నూతన వధూవరులను కలిపే శుభ వేడుక గ్రామంలో మండలంలోని ఏనుగుపాలెంలో విషాదం నింపింది
► వాంతులు, విరోచనాలతో మంచం పట్టిన ఏనుగుపాలెం గ్రామస్తులు
► 230 మందికి పైగా అస్వస్థత
వినుకొండ రూరల్: నూతన వధూవరులను కలిపే శుభ వేడుక గ్రామంలో మండలంలోని ఏనుగుపాలెంలో విషాదం నింపింది. వేడుక సందర్భంగా గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన వారందరూ విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేపింది. తెలిసిన వివరాల ప్రకారం.. మండలంలోని ఏనుగుపాలెం గ్రామానికి చెందిన పాపసాని శ్రీనివాసరావుకు శావల్యాపురం మండలం గుంటుపాలెంకు చెందిన విజయలక్ష్మితో ఈ నెల 6న తిరుపతిలో ఘనంగా వివాహం జరిగింది.
వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 11న గ్రామంలో సత్యనారాయణస్వామి వ్రతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు వికటించి బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి పాలయ్యారు. విందు జరిగిన మరుసటి రోజు (శుక్రవారం) కడుపులో నొప్పి రావడంతో పలువురు స్థానిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నారు. వారు రాసిచ్చిన మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో సమస్య తీవ్రతరం దాల్చింది. శనివారం ఉదయం కూడా వాంతులు, విరేచనాలు ఆగకపోవడంతో ఒక్కొక్కరుగా గ్రామంలోని పీహెచ్‌సీ అంతా నిండిపోయింది.
పరిస్థితి విషమంగా ఉన్న వారిని వైద్యులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని సూచించడంతో ఈ మేరకు బంధువులు తరలించారు. ఉదయం 10 గంటలలోపే రోగుల సంఖ్య 200 దాటిపోయింది. వీరితో పాటు పెరుమాళ్ళపల్లి, చినకంచర్లకు చెందిన బంధువులు కూడా ఇదే విధంగా వైద్యశాలకు వచ్చారు. పెళ్లి కుమార్తె స్వగ్రామమైన గుంటుపాలెంలో కూడా 30 మంది వరకూ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బాధితులందరికీ సకాలంలో వైద్యసాయం అందడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. జరిగిన పరిణామాల రీత్యా ఆహారం విషతుల్యం అయినట్లు వైద్యులు భావిస్తున్నారు.
రాజకీయ నాయకుల పరామర్శ
సమాచారం తెలుసుకున్న శాసన సభ్యుడు జీవీ ఆంజనేయులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు హుటాహుటినా ఏనుగుపాలెం ప్రాథమిక వైద్యశాలకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. ఘటన గురించి ఆరా తీశారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో మురళీకృష్ణతో పాటు వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వేముల సత్యనారాయణ వినుకొండ నుంచి రోగులకు కావాల్సిన మందులు తెప్పించి మరీ చికిత్స అందించారు.