288వ రోజు పాదయాత్ర డైరీ

288th day padayatra diary - Sakshi

ఇప్పటిదాకా నడిచిన దూరం 3,168.9 కిలోమీటర్లు 
17–10–2018, బుధవారం
బొబ్బిలి, విజయనగరం జిల్లా 

బాబుగారి హయాంలోనే పరిశ్రమలు మూతబడుతుండటం యాదృచ్ఛికం కాదేమో! 
వ్యవసాయాధారిత పరిశ్రమలు బాగున్నంతకాలం కార్మిక, కర్షక జీవితాల్లో వెలుగులు నిండుతాయి. అవి ఇబ్బందుల్లో పడితే.. వారి జీవితాలు తలకిందులవుతాయి. ఈ రోజు కలిసిన పంచదార, జూట్‌ మిల్లుల కార్మికుల కష్టాలు వింటుంటే.. మనసంతా బరువెక్కింది. 

ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు నన్ను కలిశారు. బకాయిలు అందక రైతన్నలు, వేతనాలు అందక కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘గతంలో ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో నడిచే చక్కెర ఫ్యాక్టరీని బాబుగారు కారుచౌకగా ప్రైవేటు వారికి కట్టబెట్టేశారు. కార్మికుల జీవితాలను పణంగా పెట్టేశారు. దాని ఫలితమే ఈ రోజు మా ఈ దుస్థితి. నేతల స్వార్థ ప్రయోజనాలు మా పాలిట శాపాలయ్యాయి’ అని ఆ కార్మిక సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ బాబుగారి హయాంలోనే మూడున్నరేళ్ల కిందట మూతబడ్డ ఎస్‌ఎల్‌ఎస్‌ జూట్‌ మిల్లు కార్మికులదీ అదే వ్యథ. దశాబ్దాలుగా నమ్ముకున్న ఫ్యాక్టరీ.. ఒక్కసారిగా మూతపడేసరికి వారి జీవితాలు ఎంతగా ఛిద్రమైపోయాయో చెప్పారు. దాదాపు 35 మంది కార్మికులు మనోవేదనతో అనారోగ్యంపాలై మరణించారట. ఎంతోమంది కార్మికులు కూలీలుగా మారారు.. వలసెళ్లిపోయారు. రామకృష్ణ అనే కార్మికుడిది మరింత విషాదం. ఇంజనీరింగ్‌ చదువుతున్న ఆయన ఒక్కగానొక్క కొడుకు కాలేజీ ఫీజులు కట్టలేక.. చదువు ఆగిపోతుందన్న వ్యథతో ఆత్మహత్య చేసుకున్నాడట. ఇలా ఒక్కొక్కరి ఆవేదన వింటుంటే గుండె బరువెక్కింది. రాష్ట్రంలోని సహకారరంగ పరిశ్రమలైనా, ప్రభుత్వరంగ సంస్థలైనా.. కేవలం బాబుగారి హయాంలోనే మూతబడుతుండటం యాదృచ్ఛికం కాదేమో! 

పాతపెంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులందరూ ఒక్కసారిగా వచ్చి నన్ను కలిశారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి పాఠశాలకు వెళ్లే రోడ్డంతా పూర్తిగా మట్టిరోడ్డు, గుంతలమయం. వర్షం వస్తే అడుగుతీసి అడుగుపెట్టలేని పరిస్థితి. చుట్టూ తిరిగి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లే కష్టం. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందన్న నమ్మకమే లేదు.. మీరొచ్చాకైనా ఈ రోడ్డును బాగుచేయించాలని ఆ చిన్నారులు కోరారు. చదువుల దారిని చక్కబెట్టే ప్రయత్నమే చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? 

బొబ్బిలి మున్సిపాల్టీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తనది చాలీచాలని వేతనమైనా నాన్నగారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో తన ముగ్గురు బిడ్డలు ఇంజనీరింగ్‌ పట్టభద్రులయ్యారని గర్వంగా చెప్పాడు.. చిన్నకృష్ణ అనే కార్మిక సోదరుడు. నాన్నగారి హయాంలోనే ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలు కూడా మాఫీ అయ్యాయని ఆనందంగా చెప్పారు. కానీ నేడు పారిశుద్ధ్య పనులను ప్రైవేటువారికి అప్పగిస్తున్న బాబుగారి నిర్వాకం వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదమేర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంతమంది చిరుద్యోగుల జీవితాలు బలైపోయినా ఫర్వాలేదు.. తన కమీషన్‌లే ముఖ్యం అని భావించే పాలనలో ఈ కష్టాలు తప్పవేమో. సాయంత్రం బొబ్బిలిలో జరిగిన భారీ బహిరంగ సభతో ఈ రోజు పాదయాత్ర ముగిసింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఒక్క చక్కెర ఫ్యాక్టరీ సంక్షోభంలో పడితేనే వేలాది మంది రైతులు, కార్మికుల జీవితాలు తలకిందులవుతున్నాయి. మరి.. కేవలం మీ ఒక్కరి స్వార్థం వల్ల రాష్ట్రంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డెయిరీలు మొదలుకుని.. జూట్‌ మిల్లులు తదితర ఫ్యాక్టరీలు కోకొల్లలుగా మూతబడుతున్నాయే.. వాటిపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాల కన్నీటికి కారణం మీరు కాదా? 
-వైఎస్‌ జగన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top