గోశాల ఘోష!

Adress Of Illness InGoshala  - Sakshi

శ్రీమఠం గోశాలలో కొరవడిన వసతులు

న్యూట్రిన్స్‌ గడ్డి పెంపకంలో మీనమేషాలు 

కానరాని బంతిపూలతోట సాగు

వానొస్తే గోవులకు కునుకు కరువు

గోమాతను సకల దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు.  గోపూజతోనే శ్రీరాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీమఠంలో గోసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గోశాలకు  కోట్ల రూపాయల్లో విరాళాలు పోగవుతున్నా శ్రీమఠం అధికారులు గోసంరక్షణ మరచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత గోశాల దుస్థితి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.   

సాక్షి, మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపాన గోశాల నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం..దోమల విజృంభణతో గతేడాది థ్రిప్స్‌ వ్యాధి (మెదడువాపు వ్యాధి) ప్రబలింది. ఫలితంగా నెలలోనే 50 గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో శ్రీమఠం అధికారులు రూ.అరకోటితో సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇవి మున్నాళ్ల ముచ్చటగాగా మారాయి.  కారణంగా గతేడాది పరిస్థితే గోవులకు దాపురించింది.

 
చేపట్టాల్సిన సంరక్షణ చర్యలు.. 
గోశాల విస్తరణ రూ.25 లక్షలతో చేపట్టాల్సి ఉంది. అపరిశుభ్రత తొలగింపునకు రూ.8లక్షలు వెచ్చించాలి. రెడిమేడ్‌ డ్రెయినేజీకి రూ.8 లక్షలు,  కాంక్రీట్‌ ప్లాట్‌పామ్‌ నిర్మాణానికి రూ.12 లక్షలు అవసరమని తేల్చారు. బంతిపూలతోట, ఉసిరివనం, పౌంటైన్‌ ఏర్పాటుకు రూ.3 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలాగే 40 ఎకరాల్లో పచ్చగడ్డి, 10 ఎకరాల్లో లూసెర్నీ, కోపియాన్, స్టెల్లోహెమటా జాతుల న్యూట్రిన్‌ గడ్డి పెంపకం చేపట్టేందుకు పూనుకున్నారు. స్వచ్ఛఅభియాన్‌ పేరుతో ప్రతి 15 రోజులకు ఏకాదశి రోజున మఠం ఉద్యోగులంతా అక్కడే పరిశుభ్రత పనులు చేపట్టాలని నిశ్చయించారు.  

ఏం చేశారంటే.. 
సంరక్షణ చర్యల్లో భాగంగా గోశాలను విస్తరణ చేపట్టారు. డ్రెయినేజి, క్రాంకీటు ప్లాట్‌పాం నిర్మించారు.  మిగతా పనులు ఏవీ చేపట్టలేకపోయారు. దోమల నివారణ కోసం బంతిపూల సాగు చేపడతామని చెప్పినా పనులు ఇంచు కూడా కదలేదు. గోశాలలో స్వచ్ఛత కనుచూపు మేరలో ఉండిపోయింది. ఏకాదశిన ఉద్యోగుల శ్రమదానానికి దారి లేకపోయింది. వానొచ్చినా.. దోమకుట్టినా.. ఆకలి వేసినా గోవులు మూగవేదన భరించాల్సి వస్తోంది. చిన్న వానొచ్చినా గోశాల ప్రాంగణం పేరుకుపోయిన పేడతో చిత్తడిగా మారుతోంది. గోవులు వానలో తడుస్తూ జాగారం చేయాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన పశుగ్రాసంతోనే గోవులు కడుపు నింపుకోవాలి. న్యూట్రిన్స్‌ గడ్డిలేకపోవడంతో గోవులు బలహీనంగా మారుతున్నాయని పశువైద్యాధికారులు మొత్తుకుంటున్నా చెవిన వేసుకునే నాథుడు లేకపోయాడు.   

గోవుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం
గోశాలలో గోవుల సంరక్షణ కోసం కట్టుకడి పనిచేస్తాం. త్వరలోనే బంతిపూలతోట, ఉసిరి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. స్వామిజీ సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో గోశాలలో వసతులపై సమీక్ష నిర్వహించి సంరక్షణ కోసం పాటుపడతాం. పశుగ్రాసం పెంపకం పనులు వేగవంతం చేస్తాం.  
ఎస్‌కే శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top