306వ రోజు పాదయాత్ర డైరీ | 306th day padayatra diary | Sakshi
Sakshi News home page

306వ రోజు పాదయాత్ర డైరీ

Nov 27 2018 4:40 AM | Updated on Nov 27 2018 8:07 AM

306th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,322.9 కి.మీ 
26–11–2018, సోమవారం  
యు.వెంకమ్మపేట, శ్రీకాకుళం జిల్లా 

ఎన్నికలకు ముందు శిలాఫలకాలేయడం.. తర్వాత గాలికొదిలేయడం బాబుగారికి అలవాటే
ఈ రోజు పాదయాత్ర దారంతా వేలాదిమంది ఆత్మీయజనంతో కిక్కిరిసి పోయింది. ఎంతోమంది గిరిజన సోదరులు, అక్కచెల్లెమ్మలు అడుగులో అడుగులేశారు. సంప్రదాయ థింసా నృత్యంతో స్వాగతం పలికారు. స్వచ్ఛమైన వారి ప్రేమకు మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఉదయం కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో పూజలుచేసి వచ్చిన ఎంతోమంది అక్కచెల్లెమ్మలు కలిశారు.  

ఎన్నికల ముందొక మాట.. తర్వాత ఒక మాట. ఆంధ్రాలో ఒక మాట.. తెలంగాణలో ఒక మాట.. ఇదీ బాబుగారి రెండు నాల్కల ధోరణి అన్నారు.. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాలవారు. తెలంగాణ అసెంబ్లీలోనేమో తన పార్టీ ఎమ్మెల్యేతో సీపీఎస్‌ను ఎందుకు రద్దు చేయరంటూ అడిగిస్తారు. ఆంధ్రాలో అడిగితేనేమో రాష్ట్ర పరిధిలో లేని అంశమంటూ తప్పించుకుంటారు. తెలంగాణలోనేమో.. అధికారంలోకి వస్తూనే సీపీఎస్‌ రద్దుచేసి తీరుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అధికారంలో ఉన్న ఆంధ్రాలో మాత్రం ఎన్ని ఆందోళనలు చేసినా రద్దు చేయరు. ఇది మోసం కాదా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ చేయకపోవడంతో నీళ్లందడం లేదన్నారు.. నడుకూరు వద్ద కలిసిన రైతన్నలు. ఆ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన మాత్రం చేసి చేతులు దులుపుకొన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు శిలాఫలకాలేయడం.. తర్వాత గాలికొదిలేయడం బాబుగారికి అలవాటే. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు.. వేసిన శిలాఫలకాలు.. ప్రకటనలు, ప్రచారానికైన ఖర్చుతో ప్రాజెక్టుల పిల్లకాలువ పనులను పూర్తిచేయొచ్చు.  

డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్న ప్రసన్న అనే సోదరి.. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి నేటి దాకా పత్రికల్లో వచ్చిన ఫొటోలను అతికించిన పుస్తకాలను తెచ్చి చూపింది. పాదయాత్ర పూర్తయిన 12 జిల్లాలకు ప్రతీకగా 12 పుస్తకాలను పూర్తిచేసింది. అంకిత అనే గిరిజన బాలిక.. పార్టీ గుర్తయిన ఫ్యాన్‌తో కూడిన ఒక అందమైన చెక్కబొమ్మను బహూకరించింది. దానిపై నాన్నగారి ఫొటో, నా ఫొటో అతికించింది. వారి ఆప్యాయత ఎంతగానో ఆకట్టుకుంది.  

వీరఘట్టంలోకి ప్రవేశించగానే.. ప్రముఖ మల్లయోధుడు, ఇండియన్‌ హెర్క్యులస్‌ కోడి రామ్మూర్తినాయుడుగారు గుర్తొచ్చారు. కూరగాయలకు ఈ వీరఘట్టం చాలా ప్రసిద్ధి. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం రవాణా అవుతాయి. మమ్మల్ని బీసీలలో చేర్చి.. సబ్సిడీ కింద కిరోసిన్‌ మోటార్లిచ్చి.. మీ నాన్నగారు ఎంతగానో ఆదరించారని కూరాకుల కులస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవులు, హిందువులు కులమతాలకతీతంగా ఆరాధించే మరియగిరి పుణ్యక్షేత్రం సమీపానే నేటి రాత్రి బస. ఇదే ప్రాంతంలో సోదరి షర్మిల సైతం పాదయాత్రలో బస చేయడం విశేషం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాటి తోటపల్లి, హంద్రీ–నీవా మొదలుకుని.. నేటి గోదావరి–పెన్నా అనుసంధానం వరకు ప్రతిదీ కేవలం ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టడానికే కాదా? ప్రాజెక్టులకన్నా మీరు వేసిన శిలాఫలకాలే ఎక్కువగా ఉన్నది నిజం కాదా? నాలుగున్నరేళ్లు ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఎన్నికలకు ముందు హడావుడిగా సాగునీటి ప్రాజెక్టులను ప్రకటించడం.. కేవలం మొబిలైజేషన్‌ అడ్వాన్సులను మీ బినామీ కాంట్రాక్టర్లకిచ్చి.. కమీషన్లు దండుకోడానికే కాదా?
-వైఎస్‌ జగన్‌     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement