కార్పొరేషన్‌లో అవినీతి కంపు

ACB Officers Attack On Kurnool Municipality Officer - Sakshi

కర్నూలు (టౌన్‌): నగర పాలక సంస్థ అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. పైసలివ్వందే పనులు చేయడం లేదు. దీంతో ఒక్కొక్కరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడుతున్నారు. ఏడాది వ్యవధిలోనే నలుగురు అధికారులు జైలు పాలయ్యారు. తాజాగా బుధవారం అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌  శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. మూడునెలల క్రితం నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలనను గాడిలో పెడుతున్న సమయంలోనే పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడంతో కార్పొరేషన్‌ పరువు కాస్తా గంగలో కలిసినట్లయ్యింది.

ఏడాది వ్యవధిలో నలుగురు  
 నగర పాలక సంస్థలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు ఉద్యోగులు లంచం తీసుకుంటూ జైలుపాలయ్యారు. 2018 జనవరి 27న ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బాలసుబ్రమణ్యం కంట్రాక్టర్‌కు బిల్లు చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ  పట్టుబడ్డారు. అలాగే ఏప్రిల్‌ 14న ఇంటికి కుళాయి కనెక్షన్‌కు సంబంధించి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ విభాగానికి చెందిన  బిల్‌కలెక్టర్‌ సుధాకర్‌ పట్టుబడ్డారు. ఆ తరువాత ఇదే విభాగంలో మరొక బిల్‌ కలెక్టర్‌ షరీఫ్‌ డిసెంబర్‌  13న పన్నులో పేరు మార్పిడికి సంబంధించి రూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. తాజాగా అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శాస్త్రి షభ్నం రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
 
ఐఏఎస్‌ పాలనలోనూ అదే దందా! 
 నగర పాలక సంస్థ కమిషనర్‌గా పి.ప్రశాంతి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతర తనిఖీలు, సమీక్షలు చేయడంతో పాలనలో కొంత మార్పు కనిపించింది. చెత్త సేకరణలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. కార్పొరేషన్‌ బాగుపడుతోందని అనుకుంటున్న తరుణంలో మరో అధికారి పట్టుబడటం గమనార్హం. దీన్నిబట్టి ఐఏఎస్‌ అధికారి పాలనలోనూ అదే దందా కొనసాగుతోందన్న విమర్శలకు తావిచ్చినట్లు అయ్యింది. నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం అన్ని విభాగాల్లో కీలకమైనది. ఇళ్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు..వీటన్నింటి అనుమతి వ్యవహారాలు ఈ విభాగంలో చూస్తుంటారు. దీంతో ఇక్కడ అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. బిల్డింగ్‌లు ప్లానింగ్‌కు విరుద్ధంగా నిర్మించినా, అనుమతి లేకుండా కట్టినా, నాన్‌లేఔట్‌లలో నిర్మాణాలు చేపట్టినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఏసీబీకి చిక్కిన ఏసీపీ – శాస్త్రి షభ్నం తీరే సప‘రేటు’ 
కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ (ఏసీపీ)గా పనిచేస్తున్న శాస్త్రి షభ్నం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు బుధవారం పట్టుబడ్డారు.  నగరంలోని బళ్లారి చౌరస్తాకు చెందిన పవన్‌కుమార్‌ మోదీ 2015, 2017  సంవత్సరాల్లో రెండు స్థలాలు కోనుగోలు చేశాడు. ఈ స్థలాల్లో నిర్మాణాల కోసం పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శాస్త్రి షభ్నంను కలిశారు.

రెండు మూడు సార్లు కలిసినా పని కాలేదు. ప్లాన్‌ అప్రూవల్‌ కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో విసుగు చెందిన బాధితుడు ఈ నెల 19న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి...  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీపీని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆ తర్వాత ఇంట్లో సోదా చేయగా.. రూ.8.20 లక్షల నగదు, 200 గ్రాముల బంగారు నగలు, బ్యాంకు పాస్‌బుక్కులు, విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉందని  ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. పట్టుబడిన ఏసీపీని గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. కాగా.. శాస్త్రి షభ్నం 1999 నుంచి 2001 వరకు పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ (కర్నూలు నగరపాలక సంస్థ)గా, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా (గుంతకల్లు, నందికొట్కూరు) పనిచేశారు. ఆ తరువాత పదోన్నతిపై అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌గా కర్నూలు నగరపాలక సంస్థలో 2014 నుంచి పనిచేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top