పడకేసిన ‘ఫారిన్ ఎక్స్చేంజ్’ | A strong sense of 'Foreign Exchange' | Sakshi
Sakshi News home page

పడకేసిన ‘ఫారిన్ ఎక్స్చేంజ్’

Nov 30 2013 3:12 AM | Updated on Sep 2 2017 1:06 AM

భారత ప్రభుత్వ పరిధిలోని తపాలా శాఖలో విదేశీ మారకద్రవ్యం (ఫారిన్ ఎక్స్చేంజి) సేవలకు మంగళం పాడారు.

తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: భారత ప్రభుత్వ పరిధిలోని తపాలా శాఖలో విదేశీ మారకద్రవ్యం (ఫారిన్ ఎక్స్చేంజి) సేవలకు మంగళం పాడారు. దాంతో వందలాది మంది వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు సక్రమంగా నిర్వహించేందుకు, పర్యవేక్షణకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ హోదాలో అధికారిని నియమించారు. కానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సేవలను  ఏడాది కాలంగా ఆపేశారు.

ఈ సేవలను తపాలాలో కొనసాగించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. తపాలా శాఖాధికారుల సమన్వయంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బంది రోజువారీగా వచ్చి సేవలకు సాంకేతిక సహకారం అందించాల్సి ఉంది. జిల్లాలోని పడమటి మండలాలతో పాటు చిత్తూరు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు కువైట్, దుబాయ్, సింగపూర్‌లో స్థిరపడ్డారు. అంతేగాక తిరుపతి డివిజన్ పరిధిలో కూడా అనేక మంది అమెరికాలో ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులంతా స్వగ్రామాల్లోనే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న వారు ఇక్కడి బంధువులకు ప్రతినెలా ఆయా దేశాల కరెన్సీని పంపుతుంటారు. ఈ నగదునున విదేశీ మారక ద్రవ్యాల కేంద్రాల ద్వారా మనదేశ నగదుగా మార్చుకుంటారు. ఇందుకోసం బయట ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో రూ.వందకు కొంత కమీషన్ పట్టుకుని ఇస్తుంటారు. తపాలా శాఖలోని ఫారిన్ ఎక్స్చేంజి ద్వారా అయితే ఎలాంటి కమీషన్ లేకుండా విదేశీ నగదును మార్చుకోవచ్చు. అలాంటి సేవలను తపాలా శాఖలో ఆపేయడం వల్ల ప్రతిరోజూ వందలాది మంది వినియోగదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

అంతేగాక ఆయా దేశాల క రెన్సీ మార్పిడిలో భాగంగా రోజువారీ నిర్ణీత ధరలను(రూపాయితో మారకం విలువ) బట్టి మన దేశ నగదుకు ఎంత సమానమనే విషయాన్ని డిస్ల్పే ద్వారా తెలుసుకునే సౌలభ్యం కూడా తపాలా శాఖలో మాత్రమే ఉంది. ఈ ప్రక్రియ ద్వారా తపాలా శాఖకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికైనా తపాలా ఉన్నతాధికారులు స్పందించి ఆగిపోయిన ఫారిన్ ఎక్స్చేంజి సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement