ఫుడ్‌ పాయిజన్‌తో 70 మందికి అస్వస్థత

70 Students Sick With Food Poison At Visakha Sri Chaitanya Hostel - Sakshi

వీరంతా శ్రీ చైతన్య మహిళా కళాశాల విద్యార్థినులే..

వారం రోజులుగా పురుగుల అన్నం పెడుతున్న వైనం

యాజమాన్య నిర్లక్ష్యంపై ఆగ్రహించిన తల్లిదండ్రులు

కళాశాల ఆవరణలో ఆందోళన

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ 

సాక్షి, కొమ్మాది(భీమిలి): ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులు మంచాన పడ్డారు. వారం రోజులుగా పురుగుల అన్నం పెడుతుండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అదే తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జీవీఎంసీ 4వ వార్డు కొమ్మాది మైత్రీభవన్‌లోని శ్రీచైతన్య మహిళా జూనియర్‌ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ నాల్గో వార్డు కొమ్మాదిలోని మైత్రీభవన్‌లో శ్రీ చైతన్య మహిళా జూనియర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో గురువారం రాత్రి విద్యార్థినులు తినే ఆహారం విషతుల్యం కావడంతో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి కొంత మందిని, శుక్రవారం మరికొందరిని దగ్గరలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. కళాశాలలో పెడుతున్న భోజనం నాణ్యత లేకపోవడం, పురుగులు పట్టిన అన్నం వండి పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పశ్నిస్తే యాజమాన్యం భయబ్రాంతులకు గురి చేస్తోందని, తప్పని పరిస్థితుల్లో ఈ భోజనం తినడంతో అనారోగ్యానికి గురయ్యామని విద్యార్థులు తెలిపారు. ఈ సమాచారాన్ని తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యాన్ని జరిగిన సంఘటనపై ప్రశ్నించారు.

యాజమాన్యం నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో వారంతా ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లే తమ పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, పిల్లలకు బాగులేకుంటే కనీసం ఫోన్‌ చేసి సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పిల్లలు బాగా నీరసించిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారని, వీరికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కళాశాల ఆవరణలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వెనక్కి తగ్గారు.

అన్నంలో పురుగులు..
వినాయకచవితి నుంచి పాఠశాల యాజమాన్యం ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేద ని విద్యార్థినులు తెలిపారు. వారం రోజుల నుంచి తినే అన్నంలో పురుగులు వస్తున్నాయ ని, గురువారం రాత్రి పెట్టిన భోజనంలో కూడా పురుగులు ఉన్నాయన్నారు. ఈ ఆహారం తినే ఫుడ్‌ పాయిజన్‌ అయిందని, వీటిని తిన్న 70 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. శుక్రవారం ఉదయం అందరినీ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించి.. వెంటనే కళాశాలకు తీసుకుని వచ్చేసారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే పరీక్షలకు పంపించమని సిబ్బంది బెదిరించారని వాపోయారు. 

అడుగడుగునా నిర్లక్ష్యం..
తమ పిల్లల భవిష్యత్‌ కోసం లక్షలు వెచ్చించి ఈ కళాశాలలో చేర్పించామని, తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే 70 మంది అస్వస్థతకు కారణమైందన్నారు. ఇక్కడ తాగేందుకు మంచినీరు కూడా లేదన్నారు. కనీసం తమతో ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని వాపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. 

ఇంత నిర్లక్ష్యమా..
మా పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం లక్షల్లో ఫీజులు వెచ్చించి కళాశాలకు పంపిస్తే.. చదువు దేవుడెరుగు కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టరా. వారం రోజులుగా పురుగులు అన్నం తిని మా అమ్మాయి అస్వస్థతకు గురైంది. సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
– మధుబాబు, ఓ విద్యార్థిని తండ్రి, శ్రీకాకుళం

అన్నం తినలేకపోతున్నాం.
ఇక్కడ మాకు పెడుతున్న భోజనం తినలేకపోతున్నాం. ఇదేంటని ప్రశ్నిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదని బెదిరిస్తున్నారు. ఇక్కడ భోజనం తిని ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో ఆస్పత్రి పాలయ్యాం. 
– హేమ, అస్వస్థతకు గురైన విద్యార్ధిని.

పునరావృతం కాకుండా చూసుకుంటాం.. 
కళాశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థినులు అస్వస్థత గురికావడం వాస్తవమే. మెస్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగింది. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం. 
– బాలసూర్య, ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల

అంతా రహస్యంగానే... 
నాలుగు రోజుల నుంచి విద్యార్థినులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు తెలిసింది. అయితే గురువారం రాత్రి తిన్న ఆహారం విషతుల్యమై 70 మంది మంచాన పడ్డారు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించిన యాజమాన్యం.. అందరినీ ఒకే ఆస్పత్రికి కాకుండా పది మంది చొప్పున పలు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. వెంటనే అందరినీ మళ్లీ కళాశాలకు తీసుకొచ్చేసింది. వసూళ్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top