పాపం పండింది

ACB Raids on Tourism Department Officer Krishna - Sakshi

ఏసీబీ వలలో పర్యాటక శాఖ ఎస్టేట్‌ అధికారి శివరావు

గతంలో ఎమ్మెల్యే బోండా భూకబ్జాకు సహకారం

విజయవాడ :  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్వాతంత్య్ర  సమరయెధుని స్థలం కబ్జాలో సూత్రధారి.. ఎమ్మెల్యే బొండా ఉమ కేసులో పాత్రధారి అర్బన్‌ తహసీల్దార్‌గా పనిచేసిన ఆర్‌.శివరావు ఏసీబీకి చిక్కారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో బుడమేరు బ్రిడ్జి వద్ద స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జాకు పాల్పడగా, అప్పట్లో తహసీల్దార్‌గా అందుకు సహకరించినట్లు తేలింది. బుధవారం నగరంలోని శ్వేతా టవర్స్‌లో ఏసీబీ అధికారులు శివరావుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే శివరావు నోరు మెదపలేదని తెలుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధునికి సంబంధించిన భూమి అడంగళ్లు తారుమారు ఎందుకు చేశారని డీఎస్పీ రమాదేవి  తహసీల్దార్‌ను ప్రశ్నించారు. ఇదిలాఉండగా స్వాతంత్య్ర  సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన 1.50 ఎకరాల భూమిని అబ్దుల్‌ మస్తాన్‌ పేరుతో 2007లో అడంగళ్లు మార్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అడంగళ్లు మార్చి పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా తహసీల్దార్‌ ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. ఆ భూమిలో సగం 0.75 సెంట్లు తహసీల్దార్‌ శివరావు తన బావమరిది దార్ల విజయకుమార్‌ పేరుతో జీపీఏ చేయించుకున్నట్లు ఏసీబీ అధికారులు  గుర్తించారు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ రమాదేవిమీడియాకు చెప్పారు.

టైపిస్టు నుంచి తహసీల్దార్‌ వరకు..   
శివరావు రెవెన్యూ శాఖలో 1987లో టైపిస్టుగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రవేశించారు. కొంత కాలం మచిలీపట్నంలో కలెక్టర్‌ వద్ద సీసీగా విధులు నిర్వహించారు. ఆ  తరువాత 2003 నుంచి 2006 వరకు పెనమలూరు డెప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. అనంతరం  పదోన్నతి పొంది 2009 నుంచి 2012 వరకు మోపిదేవి, కంకిపాడు, గన్నవరంలో తహసీల్దార్‌గా పనిచేశారు. 2012 నుంచి 2018 వరకు ఆరేళ్ల పాటు విజయవాడ అర్బన్‌ తహసీల్దార్‌గా ఉన్నారు. అర్బన్‌ తహసీల్దార్‌ పోస్టు దక్కడంతో శివరావు దశ తిరిగింది. నగరంలో ప్రధాన ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ కావడంతో కలెక్టర్లకు  అత్యంత సన్నిహితంగా ఆయన చక్రం తిప్పాడు. చాలా నిదానంగా, నమ్మకంగా ఉండే ఆయన ఆరేళ్లలో అడ్డగోలుగా పనిచేసి అక్రమాస్తులు కూడబెట్టారు. ఎమ్మెల్యే అనుచర గణంతో, రియల్టర్లతో సన్నిహితంగా మెలిగేవారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

శివరావు అరెస్టు..  
ప్రస్తుత పర్యాటక శాఖ ఎస్టేట్‌ ఆఫీసర్‌ శివరావును ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

బొండాగిరినివెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’  
గత ఏడాది ‘సాక్షి’ స్వాతంత్య్ర సమరయోధుని స్థలం కబ్జాలో బొండా ఉమ పాత్ర ఉన్నట్లు వెలుగులోకి తెచ్చింది. బొండాగిరి బయటపడగానే తహసీల్దార్‌ శివరావు పర్యాటక శాఖకు డెప్యుటేషన్‌పై బదిలీ చేయించుకున్నారు.

బంధువుల ఇళ్లల్లో సోదాలు  
కంకిపాడు : కంకిపాడులో బుధవారం రాత్రి పర్యాటక శాఖ ఎస్టేట్‌ అధికారి ఆర్‌.శివరావు బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. శివరావు స్వగ్రామం కంకిపాడు కావడం తో లాకుగూడెంలోని బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. కుటుంబ నేపథ్యం,ఆస్తుల వివరాలు సేకరించినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top