాగేలా చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. దీనికి తోడు కూలీలకు రోజుకు రూ.500 కూలీతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. తొలుత పనులకు వెళ్లిన వారు నెలల వ్యవధిలోనే వేలల్లో  డబ్బు సంపాదించడం, టీవీలు, ఫ్రిజ్‌లను కొనుగోలు చేయడాన్ని చూసిన మరికొందరు కూలీలు సైతం వీరి బాట పడుతున్నారు. ఈ కూలీల్లో బాగా చదువుకున్న వారు కూడా ఉండడం గమనార్హం.

కూలీల కోసం ప్రత్యేక ఏజెంట్లు
శేషాచలం అడవుల్లోకి కూలీలను సరఫరా చేసేందుకు జిల్లాకు చెందిన పలువురు ఏజెంట్లు పనిచేస్తున్నట్టు సమాచారం. వీరి ద్వారానే కూలీలు అడవుల్లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. స్మగ్లర్లకు కావాల్సిన పనిముట్లు, లగేజీ ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు ఆర్‌సీలున్న వాహనాలను ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఈ ఎర్రకూలీల వ్యవహారాన్ని గుట్టురట్టు చేయాలంటే కీలకమైన ఏజెంట్లను పట్టుకోవాల్సిన అవరసం ఉంది. నిర్లక్ష్యం చేస్తే మరెంతమందో ఈ ఊబిలో ప్రాణాలను పోగొట్టుకోవడం లేదా జైళ్లలో మగ్గక తప్పదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement