25 మార్కులకే పరీక్ష

25 Marks Paper For NIT Exam in Andhra Pradesh - Sakshi

మల్టిపుల్‌ చాయిస్‌లో ప్రశ్నలు

గంటపాటు సమయం

ఏపీ నిట్‌ విద్యార్థులకు అవకాశం

డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు వెల్లడి  

తాడేపల్లిగూడెం: మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో 25 మార్కులకు పరీక్షలు రాస్తే చాలు.. పై తరగతికి ప్రమోట్‌ కావచ్చు.. సరళంగా ప్రశ్నలు ఉంటాయి.. గంట సమయం ఇస్తారు.. ఆన్‌లైన్‌లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.. ఇది ఏపీ నిట్‌ విద్యార్థులకు కరోనా నేపథ్యంలో ఇస్తున్న బంపరాఫర్‌. ఏదైనా కారణాల వల్ల ఆన్‌లైన్‌ పరీక్షలు రాయకపోతే, కళాశాల ప్రారంభమయ్యాక 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా పరీక్షలను పూర్తిగా రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.  

29 నుంచి పరీక్షలు
ఆన్‌లైన్‌ పరీక్షల షెడ్యూల్‌ను నిట్‌ డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు సోమవారం ప్రకటించారు. ఈనెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. పేపర్‌కు 100 మార్కులకు గాను ఇంటర్నల్స్‌కు 35 మార్కులు, మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షలకు 40 మార్కులు ఇస్తారని, మిగిలిన 25 మార్కులకు మల్టీపుల్‌ చాయిస్‌ పద్ధతిలో గంటపాటు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆఖరి ఏడాది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, దీంతో మిగిలిన సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక పద్ధతిలో అవకాశం కల్పించామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞాన విధానంలో పరీక్షల ఫార్ములాను తయారు చేయడం వల్ల అవకతవకలకు అవకాశం లేదన్నారు. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో ప్రత్యేక ఫార్ములాతో పరీక్షలు నిర్వహించేది ఏపీ నిట్‌ మాత్రమే అని డైరెక్టర్‌ రావు స్పష్టం చేశారు. ఒకవేళ పరీక్షలు రాసే అవకాశం వినియోగించుకోలేని విద్యార్థులకు కళాశాల తెరిచిన తర్వాత 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. 

ఆన్‌లైన్‌ పరీక్షలు వద్దు: విద్యార్ధులు  
కరోనా నేపథ్యంలో పలు జాతీయ విద్యాసంస్థలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నాయని.. ఇదే విధానాన్ని ఏపీ నిట్‌ కూడా అనుసరించాలని విద్యార్థులు కోరుతున్నారు. 40 శాతం మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని, ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యుత్‌ సమస్యలు కారణంగా ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు లేదన్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు నిట్‌ డైరెక్టర్‌కు వినతుల రూపంలో తెలియజేశారు. మానసిక ఒత్తిడి, ఆవేదనలో ఉన్నామని, ఈ తరుణంలో పరీక్షలకు సన్నద్ధం కాలేమని చెబుతున్నారు.

జాతీయ విద్యాసంస్థల్లో పరీక్షలు రద్దు
కోవిడ్‌–19 నేపథ్యంలో జాతీయ విద్యాసంస్థలు సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేశాయి. ఢిల్లీ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, వరంగల్‌ నిట్, నిట్‌ కురుక్షేత్ర, రూర్కెలా, షిబ్‌పూర్, నిట్‌ సిల్‌చర్, నిట్‌ అగర్తలా వంటివి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top