ఈ వేసవికి ఏసీలు లేనట్టే!

AC arrangement works in annavaram temple - Sakshi

ఆలయంలో కొన..సాగుతున్న ఏసీ ఏర్పాటు పనులు

మార్చి నుంచి మొదలు పెట్టినా పూర్తికాని వైనం

ఉక్కపోత భరించలేకపోతున్న భక్తులు, అర్చకులు 

అన్నవరం సత్యదేవుడికి భక్తుల సంఖ్య పెరిగింది. ఆదాయం కూడా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో సత్యదేవుని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రత్నగిరి అంతా కాంక్రీటు జంగిల్‌గా మారడం, కొత్తగా నిర్మించిన స్వామివారి ఆలయాన్ని గ్రానెట్స్‌తో నిర్మించడంతో ఆలయంలో వేడి విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆలయంలో ఉక్కపోత మరింత పెరిగిపోయింది. వేసవి ప్రారంభంలో ఆలయాన్ని ఏసీ చేయించేందుకు దేవస్థానం పాలకమండలి, అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. భక్తులతోపాటు అర్చకులు కూడా ఉక్కపోతను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే.. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు.

అన్నవరం (ప్రత్తిపాడు): సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత మార్చి నుంచి స్వామివారి ఆలయాన్ని ఏసీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వారానికో పని చొప్పున చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు వేసవి ఎండ తీవ్రతకు ప్రధానాలయంలో ఉక్కబోత భరించలేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటలు ఆలయంలోనే ఉండి భక్తులకు సేవలందించే అర్చకస్వాముల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుతం ఆలయంలోకి ఏసీ గొట్టాలు అమర్చే పనులు చేస్తున్నారు. గదులు ఇంకా నాలుగైదు రోజులు పనిచేస్తే తప్ప ఆలయం ఏసీ వేసే ప్రక్రియ కాదని భావిస్తున్నారు. 

వేసవి ప్రారంభానికి ముందే చేస్తామన్నారు
ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందే సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేయాలని ఫిబ్రవరి రెండో వారంలో రూ.7 లక్షల అంచనాతో టెండర్‌ పిలిచారు. రూ.6,14,900తో ఆలయంలో క్లోజ్డ్‌ ఏసీలు అమర్చేందుకు కాకినాడకు చెందిన నవ్యకళా ఎయిర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ సంస్థ టెండర్‌ దాఖలు చేసింది. ఈ మొత్తానికి జీఎస్‌టీ అదనం. మొత్తం రూ.ఏడు లక్షలు వరకూ అవుతుందని అంచనా వేశారు. మార్చి 11న పాలకమండలి ఈ టెండర్‌ను ఖరారు చేసింది. పనులు వెంటనే ప్రారంభించాలని ఈఓ జితేంద్ర ఆదేశాలిచ్చారు. ఏప్రిల్‌ 15న ఏసీ మెషీన్లను దేవస్థానానికి తీసుకువచ్చారు. వాటిని అదే నెలాఖరున ఆలయం వద్దకు చేర్చారు. ఈ నెల 4వ తేదీన ఆలయం శిఖరానికి చేర్చారు. 15వ తేదీ నుంచి మెషీన్ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేందుకు గొట్టాలు అమర్చే పనులు ప్రారంభించారు. ఆలయం లోపల మాత్రం పైపులు లేకుండా ఆలయ కిటికీల ద్వారా చల్లని గాలి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ మెషీన్ల సామర్థ్యం ఎక్కువ అయినందున పావు గంటలోనే ఆలయం అంతా చల్లబడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సగం వేసవికాలం అయిపోయింది. సాధ్యమైనంత త్వరగా ఏసీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top