మంటగలిసిన మానవత్వం

మంటగలిసిన మానవత్వం


పెద్దాస్పత్రిలో స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో భర్తను ఈడ్చుకెళ్లిన భార్య

 

 గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది మానవత్వం మంటగలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్తను మొదటి అంతస్తులోని వైద్యుని వద్దకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని భార్య ప్రాధేయపడితే కనీసం పట్టించుకోలేదు. దీంతో విధిలేని రోగి భార్య ఆయన్ను ర్యాంపుపైనే ఈడ్చుకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడికొచ్చే పేద రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతకల్లు పట్టణంలోని తిలక్‌నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన పి. శ్రీనివాసఆచారి హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు.అనారోగ్యం వల్ల కొంత కాలం క్రితం తిరిగి ఇంటికి వచ్చేశాడు. మూడు రోజులుగా కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్న ఆచారిని బుధవారం ఉదయం ఆయన భార్య శ్రీవాణి పెద్దాస్పత్రికి తీసుకొచ్చింది. కాలికి గాయం, ఆపై నీరసంగా ఉన్న తన భర్తను ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని, సెక్యూరిటీ గార్డులను ప్రాధేయపడింది. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కతే గరుకుగా, ఎత్తుగా ఉన్న ర్యాంప్‌పైనే భర్తను లాక్కొని వెళ్లి సర్జికల్ వార్డులోకి తరలించింది. ఈ సంఘటనపై ఆస్పత్రి ఏవో డాక్టర్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి ఆలస్యంగా వచ్చిందనన్నారు. ఆస్పత్రిలో ఐదు స్ట్రెచర్లు ఉన్నాయని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top