335వ రోజు పాదయాత్ర డైరీ

335th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం: 3,585 కిలోమీటర్లు
01–01–2019, మంగళవారం 
హరిపురం శివారు, శ్రీకాకుళం జిల్లా 
335వ రోజు నడిచిన దూరం:10.9 కి.మీ.

కొత్త సంవత్సరంలోనైనా రాష్ట్ర ప్రజలకు వంచన నుంచి విముక్తి లభించాలి 
ఉదయం శిబిరం వద్ద వందలాది మంది ఆత్మీయుల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాదయాత్రను ప్రారంభించాను. శిబిరం బయటకు వస్తూనే వంకులూరు గ్రామ అక్కచెల్లెమ్మలు సంప్రదాయ కలశాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్‌ కట్‌ చేయించారు. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని శివారు మత్స్యకార గ్రామమది. నేడు ఆదర్శ గ్రామంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే అభివృద్ధికి నడుం బిగించారు. చేపల వేట భారమై, జీవనోపాధి వెతుక్కుంటూ, ఆ గ్రామం నుంచి వలస వెళ్లిపోయి బయట ప్రాంతాల్లో బాగా స్థిరపడినవారు.. తాము పుట్టిన ఊరిని దత్తత తీసుకున్నారట. ప్రతి రోజూ ఊళ్లోని ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి లో మమేకమవుతున్నారని తెలిసి సంతోషమేసింది. వారి స్ఫూర్తి ఆదర్శదాయకం. 

తిత్లీ బాధితుల విషయంలో సర్కార్‌ మాయాజాలం అన్ని గ్రామాల్లో కనబడుతోంది. అనర్హులైన పచ్చచొక్కాల వారు బాధితుల పరిహారాన్ని మింగేస్తున్నారని శ్రీరామ్‌నగర్‌ గ్రామస్తులు చెప్పారు. మరోవైపు అసలైన బాధితుల్లో కొందరినే గుర్తించిందీ ప్రభుత్వం. వారికి బాబుగారి ఫొటోలున్న చెక్కులిచ్చి చేతులు దులుపుకుంది. అవి కేవలం ప్రచారం కోసమే ఇచ్చినవని గ్రామస్తులు వాపోయారు. పరిహారం మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

బాహడాపల్లి.. సాయుధ విప్లవ పోరాటాలకు పేరెన్నికగన్నది. ఆ ఊరి దగ్గర రైతు సంఘాల ప్రతినిధులు కలిశారు. తిత్లీ తుపాను తర్వాత ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలే లేవట. దాంతో అక్కడి ప్రజాసంఘాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించాయి. దాతల నుంచి సేకరించిన బియ్యాన్ని, నిత్యావసర సరుకులను బాధితులకు పంచిపెడుతూ ఉంటే 16 మంది మీద రాజద్రోహం కేసులు పెట్టారని వాపోయారు. బాధితులకు పరిహారం చెల్లించకుండా చెల్లని చెక్కులిచ్చి మోసం చేస్తున్న చంద్రబాబుపై ఏ కేసులు పెట్టాలంటూ రైతు సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. 

అదే గ్రామంలో జీడి పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులు కలిశారు. వారి కష్టాలను కళ్లారా చూశాను. చేతులన్నీ పొక్కిపోతున్నా, రోజంతా నిలబడి పనిచేస్తున్నా కూలీ రూ.200 కూడా రాకపోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టం చూసి బాధనిపించింది. వారికి మంచి చేయాలన్న ఆలోచన దృఢపడింది.  

ఈ రోజు పాదయాత్ర సాగిన మందస మండలం పాలకోవాకు బాగా ప్రసిద్ధి. స్వచ్ఛమైన పాలతో, సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసే కోవా మందసకే పేరు తెచ్చిపెట్టింది.  ఈ నూతన సంవత్సరంలోనైనా రాష్ట్ర ప్రజలకు వంచన నుంచి విముక్తి లభించాలి.. జీవన ప్రమాణాలు పెరగాలి.. సుఖసంతోషాలు వెల్లివిరియాలి. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వ్యాట్‌ను 12.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించి, హార్టికల్చర్‌ సబ్సిడీని 40 శాతానికి పెంచి, పావలా వడ్డీ రుణాలిచ్చి నాన్నగారు పలాస జీడి పరిశ్రమను ఆదుకున్నారు. ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం మీరు తీసుకున్న ఒక్కటంటే ఒక్క చర్య అయినా ఉందా?  
- వైఎస్‌ జగన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top