292వ రోజు పాదయాత్ర డైరీ

292rd day padayatra diary - Sakshi

ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,199.6 కి.మీ
23–10–2018, మంగళవారం 
సన్యాసిరాజుపేట, విజయనగరం జిల్లా 

సాధారణ జ్వరాలతో ప్రజలు చనిపోతుంటే మీకు అవమానంగా అనిపించడం లేదా బాబూ? 
ఈరోజు ఉదయం పాదయాత్ర మొదలవగా నే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులు కలిశారు. వారంద రూ గిరిజనులే. గిరిజన గ్రామాల్లో సరైన వసతు ల్లేకున్నా, చాలీచాలని జీతాలతో పదహారేళ్లుగా సేవలందిస్తున్నామని చెప్పారు. ఏడాదిలో సెలవు లు పోనూ వారికి జీతాలిచ్చేది 10 నెలలేనట. ‘రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నాం. ఎప్పటికై నా మా ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ కాకపోతాయా అన్న ఆశతో ఉన్నాం. ఈ ప్రభుత్వం త్వరలో పెడతామంటున్న డీఎస్సీలో మా పోస్టులను ఖాళీ లు గా చూపిస్తూ మా ఉద్యోగాలకే ఎసరు పెడుతోంది. ఇన్నేళ్లుగా గిరిజన గ్రామాల్లో సేవలందించినందుకు ప్రతిఫలం ఇదేనా? ఈ వయసులో ఉన్నట్టుండి ఉద్యోగాల నుంచి తీసేస్తే మా గతేం కావాలి? మా కుటుంబాలు ఏమైపోవాలి?’అంటూ ఆ టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్పుడు తమను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగాల్లోంచి పీకేయాలనుకుం టున్న బాబుగారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఉత్తరాంధ్రను ఇటీవల విషజ్వరాలు కుదిపేశాయి. విజయనగరంలో అయితే అత్యధికం. కరాసవలస గ్రామంలో ఇటీవల విష జ్వరాలతో మరణించినవారి కుటుంబసభ్యులు వచ్చి నన్ను కలిశారు. వారి కష్టాలు వింటుంటే గుండె తరుక్కుపోయింది. తండ్రి లేక తల్లే దిక్కనుకుంటే.. ఆ తల్లి విషజ్వరం బారినపడి మరణించడంతో అనాధగా మిగిలిన కొత్తమ్మ అనే బాలిక, అదే రీతిలో ఒంటరైన నవీన్, ఎదిగొచ్చిన బిడ్డను కోల్పోయిన వెంకమ్మ అనే అక్క, భర్తను కోల్పోయి ఒంటరైపోయిన గౌరమ్మ, కూతురు చనిపోవడంతో ఆమె పిల్లల భారం మీద పడ్డ చిన్నయ్య అనే తాత.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో విషాదం. పడకేసిన పారిశుధ్యం, కలుషితమైపోయిన తాగునీరు, విజృంభించే దోమలు, జాడేలేని వైద్య సిబ్బంది, కరువైన 104 సేవలు.. ఇలా కమ్ముకున్న ప్రభుత్వ నిర్లక్ష్యమే 250 గడపలున్న ఆ ఊరిలో 200 మందికిపైగా విషజ్వరాలను అంటగట్టింది. ఎమ్మె ల్యే రాజీనామా చేస్తానని బెదిరించే దాకా ఆవైపే రాని వైద్యులు, కన్నెత్తి చూడని అధికార యం త్రాంగం, నెల వ్యవధిలో 11 మంది చనిపోయినా కళ్లు తెరవని ప్రభుత్వం, కుటుంబాలకు కుటుంబాలు జ్వర మరణాలతో అతలాకుతలమైపోయి నా పట్టించుకోని ముఖ్యమంత్రి.. ఇదీ కరాసవల స గ్రామ దయనీయ పరిస్థితి. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే ఆ బాధిత కుటుంబాల్లో విషాదానికి కారణమైనప్పటికీ.. వారందరికీ చంద్రన్న బీమా లేదు. ప్రభుత్వ పరిహారమూ రాలేదు. ఇప్పుడు వాళ్లంతా ఏమైపోవాలి? ఎలా బతకాలి?  

ఈరోజు ఎంతోమంది ఆరోగ్య సంబంధ సమస్యలతో నా వద్దకు వచ్చారు. బిడ్డ కాళ్లకు ఆపరేషన్‌ చేయించే ఆర్థిక స్థోమత లేదంటూ రత్నాలు అనే అక్క, మెదడుకు శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఆరోగ్య శ్రీ వర్తించదంటున్నారని తరుణ్‌ అనే సోదరుడు, హెచ్‌ఐవీతో బాధపడుతున్నా పెన్షన్‌ ఇవ్వడం లేదంటూ తల్లిదండ్రులు లేని ఓ అనాధ బాలిక, వచ్చే కాస్త సంపాదన కూడా బిడ్డ తలసీమియా చికిత్సకే ఖర్చయిపోతోందంటూ పద్మ అనే సోదరి, వెన్నెముక ఆపరేషన్‌ చేయించాలంటే రూ.లక్షలు ఖర్చవుతుందని, అంత స్థోమత లేక బిడ్డను అలానే వదిలేసిన కనక అనే అక్క, 2 కిడ్నీలు పాడైపోవడంతో వైద్యం కోసం అప్పుల పాలయిపోతున్నానని వెంకటేశ్‌ అనే సోదరుడు.. ఇలా ఒక్కొక్కరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈరోజు పాదయాత్ర రాష్ట్రంలో నెలకొన్న అనా రోగ్య దుస్థితికి అద్దం పట్టింది. వైద్య, ఆరోగ్య శాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారు వీటన్నిటికీ ఏమని సమాధానం చెబుతారు?  

ఈరోజు నేను బస చేసిన సన్యాసిరాజుపేట గ్రామస్తులు వచ్చి కలిశారు. ఆ ఊరంతా గిరిజనులేనట. విశేషమేమంటే ఆ చిన్నపాటి గ్రామం లో 40కి పైగా కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులుండటం. ఆ ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వాల హయాంలో వచ్చినవేనట. కానీ ఈ నాలుగున్నరేళ్ల బాబు గారి పాలనలో ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగమూ రాకపోవడం మరో విశేషం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడిమాంబతల్లి సిరిమానోత్సవం సందర్భంగా మధ్యాహ్నం నుంచి పాదయాత్రకు విరామం ప్రకటించాను.  

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. సము ద్రాన్ని కంట్రోల్‌ చేశానని, తుపాన్లను అదుపులో పెట్టానని, కరువులను జయించానని, ప్రకృతిని నియంత్రించగలుగుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్న మీకు సాధారణ జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుండటం అవమానకరంగా అనిపించడం లేదా?    
-వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top