317వ రోజు పాదయాత్ర డైరీ

317th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం 3,419.7 కిలోమీటర్లు
09–12–2018, ఆదివారం 
రాగోలు, శ్రీకాకుళం జిల్లా.

ఏం పాపం చేశారని పేద ప్రజలపై ఈ కక్ష సాధింపు బాబూ? 
ఈరోజు ఉదయం బలగ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించాను. ఇక్కడి రిమ్స్‌ ఆస్పత్రిని ‘బలగ పెద్దాస్పత్రి’గా కూడా పిలుస్తారట. వెనుకబడ్డ ఈ జిల్లాకు అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని నాన్నగారు ఏర్పాటు చేసిన సంస్థ.. రిమ్స్‌. 

 ఆ రిమ్స్‌లో పనిచేసే వైద్యులు, నర్సింగ్, న్యూట్రిషన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ సిబ్బంది వచ్చి కలిశారు. రిమ్స్‌కు పట్టిన దుస్థితిని వివరించారు. ‘ఈ ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు చేయడం లేదు.. సిబ్బందిని నియమించడం లేదు.. నిర్వహణ అసలు లేదు.. నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు.. దీంతో అన్ని కేసులూ ప్రైవేటు ఆస్పత్రులకు రిఫరల్‌ కేసులుగా వెళ్లిపోతున్నాయి.. వసతులు, సౌకర్యాలు, సరైన ప్రమాణాలు లేకపోవడంతో పీజీ కోర్సులు కూడా మంజూరు కావడం లేదు’ అని చెప్పారు. రిమ్స్‌ లక్ష్యమే నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నగారికి ఎక్కడ పేరొస్తుందోనన్న దుగ్ధతోనే ఈ వివక్ష చూపిస్తున్నారని బాధపడ్డారు. 

వెనుకబడ్డ మండలాల్లో గ్రామీణ పేద విద్యార్థులకు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆంగ్ల విద్యను అందించాలని ఏర్పాటు చేసిన మోడల్‌ స్కూళ్లది కూడా రిమ్స్‌లాంటి దుస్థితే. ఈరోజు మోడల్‌ స్కూళ్ల టీచర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు కలిశారు. కార్పొరేటు స్కూళ్లకు లబ్ధి చేకూర్చాలని, వాటికి దీటుగా ఎదిగిన మోడల్‌ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని ఆక్రోశించారు. జీతాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మోడల్‌ స్కూల్‌ కాన్సెప్టే మరుగునపడిపోతోందని వాపోయారు. 

పొన్నాడ సంజీవరావు అనే సోదరుడు తన ఇద్దరు ఆడబిడ్డల్ని ఎత్తుకుని వచ్చాడు. బంగారు తల్లి పథకం లబ్ధి తమకు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రిమ్స్‌ అయినా, మోడల్‌ స్కూల్స్‌ అయినా, బంగారు తల్లి వంటి పథకాలైనా.. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయనో, మరొకరికి పేరొస్తుందనో వాటిని నిర్లక్ష్యం చేయడం, వివక్ష చూపించడం దారుణం. ఏం పాపం చేశారని పేద ప్రజలపై ఈ కక్ష సాధింపు?   

బుడతవలసకు చెందిన డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కలిశారు. పొదుపు సంఘాల నిధులను ఫోర్జరీ సంతకాలతో, తప్పుడు డాక్యుమెంట్లతో ఆ ఊళ్లోని అధికార పార్టీ నేతలు స్వాహా చేశారని గోడు వెళ్లబోసుకున్నారు. రుజువులతో సహా దొరికిపోయినా.. దోషులను మంత్రిగారే రక్షిస్తున్నారని చెప్పారు. 

ఓ వైపు పైస్థాయిలోనేమో రుణమాఫీ పేరుతో ఆయన మోసం చేశారు.. ఇక్కడ కిందస్థాయిలోనేమో తెలుగు తమ్ముళ్లు ఇలా దోచేస్తున్నారు.. ఇక మేము ఏమైపోవాలి అనేది ఆ అక్కచెల్లెమ్మల వ్యథ. ఈ రోజు నా భార్య భారతి జన్మదినం. ప్రజాసంకల్ప యాత్రలో ఏడాదికిపైగా నేను ప్రజాక్షేత్రంలోనే ఉండటంతో వరుసగా ఆమె రెండు పుట్టిన రోజులూ పాదయాత్రలోనే జరిగిపోవడం విశేషం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలు, రిమ్స్‌లాంటి ఆస్పత్రులు, సాగునీటి ప్రాజెక్టులు మొదలుకుని రాష్ట్ర ప్రజలకు అత్యంత ఉపయుక్తమైన అన్ని పథకాలను నాన్నగారి హయాంలో ఏర్పడ్డాయన్న ఏకైక కారణంతో నిర్లక్ష్యం చేయడం, నిర్వీర్యం చేస్తుండటం రాష్ట్ర ప్రజలకు చేస్తున్న తీరని ద్రోహం కాదా? 
- వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top