ప్రతి రోజూ రాత్రంతా చర్మానికి నేరుగా తగులుతూ, చెమట, నూనెలు, మన నుంచి వేరయిన డెడ్‌సెల్స్ అన్నీ బెడ్‌షీట్స్ మీదే కదా పడేది! వీటిని సరిగ్గా పట్టించుకోకపోతే, అవి మొటిమలు, అలర్జీలు, అశాంతికరమైన నిద్రకు కారణం అవుతాయి. అందువల్ల మీ బెడ్‌షీట్స్‌ని క్రమం తప్పకుండా మార్చడం అవసరం!
ఏమేం పేరుకుపోతాయంటే..?
ప్రతి రాత్రి, చర్మం లక్షలాది చనిపోయిన కణాలను వదిలివేస్తుంది. వీటితోపాటు సహజ నూనెలు, చెమట కూడా ఉంటాయి. మీరు రాసుకునే లోషన్లు లేదా కాస్మెటిక్ అవశేషాలు కూడా ఈ మిశ్రమానికి తోడవుతాయి. డస్ట్ మైట్స్ అనే సూక్ష్మ కీటకాలు ఈ చిన్న పొలుసులను తినడానికి ఇష్టపడతాయి. ఇవన్నీ మీరు గంటల తరబడి విశ్రాంతి తీసుకునే మీ మంచంపై పేరుకుపోతాయి!
ఇవి కొంతమందిలో తుమ్ములు, కళ్లు దురద పెట్టడం, చివరకు ఆస్తమాను కూడా ప్రేరేపించగలవు. అందుకే, శుభ్రమైన బెడ్‌షీట్స్ అనేవి సౌకర్యానికే కాక, మీ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనవి.
ఎప్పుడు మార్చాలి?.. చాలా మందికి, ప్రతి ఒకటి నుంచి రెండు వారాలకు ఒకసారి బెడ్‌షీట్స్ మార్చడం సరిపోతుంది. ఫ్రెష్‌గా ఉండే బెడ్‌షీట్స్ మీ నిద్ర మరింత గాఢంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.
వారానికోసారి... మీకు వీపు, ఛాతీ లేదా ముఖంపై మొటిమల సమస్య ఉంటే, వారానికోసారి బెడ్‌షీట్స్‌ని మార్చడం ముఖ్యం. దిండు కవర్లను ఇంకా తరచుగా ఉతకాల్సి ఉంటుంది! చర్మంపై నూనెలు, బ్యాక్టీరియా ఒత్తిడికి గురైనప్పుడు రంధ్రాలను అడ్డుకుని, మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయి. బెడ్‌షీట్స్‌పై పేరుకునే డస్ట్‌మైట్స్ వల్ల దగ్గు, దురదలు వస్తాయి. అందువల్ల అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నవారు కూడా వారానికోసారి ఉతకడం ద్వారా డస్ట్ మైట్స్, అలర్జీ కారకాలను తగ్గించుకోవచ్చు.
బెడ్‌షీట్స్ పరిశుభ్రతకు ఏం చేయాలి?
క్రిములు, డస్ట్ మైట్స్‌ను నిర్మూలించడానికి బెడ్‌షీట్స్‌ను 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడినీటిలో ఉతకాలి. దిండు కవర్లను వారానికి రెండు సార్లు మార్చండి. అంతేకాదు, బూజు రాకుండా పరుపులు పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా, తేమగా ఉన్నప్పుడు లేదా మీ మంచంపై మీతోపాటు మీ పెంపుడు జంతువులు లేదా పిల్లలు కూడా పడుకునేటప్పుడు బెడ్‌షీట్స్ వీలైనంత తరచుగా ఉతకడం అవసరమని గుర్తించండి.


