ఆశా.. నిరాశేనా?

Age Limit In Police Constables Notifications - Sakshi

పోలీసు ఉద్యోగాల్లో వయస్సు సడలింపు లేదు

12 వేలకు కేవలం 3,137 పోస్టులకే నోటిఫికేషన్‌

చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీ చేపడతామని ఆశచూపి అరకొరగా భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వయస్సు సడలింపు కోసం అభ్యర్థులు కోటి ఆశలతో ఎదురు చూడగా వయస్సు సడలింపు లేదని తేల్చేసింది. దాంతో వారి ఆశ నిరాశే అయ్యింది.

తూర్పుగోదావరి , బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రభుత్వ కొలువుల కోసం కళ్లు కాయలు కాసేలా నిరుద్యోగులు ఎదురు చూస్తుండగా చంద్రబాబు ప్రభుత్వం వారికి షాక్‌లు ఇస్తోంది. మొన్న డీఎస్సీలో.. నేడు పోలీసు ఉద్యోగాల విషయంలో అలాగే వ్యవహరించింది.  12 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 3,137 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే అందులో వయస్సు సడలింపు ఇవ్వకపోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకొనేందుకు కూడా నోచుకోలేకపోయారు. అలా జిల్లాలో సుమారు 9 వేలమంది ఛాన్స్‌ కోల్పోయారు. ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకొనే వారికి 21 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాలు లోపు ఉండాలి. కానిస్టేబుల్‌ పోస్టుకు 18 సంవత్సరాలు నిండి 22 సంవత్సరాల లోపు వారు అర్హులు.    2016లో  ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు  రెండేళ్ల వయస్సు సడలింపు ఇచ్చింది. అదే విధంగా ఈ సారి కూడా వయస్సు సడలింపు ఇస్తారని భావించిన వారి కలలు కల్లలే అయ్యాయి.

ఊరించి ఉసూరుమనిపించి...
రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పుకొన్న చంద్రబాబు సర్కార్‌  కేవలం  3137 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో  324 కానిస్టేబుల్, 2,813 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఉన్నాయి. 2016లో 707 ఎస్సై, 4,548 కానిస్టేబుల్‌ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారు. గతంలో కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తారని గంపెడు ఆశతో ఉన్న అభ్యర్థులకు  నిరాశే మిగిలింది.

ఉపాధ్యాయపోస్టులకు ఒక న్యాయం.. మాకో న్యాయమా?
డీఎస్సీ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు రెండేళ్ల వయస్సు సడలింపు ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎందుకు సడలింపు ఇవ్వరని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై  ఆందోళన చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.  

ఎంతో ఆశతో శిక్షణ
గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా రెండేళ్ల వయస్సు సడలిస్తారని అభ్యర్థులు ఎంతో ఆశతో కాకినాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 3న ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అందులో  వయస్సు సడలింపు లేకపోవడంతో అభ్యర్థులు ఉసూరుమన్నారు.

తక్కువ వ్యవధిలో ప్రిలిమినరీ పరీక్ష
గతంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చాక కనీసం 90 రోజులు వ్యవధిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం 45 రోజులు మాత్రమే ఉండడంతో తాము పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి అని నిరుద్యోగుల వాపోతున్నారు.

ఎంతో ఆశతో శిక్షణ తీసుకొన్నారు
గతంలో ఇచ్చిన మాదిరిగానే ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు వయస్సు సడలింపు ఉంటుందనే ఆశతో చాలా మంది శిక్షణ తీసుకున్నారు. వయస్సు సడలింపు ఇస్తే అభ్యర్థులకు ఎంతో ఉపయోగం. ప్రిలిమినరీ పరీక్ష సమయం తక్కువ కావడంతో అభ్యర్థులు శిక్షణ తీసుకొనే అవకాశం తగ్గిపోయింది.–గుంటూరు శ్యామ్,శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ అధినేత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top