268వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

268వ రోజు పాదయాత్ర డైరీ

Published Mon, Sep 24 2018 3:04 AM

268th day padayatra diary - Sakshi

23–09–2018, ఆదివారం 
సరిపల్లి కాలనీ, విశాఖపట్నం జిల్లా 

భాగస్వామ్య సదస్సుల ప్రయోజనం ఏదీ?
నేటితో విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ఈ జిల్లావాసుల ప్రేమాభిమానాలను మూటగట్టుకుని విజయనగరంలో అడుగులేయబోతున్నాను. నర్సీపట్నం మొదలుకుని భీమిలి దాకా.. 12 నియోజకవర్గాల్లో ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిది. కంచరపాలెం సభ కలకాలం గుర్తుండిపోతుంది. 

ఈ జిల్లా అంతటా అల్లుకుపోయిన భూకుంభకోణాలు, అవినీతి, అక్రమాలు.. కడలి కల్లోలాలను తలపించాయి. ప్రజల కన్నీటి కష్టాలు కలచివేశాయి. నాన్నగారి హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప.. ఈ నాలుగున్నరేళ్లలో ఇసుమంతైనా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల, గోవాడ సహకార చక్కెర కర్మాగారాలను కష్టాల ఊబిలోంచి గట్టెక్కించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హెరిటేజ్, విశాఖ తదితర ప్రయివేటు డెయిరీల దోపిడీ నుంచి పాడి రైతులను కాపాడాల్సిన అవసరం అనివార్యమైనది. భూరాబందుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే.. పేదలకు సెంటు భూమి కూడా మిగిలేట్టు లేదు. మొత్తానికి హుద్‌ హుద్‌ తుపాను లాంటి ప్రకృతి వైపరీత్యాల కన్నా.. ఈ పాలనలోని దాష్టీకాలే ఇక్కడి ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయి. 

ఆర్థిక రాజధాని విశాఖను పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. కొత్త కంపెనీలు రాకపోగా ఉన్నవి మూతబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. కోట్లు ఖర్చు చేసి ఆర్భాటంగా జరిపిన భాగస్వామ్య సదస్సుల ప్రయోజనం ఏదీ? నేతలు గొప్పగా చెప్పిన పెట్టుబడుల ఉప్పెన కనిపించడంలేదే! వారు పదే పదే ఊదరగొడుతున్నట్టు లక్షలాది ఉద్యోగాలే వచ్చి ఉంటే.. యువతకు నిరుద్యోగ దుస్థితి ఉండేదా? 

ఈ రోజు ఆనందపురం, పెందుర్తి మండలాల్లో పాదయాత్ర సాగింది. అక్కిరెడ్డిపాలెం వద్ద మహేశ్, సూర్యనారాయణ తదితర నిరుద్యోగ యువకులు కలిశారు. ఇక్కడి ఆటోనగర్‌ పారిశ్రామిక ప్రాంతంలో స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఉపాధి అవకాశాల్లేక స్థానిక యువత వలసబాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బొడ్డపూడివానిపాలెం, బంధంవానిపాలెం గ్రామాల అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ గ్రామాల్లో మొత్తం ఉప్పు నీరేనట. తాగునీరు కొనాలి.. లేదా పక్క గ్రామాలకెళ్లి తెచ్చుకోవాలి. పేదలకెంత కష్టం? పాలకుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే ఈ దుస్థితికి కారణం కాదా? 

సాయంత్రం పెందుర్తి మండల మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే అక్కచెల్లెమ్మలు కలిశారు. సంవత్సరాలుగా పిల్లలకు వండిపెడుతున్నా.. చాలీచాలని వేతనాలే. నెలల తరబడి జీతాల్లేవు.. బిల్లులూ రావు. మరి పిల్లలకెలా వండిపెట్టాలి? సమయానికి సరుకుల బిల్లులు చెల్లించరు.. కుళ్లిపోయిన, నాసిరకం గుడ్లను వారే సరఫరా చేస్తారు.. ఆపై నాణ్యత లేని భోజనం పెడుతున్నారని అభాండం వేసి.. కమీషన్లు తీసుకుని ప్రయివేటు వాళ్లకు అప్పజెపుతున్నారు. ఇందులో మా తప్పేంటి.. అనేది ఆ అక్కచెల్లెమ్మల ఆవేదన. మధ్యాహ్న భోజనం లాంటి పేద పిల్లల పథకాలు సైతం.. పాలకుల కమీషన్ల కక్కుర్తికి బలయిపోవడం దౌర్భాగ్యం. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇంటింటికీ మినరల్‌ వాటర్‌ సదుపాయాన్ని కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.. ఏమైందా పథకం? మినరల్‌ వాటర్‌ సంగతి దేవుడెరుగు.. కనీసం తాగడానికి కూడా నీరందని గ్రామాల మాటేంటి?  
-వైఎస్‌ జగన్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement