
‘ఆధార్ కట్’ తాత్కాలికమేనట!
గ్యాస్ సబ్సిడీపై ఆధార్ లింకును తొలగిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ చమురు సంస్థలకు ఆదేశాలివ్వడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
డీలర్లకు అందని ఆధార్ లింకు తొలగింపు సమాచారం
సాఫ్ట్‌వేర్ మార్పు చేయూలంటే ఐదు రోజులు అవసరం
8.60 లక్షల మంది వినియోగదారులకు ఊరట
ఈ విధానాన్ని శాశ్వతంగా తొలగించాలంటున్న వినియోగదారులు
సాక్షి, ఏలూరు : గ్యాస్ సబ్సిడీపై ఆధార్ లింకును తొలగిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ చమురు సంస్థలకు ఆదేశాలివ్వడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అరుుతే, ఇదంతా తాత్కాలిక ఊరటేనని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల అనంతరం ఈ నిబంధన తిరిగి అమలులోకి వచ్చే అవకాశం లేకపోలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రూ.440 చెల్లిస్తే చాలు
గ్యాస్ సిలెండర్ ధర రూ.1,324కు చేరింది. ఇటీవలే ఈ ధరలో రూ.107 తగ్గించారు. కేంద్ర పెట్రోలియం శాఖ తాజా నిర్ణయంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను ఒక్కొక్క సిలిండర్‌కు సుమారు రూ.440 చొప్పున నేరుగా చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఆధార్ లింకును తొలగిస్తున్నట్టు ప్రభుత్వం చమురు సంస్థలకు ఆదేశాలిచ్చినప్పటికీ.. జిల్లాలోని గ్యాస్ డీలర్లకు ఆ సమాచారం అందలేదు. ఇదిలావుండగా సాఫ్ట్‌వేర్‌ను కొత్త ధరకు తగ్గట్టుగా మార్చిన తర్వాత నుంచే పాత పద్ధతిలో గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా డీలర్లకు అదేశాలు అందే అవకాశం ఉంది. ఈ తతంగం పూర్తికావడానికి ఐదు నుంచి వారం రోజుల సమయం పట్టవచ్చంటున్నారు. ఈ లోగా సిలిండర్ తీసుకోవాలనుకునే వారు పూర్తి ధర చెల్లించాల్సిందే.