రోగి ప్రాణంతో చెలగాటం

108 staff neggligence - Sakshi

అందుబాటులోనే 108... లేదన్న సిబ్బంది

రోగి ఇంటికి సమీపంలోనే వాహనాన్నిగుర్తించిన బాధితులు

ఇదేమి తీరు అంటూ బంధువుల ఆవేదన

విశాఖసిటీ: పెట్టుబడుల పేరుతో ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వానికి సామాన్యుడి ప్రాణాలంటే లెక్కలేని తనం. వైఎస్‌ హయాంలో వెలుగొందిన 108 సేవలు..  నీరుగార్చేశారనడానికి నిదర్శనమైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. చెంతనే అంబులెన్స్‌ ఉన్నా.. ఫోన్‌ చేస్తే లేదని చెప్పడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన వైనం ఆ కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. రేసపువానిపాలెంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం వెనుక నివాసముంటున్న బొదిరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బ్రహ్మానందం   నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం 5.20 నిమిషాలకు బ్రహ్మానందం ఆరోగ్యం క్షీణించడంతో శ్రీనివాసరెడ్డి 108 వాహనానికి ఫోన్‌ చేసి వివరాలు చెప్పారు.

కొంత సమయం తర్వాత మీ చిరునామా సమీపంలో 108 వాహనం అందుబాటులో లేదని, వేరే ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్రం నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పటికే బ్రహ్మానందం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీనివాసరెడ్డి తన ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లారు. బైక్‌పై వెళ్తున్నప్పుడు తన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఇండోర్‌ స్టేడియంలోనే 108 వాహనం ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. బ్రహ్మానందాన్ని రామాటాకీస్‌ రోడ్డులో ఉన్న ప్రేమ ఆస్పత్రిలో చేర్పించి 108 వాహనం వద్దకు చేరుకున్నారు. అక్కడ వాహనంలో డ్రైవర్‌ నిద్రిస్తున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్‌ను కడుగుతున్న విషయాన్ని గమనించానన్నారు. రోజూ ఇండోర్‌ స్టేడియం వద్ద 108 వాహనం అందుబాటులో ఉంటుందనీ, అయితే.. ప్రజలకు అత్యవసర తరుణంలో ఇలా వ్యవహరించడం బాధాకరమైన అంశమని వ్యాఖ్యానించారు. సరైన సమయానికి బైక్‌పై తీసుకెళ్లడంతో ఆయన కోలుకున్నారనీ, ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యంపై 108 సిబ్బందికి ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top