
ఉద్యమానికి 3 నెలల విరామం
కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కారుకు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరో అల్టిమేటమ్ ఇచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో బుధవారం రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కాపు జేఏసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. జేఏసీ పెద్దల సూచనలకు అనుగుణంగా తదుపరి ఉద్యమం ఉంటుందన్నారు. మూడు నెలలు ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామని, ఈలోగా కాపులను చైతన్య పరిచేందుకు నియోజకవర్గ లేదా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సీఎం చంద్రబాబు కాపులపై చిన్నచూపు మానుకుని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ఆనాడు కాపులకు రిజర్వేషన్ల తొలగింపునకు అడ్డు చెప్పిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి వరకు ముఖ్యమంత్రికి గడువు ఇస్తున్నామని పేర్కొన్నారు.