చీఫ్‌ ఇంజనీర్‌ ఆస్తులు 100 కోట్లకు పైనే! | Sakshi
Sakshi News home page

చీఫ్‌ ఇంజనీర్‌ ఆస్తులు 100 కోట్లకు పైనే!

Published Sat, Apr 1 2017 11:26 AM

చీఫ్‌ ఇంజనీర్‌ ఆస్తులు 100 కోట్లకు పైనే! - Sakshi

విశాఖపట్నం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి.

ఏపీ ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం. గంగాధర్‌తో పాటు రోడ్డు కాంట్రాక్టర్‌ నాగభూషణంపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తుండటంతో.. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీరిద్దరి ఇళ్లతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో సుమారు 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

ఒక్క హైదరాబాద్‌లోనే 11 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లి రాంకీ టవర్స్‌లో రూ. 8 కోట్ల విల్లా, కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఓ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూకట్‌పల్లి నివాసంలో రూ. 40 లక్షల నగదును అధికారులు సీజ్‌ చేశారు. ఇప్పటి వరకు వివిధ చోట్ల సోదాల్లో 50 లక్షల విలువైన బంగారం, 5 బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం 8 కోట్ల ఆస్తులను కనుగొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ వెల్లడించారు. విజయవాడలోని కాంట్రాక్టర్‌ నగభూషనం ఇంట్లో సైతం రూ. 40 లక్షలు సీజ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పీలేరులోని గంగాధరం బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు.

Advertisement
Advertisement