302వ రోజు పాదయాత్ర డైరీ | 302rd day padayatra diary | Sakshi
Sakshi News home page

302వ రోజు పాదయాత్ర డైరీ

Nov 21 2018 3:58 AM | Updated on Nov 21 2018 7:18 AM

302rd day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,280.4 కి.మీ 
20–11–2018, మంగళవారం, 
కురుపాం, విజయనగరం జిల్లా.

గిరిజన వర్గాలకు మూడు నెలల మంత్రి పదవి ఎన్నికల తాయిలం కాక మరేమిటి బాబూ?
ఈ రోజు పాదయాత్ర ఆసాంతం ఎంతోమంది గిరిపుత్రులు కలిశారు. దూర ప్రాంతాల నుంచి, రహదారులే లేని గిరిశిఖర గ్రామాల నుంచి తరలివచ్చామని తెలిపారు. సంక్షేమమంటే ఏమిటో, అభివృద్ధి అంటే ఏమిటో చవిచూపించిన నాన్నగారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనను నాలో చూసుకుంటున్నామని చెప్పారు. కల్మషం లేని వారి అభిమానం కట్టిపడేసింది. ఈ సర్కారు తీరుతో వారు పడుతున్న కష్టాలు వింటుంటే గుండె బరువెక్కింది. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నేతలు, అధికారులు, దళారులు అన్యాయానికి గురిచేస్తుండటం బాధనిపించింది. ఎగువ ఆవిరి, పొడి గ్రామాలకు చెందిన జగన్నాథం, సోమయ్య తదితరులు కలిశారు. జీడిమామిడి, అటవీ ఉత్పత్తులే ఆ గ్రామస్తులకు ఆధారమట. ఈ ప్రభుత్వం వచ్చాక దళారుల దెబ్బకు గిట్టుబాటు కాక నష్టపోతున్నామన్నారు. ఆదుకోవాల్సిన గిరిజన సహకార సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని చెప్పారు. ‘ఉపాధి పనులైనా చేసుకుందామంటే పనులు ఇవ్వరు.. ఇచ్చినా కూలి డబ్బులు చెల్లించరు. విధి లేక యువత వలసల బాట పడుతోంది’అని చెబుతుంటే గుండె బరువెక్కింది.  

రహదారులే లేని కొండపై గ్రామం.. ఓడ్రుబంగి. ఆ ఊరి నుంచి తోయిక రొంపి, నిమ్మల చిన్నమ్మి తదితరులు వచ్చారు. ఆ గ్రామ ప్రజలు రేషన్‌ తీసుకోవాలన్నా, పింఛన్‌ కావాలన్నా కొండ దిగిరావాల్సిందేనట. వృద్ధులు, వికలాంగులు ఎలా రాగలరు? డోలీల్లో వచ్చి వేలిముద్రలు వేసి రేషన్‌ పట్టుకుపోవడం సాధ్యమేనా? అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారికి ఆ కష్టం తొలగించాలంటే ప్రభుత్వానికి పెద్ద పనేమీ కాదు. కానీ.. చేయకూడదు అనుకునేవారికి కారణాలకు కొదవే ఉండదు. ఇక్కడి గిరిజన గ్రామాల్లో వైద్య సౌకర్యాల గురించి ఆలోచించాల్సిన పనే లేదట. ‘వైద్యులు రారు.. 108లు కానరావు’అంటూ వాపోయారు. ఈ ప్రభుత్వం అమాయక గిరిజనంపై సైతం కనీస మానవత్వం చూపకపోవడం బాధాకరం. జెరడ, గెడ్డగూడ గ్రామస్తులు కలిశారు. రెండూ గిరిశిఖర గ్రామాలే. తిత్లీ తుపాను దెబ్బకు సగానికి సగం ఇళ్లు నేలమట్టమయ్యాయట. అందిన సాయం అంతంత మాత్రమేనన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వ తీరు మాత్రం ‘పరిహారం గోరంత.. ప్రచారం కొండంత’అన్నట్టుగా ఉందన్నారు.  

ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే ఎందుకింత చిన్నచూపు? ఎందుకింత వివక్ష? నాలుగున్నరేళ్లకుపైగా గిరిజన ప్రాతినిధ్యమే లేని మంత్రివర్గం చరిత్రలోనే లేదేమో! ఆ ఘనత కేవలం బాబుగారికే దక్కడం విశేషం. గిరిజన వర్గాలకు మూడు నెలల మంత్రి పదవి ఎన్నికల తాయిలం కాక మరేమిటి?  

కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల ప్రజలు కలిశారు. వారి చిరకాల వాంఛ అయిన గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరారు. ఆ మినీ రిజర్వాయర్‌ ఏర్పాటయితే పది వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఇటువంటి చిన్నచిన్న పథకాలను కూడా చేపట్టని సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారం చేపట్టాక ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం కాదా? అందుకు కారణాలైన పోషకాహార లోపం, రక్తహీనత, వైద్య సౌకర్యాల లేమికి బాధ్యత మీది కాదా?  
-వైఎస్‌ జగన్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement