అవినీతికి అడ్డాలు | acb officers rides on rta offices | Sakshi
Sakshi News home page

అవినీతికి అడ్డాలు

Dec 30 2013 3:56 AM | Updated on Aug 17 2018 12:56 PM

అవినీతికి అడ్డాలు - Sakshi

అవినీతికి అడ్డాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ దాడులు కొనసాగాయి.

 సాక్షి, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ దాడులు కొనసాగాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో రశీదులు లేకుండా ఉన్న లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు జరగడం వారంలో ఇది రెండోసారి. ఇటీవలే దాడులు జరగడం, ఇక ఇప్పట్లో జరగవనే ఉద్దేశంతో సిబ్బంది భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని పురుషోత్తపురంలోని చెక్‌పోస్టులో వివిధ విభాగాల అధికారులతో పాటు, ప్రైవేటువ్యక్తులు కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ చెక్‌పోస్టునుంచి ఏసీబీ అధికారులు రూ.1.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 21న జరిగిన దాడిలో రూ.2.15 లక్షలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
 
  అనంతపురం జిల్లా పెనుగొండ చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లకు ఏకంగా ఒక డబ్బాపెట్టె పెట్టారు. రికార్డుల తనిఖీ కోసం వచ్చిన డ్రైవర్లు ఆ బాక్స్‌లో నగదు వేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో తనిఖీ చేయగా రూ.26,500 పట్టుబడింది.  ఏసీబీ అధికారుల రాకను పసిగట్టిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం బీవీ పాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రం సిబ్బంది డబ్బులను చీకట్లోకి విసిరేశారు. అధికారులు ఆ సొమ్మను స్వాధీనం చేసుకుని సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన సురేష్, రహీముద్దీన్‌ఖాన్, మధుసూదన్‌లు ఈనెల 21న నిర్వహించిన దాడుల్లోనూ పట్టుబడటం గమనార్హం. ఈ చెక్‌పోస్టులో ఆదివారం రూ. 48,150 స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని నాగారం చెక్‌పోస్టుతోపాటు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భోరజ్ చెక్‌పోస్టు నుంచి రూ.61 వేలు స్వాధీనం చేసుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement