ఇసుక టిప్పర్ల పోటీ.. కుటుంబం బలి 

10 people died in road accidents in the state - Sakshi

ముగ్గురి ఉసురు తీసిన అక్రమ ఇసుక రవాణా 

రాజధాని ప్రాంతంలో దారుణం 

మరో మూడు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి 

గుంటూరు జిల్లా తాడేపల్లి, చిత్తూరు జిల్లాల్లో ఘటనలు 

రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇసుక టిప్పర్ల మధ్య పోటీతో.. ఒక దానిని ఇంకొకటి ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో భర్త, భార్య, 18 నెలల పసిపాప అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ల ఆగడాలకు ఆ కుటుంబం బలి కావడం స్థానికులను కలచివేసింది. మరోవైపు ఇదే రాజధాని పరిధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు.. చిత్తూరు జిల్లాలో మహేంద్ర బొలెరో మాక్స్‌ వాహనం, ఈచర్‌ లారీ ఢీకొన్న ఘటనలో తిరుమల దైవదర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. 

తాడేపల్లిరూరల్‌/రేణిగుంట(చిత్తూరు): రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇసుక టిప్పర్ల మధ్య పోటీతో.. ఒక దానిని ఇంకొకటి ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో భర్త, భార్య, 18 నెలల పసిపాప అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ల ఆగడాలకు తమ పెళ్లి రోజునే ఆ కుటుంబం బలి కావడం స్థానికులను కలచివేసింది. మరోవైపు ఇదే రాజధాని పరిధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు.. చిత్తూరు జిల్లాలో మహేంద్ర బొలెరో మాక్స్‌ వాహనం, ఈచర్‌ లారీ ఢీకొన్న ఘటనలో తిరుమల దైవదర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు  ప్రమాదాల్లో 10 మంది మరణించారు.
నులకపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు   

పెళ్లి రోజే చివరిరోజు.. 
రాజధాని పరిధిలోని రోడ్లు రక్తమోడాయి. 18 గంటల వ్యవధి.. 25 కిలోమీటర్ల దూరంలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక ఇసుక టిప్పర్‌ను మరో ఇసుక లారీ ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  కొమ్మతోటి శ్రీకాంత్‌ (27), భార్య సరిత (24), అక్షర (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్, సరితల పెళ్లిరోజు సోమవారం కావడంతో బంధువుల ఇంటికి వెళ్లి, అక్కడ నుంచి మంగళగిరిలో కొత్త దుస్తులు తెచ్చుకోవడానికి కుమార్తెతో బయల్దేరారు. మార్గమధ్యలో అనుకోకుండా ఇసుక టిప్పర్‌ రూపంలో మృత్యువు వెంటాడి వారిని బలిగొన్నది. ఈ ప్రమాదంలో కొమ్మతోటి శ్రీకాంత్‌కు తలకు బలమైన గాయమై, మెదడు బయటకు వచ్చింది. భార్య సరితకు ముక్కులు, చెవుల్లోనుంచి తీవ్ర రక్తస్రావమై మృతి చెందారు. పాప అక్షర మాత్రం 108 వచ్చేంత వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. రోడ్డుపక్కన వెళ్లేవారు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఎటువంటి ఫలితం దక్కలేదు. అలాగే రాజధాని ప్రాంతమైన కురగల్లులో శనివారం రాత్రి పెట్రోలు కొట్టించుకుందామని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చావలి గోపిరాజు(26)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుళ్లూరు మండలం మందడం వద్ద శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బత్తులూరి వెంకటేశ్వరరావు(50) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. 

శ్రీవారి దర్శనానికి వెళ్తూ.. 
చిత్తూరు జిల్లా రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులందరినీ కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఏడాదిన్నర పాప ఉంది. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపిన వివరాల మేరకు... రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న మహేంద్ర బొలెరో మాక్స్‌ వాహనం, ఈచర్‌ లారీ ఢీకొన్నాయి. బొలెరో మాక్స్‌ వాహనంలో తిరుమల దర్శనార్థం వస్తున్న కర్నూలు జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరటమద్దికి చెందిన నాగరాజశెట్టి(55), అతని భార్య రమాదేవి(50), తల్లి నారాయణమ్మ(72), కుమారులు సురేంద్ర(22), మధుజయకుమార్‌(18), కుమార్తె రేణుక(24), అల్లుడు ప్రవీణ్‌కుమార్‌(35) వారి పిల్లలు దేవాన్ష్(ఏడాదిన్నర), తనీష్‌(7).. ఇలా తొమ్మిది మంది బృందంతో కలసి తిరుమల దర్శనార్థం శనివారం రాత్రి 10 గంటలు దాటాక బయలుదేరారు. ఆదివారం ఉదయం రేణిగుంట మండలం మామండూరు సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నాగరాజుశెట్టి, అతని భార్య రమాదేవి, తల్లి నారాయణమ్మ, అల్లుడు ప్రవీణ్‌కుమార్, అతని కుమార్తె ఏడాదిన్నర చిన్నారి దేవాన్ష్ అక్కడికక్కడే మృత్యుపాలయ్యారు. గాయపడిన రేణుక, తనీష్, సురేంద్ర, మధుజయకుమార్, వాహన డ్రైవర్‌ కరీముల్లా తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి తనీష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top