breaking news
	
		
	
  - 
      
                   
                                                       ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్లు స్పష్టమైంది. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో విధుల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం సౌమ్య కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రధాన నిందితుడు కశింకోట అనిల్‌కుమార్ ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఇందుకు శరభవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కళ్యాణం ఉమామహేష్, రాగోలు దుర్గావిగ్నేస్ సహకరించారు. వీరు ముగ్గురినీ పోలీసులు వైరామవరం మండలం, పాతకోటలో అరెస్ట్ చేశారు. వీరితోపాటు సౌమ్య కదలికలపై రెక్కీ నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్‌దొర, పూసం పవన్ కుమార్‌లను అదే గ్రామంలో అరెస్టు చేశారు.ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ కుమార్‌పై గంజాయి కేసుతో పాటు మరో నాలుగు క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. బాధితురాలిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ముఖ్యమైన మార్గాలను మూసివేయడం, చెక్‌పోస్టులకు అలర్ట్ ఇవ్వడం, జీపీఎస్ ట్రాకింగ్, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కదలికలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. శరభవరంలో సౌమ్యను కిడ్నాప్ చేసిన తరువాత గట్టి నిఘా ఉందని తెలుసుకున్న కిడ్నాç³ర్లు కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని జగ్గంపేట సమీపంలో నిర్మానుష్య ప్రదేశం వద్ద వదలి, మరో వాహనంలో పాతకోట గ్రామానికి పరారైనట్లు పేర్కొన్నారు. నిందితులు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం ద్వారా వారున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలిగామని తెలిపారు.
- 
      
                   
                                                       సై'డర్'..!మన ఇంట్లో బంగారం పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మన కుటుంబంపై ఎవరైనా దాడికి పాల్పడినా.. ఆడపిల్లలను ఏడిపించినా.. ఎవరైనా మోసగించినా వెంటనే స్పందిస్తాం. అంతేవేగంగా పోలీసులు సైతం విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రూ.కోట్లలో మోసాలకు పాల్పడే కంటికి కనిపించని, పరిచయం లేని సైబర్ మోసగాళ్లపై పరువు అనే సమస్యకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం అంతా వెనకడుగు వేస్తారు.ఎందుకంటే టెక్నాలజీ పరంగా, సామాజిక మాధ్యమాల పరంగా కొన్ని బలహీనతలకు లోబడి చేసే తప్పులు బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆగిపోతున్నారు. కుటుంబంలో తెలిస్తే బాధపడతారని రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. – శ్రీకాకుళం క్రైమ్గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్ చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన సైబరాసురులు హనీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్, పార్ట్‌టైం జాబ్‌ల పేరిట రెచ్చిపోతున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులతో సుమారు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయని, స్టేషన్ మెట్లెక్కని బాధితులు మరింతమంది ఉండొచ్చని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మోసపోయినవారిలో ఉన్నత ఉద్యోగ వర్గాలే ఉండడం విశేషం. హనీ ట్రాప్‌లో పడి.. జిల్లాకేంద్రం సమీపంలోని సంపన్న వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల ఒక అమ్మాయి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. ప్రొఫైల్ పిక్‌లో అమ్మాయి ఫొటో ఉండడంతో ఆకర్షితమైన సదరు వ్యక్తి వెంటనే హాయ్ అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిత్యం చాటింగ్ చేయడం రివాజైంది. కొన్నాళ్లకు వాట్సాప్ కాల్లో మాట్లాడడం.. వీడియో కాల్స్ చేయడం ఆరంభించింది. అలా ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి వీడియో కాల్స్‌లో న్యూడ్ కాల్స్ చేయడం ప్రారంభించింది. కొద్దిరోజులు తానే న్యూడ్‌గా కనిపించి ఆ తర్వాత సదరు వ్యక్తిని సైతం న్యూడ్‌గా కనిపించాలని కోరిక కోరడంతో, అతడు కూడా నగ్నంగా మాట్లాడడం ఆరంభించాడు. దీంతో ఆ వ్యక్తి నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్‌ను రికార్డింగ్ చేసిన ఆ యువతి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించింది.ఆమె తరపున మరికొంతమంది సైతం వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందేమోనని భయపడి, చేసేదేమీలేక వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు దఫదఫాలుగా రూ.28 లక్షల వరకు పంపించేశాడు. అయినప్పటికీ డబ్బుల కోసం పీడిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిజిటల్ అరెస్టు పేరిట.. విశాఖపట్నంలోని ఒక అకౌంటింగ్ సెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీకాకుళం నగరవాసి డిజిటల్ అరెస్టు పేరిట రూ.11 లక్షలను సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. మీ పేరిట కొరియర్లో డ్రగ్స్ ప్యాకెట్ వచ్చిందని.. మీ ఆధార్ లింక్ నంబర్‌తో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ, కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసే వీలుందని ఒక వ్యక్తి బెదిరించడంతో నిజమేనని నమ్మాడు. దీనినుంచి బయటపడాలంటే ముందుగా రూ.30 వేలు తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఉద్యోగి వేశాడు. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి పై అధికారులను మేనేజ్ చేయడం కుదరడం లేదని.. వారే మీకు లైన్లోకి రావొచ్చని మెల్లగా జారుకున్నాడు. కొన్ని గంటల్లోనే పోలీసు సెటప్‌తో ఉన్న ఓ రూంలో యూనిఫాంతో ఓ వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమై తాను ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. మేం నిన్ను నమ్మాలంటే మీ బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు వెరిఫికేషన్ చేయాలన్నాడు. వాటి ఆధారంగా ఇటీవల జరిగిన ఆన్లైన్ లావాదేవీలు పరిశీలించాలని.. కొంత అమౌంట్‌ను కూడా వెరిఫికేషన్‌లో భాగంగా తీయాల్సి వస్తుందని చెప్పాడు. అందులో జెన్యూనిటీ ఉంటే తిరిగి మీ ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుందని చెప్పడంతో సదరు ఉద్యోగి ఓకే చేశాడు. అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేయడంతో పాటు ఓటీపీలు చెప్పడంతో రూ.11 లక్షలను కొట్టేశారు. దీంతో తాను మోసానికి గురయ్యానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జేఈ రూ.3 లక్షలు, నగరానికి చెందిన ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ వీరిని సైబరాసురులు అధికారుల పేరిట బెదిరించడం విశేషం.పార్ట్‌టైం జాబ్ ఫ్రాడ్స్.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఇంట్లోనే ఉంటూ పార్ట్‌టైం జాబ్ చేసే వీలుందని చెప్పడంతో నగరంలో నలుగురు చిరుద్యోగులు ఈ ఉచ్చులో పడ్డారు. ముందుగా వారు క్రియేట్ చేసిన గ్రూపుల్లో మెంబర్లుగా చేరారు. మొదటి టాస్‌్కలో రూ.5 వేలుకు రూ.1000లు అదనంగా రూ.6 వేలు, రెండో టాస్‌్కలో రూ.10 వేలకు రూ.2 వేలు అదనంగా రూ.12 వేలు వేయడంతో విత్‌డ్రా చేసుకున్నారు. అనంతరం అత్యాశకు పోయి తర్వాత టాస్క్‌ల్లో రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ.2 లక్షలకు అదనపు సొమ్ము ఖాతాల్లో ఉన్న ఆప్షన్లో చూపించినా విత్‌డ్రా చేయడానికి వీలుకాకపోవడం.. ఆ తర్వాత అవతలివాళ్లు వీరి నంబర్లు బ్లాక్ చేయడంతో మోసపోయామని గ్రహించారు. పోలీసులకు ఆసక్తి ఉన్నా.. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నా మోసం చేసే సైబర్ కేటుగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల్లో సైతం ఉండడం.. తెలియని ప్రాంతాల్లో రిస్క్ చేసి పట్టుకోవడానికి వెళ్లే ఆసక్తి ఉన్నా.. రాను పోను ఖర్చులు, వసతి ఖర్చులకు చేతి చమురు తగులుతుండటం.. ఆపై ఎక్కువ రోజుల సమయం వెచ్చించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు. అలా కేసుల్లో అధికశాతం పెండింగ్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన ప్రభుత్వాలు కాస్తా చొరవ తీసుకుని ఆర్థికంగా చేయూతనిస్తే కేసుల ఛేదన సులభమేనంటూ పోలీసులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడికి టోకరా నగర పరిసరాల్లో ఉండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఓ నేరం చేశాడని.. సీబీఐ, ఈడీ విభాగాల అధికారులు అరెస్టు చేసే వీలుందని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. దానికి తగ్గ ఆధారాలు తమ వద్దనున్నాయని చెబుతూనే ఫేక్ వివరాలు వాట్సాప్‌లో పంపడంతో ఉపా«ధ్యాయుడు ఖంగుతిన్నాడు. మీ అబ్బాయి నేరం నుంచి బయటపడి, విదేశాల నుంచి రావాలనుకుంటే అధికారులకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నారు.పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుందని అనడంతో చేసేదేమీలేక రూ.35 లక్షలు వారు చెప్పిన వివిధ ఖాతాల్లోకి పంపించాడు. ఎక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనని గంట గంటకు ఉపాధ్యాయునికి వాట్సాప్ వీడియో కాల్ నేరస్తులు చేసేవారు. తర్వాత వాళ్ల నంబర్లకు ఫోన్ కాకపోవడంతో బాధిత ఉపాధ్యాయుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. క్షణాల్లో మోసాన్ని గ్రహించాలి సహజంగా జరిగే చోరీలు.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న సైబర్ మోసాలను పరిశీలిస్తే 1:10 నిష్పత్తిలో నగదు మోసానికి గురవుతోంది. సైబర్ నేరగాడు బాధితుడి ఆర్థిక స్థితిని చూడడు. అత్యాశనే చూస్తాడు. వారు చేసే మోసాన్ని క్షణాల్లో మనం గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని పూడ్చవచ్చు. ఈవిధంగానే ఇటీవల డిజిటల్ అరెస్టు వలలో పడి రూ.13.5 లక్షల పోగొట్టుకున్న జెమ్స్ వైద్యురాలి కేసు ఛేదించాం. కోచిగూడ్, మైసూర్ వెళ్లి నిందితులను పట్టుకున్నాం. రాష్ట్రంలో రోజుకి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు బాధితులు నష్టపోతున్నారు. – సీహెచ్ పైడపునాయుడు, సీఐ, శ్రీకాకుళం రూరల్
- 
      
                   
                                                       ఆరుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్కడప అర్బన్: వైఎస్సార్ కడప, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 52 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం జిల్లాలోని చాపాడు మండలం ప్రొద్దుటూరు–అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా.. ఆరుగురిని పట్టుకున్నారు. నిందితులు అడవిలో ఎరచ్రందనం చెట్లను నరికి, దుంగలుగా మార్చి వాటిని ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబులరెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగిరెడ్డి ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరిలో ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్. కడప జిల్లాలో ఇతనిపై 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఇతడి భార్య లాలూబీపైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయి జైలులో ఉందని ఎస్పీ చెప్పారు. ఇతని కుటుంబ సభ్యులైన లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు. నాగదస్తగిరిరెడ్డి తన అనుచరులైన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, కాయలి శ్రీనివాసులు, ఓబులరెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన స్మగ్లర్, ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్‌లో ఉండే విక్రంసింగ్ సోలంకి డబ్బులను హవాలా రూపంలో నాగదస్తగిరిరెడ్డికి అందజేస్తున్నాడన్నారు. విక్రంసింగ్ సోలంకిని కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఉమ్మనబోయిన క్రిష్ణయ్యపై కర్నూలు జిల్లాలో 2 ఎర్రచందనం కేసులు, 3 చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఆర్ఎస్టిఎఫ్ సీఐ సి.శంకర్‌రెడ్డి, ఆర్ఎస్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది, మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యను ఎస్పీ అభినందించారు.ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!» ఎర్ర చందనం కేసులో అరెస్టయిన రామమోహన్ » ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు » రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్‌తో చెట్టాపట్టాలుకడప అర్బన్: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాం«దీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
- 
      
                   
                                                       అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతినెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్‌కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడతామని చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య హాస్టల్ బాత్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్‌ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు.
- 
      
                   
                                                       ఇంటి పక్కనే ఉంటాడు.. నా భార్యను వేధిస్తున్నాడు..జంగారెడ్డిగూడెం: తన భార్యను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఓ భర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తన కుటుంబసభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదుదారిడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పడంతో ఈ నెల 7న రాత్రి ఫిర్యాదుదారుడు ఆ యువకుడిని పిలిచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ యువకుడు దాడికి యత్నించాడు. దాడి సమయంలో యువకుడి బావమరిది కూడా సహకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ టి.బాబూరావు తెలిపారు.
- 
      
                   
                                                       వ్యభిచార ముఠా గుట్టు రట్టు!కర్నూలు: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్లైన్లో యువకులకు యువతుల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డిలు స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అరెస్టయిన వారిలో 9 మంది నిర్వాహకులు, నలుగురు విటులు ఉన్నారు.విజయవాడ, అనంతపురం, హైదరాబాదు, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగించేవారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్‌లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది. కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని మద్దూరు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్‌కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన సుజాత, కర్నూలు సంతోష్ నగర్‌కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్‌కు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్‌కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులతో పాటు విటులు కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్ తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని, ఇంటి యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డయల్ 112 లేదా 91211 01062 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
- 
      
                   
                                                       నెల్లూరులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిసాక్షి, చాకిచెర్ల: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుపాన్ వాహనం లారీని ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తుపాను వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, వీరంతా.. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
- 
      
                   
                                                       మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన తనయుడుకర్నూలు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన ఘటన కర్నూలులో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. బుధవారపేటలోని కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో రుద్రాక్ష ఎల్లమ్మ(70), కుమారుడు జమ్మన్న నివాసముంటున్నారు. జమ్మన్న వంట మాస్టర్‌గా పనిచేస్తూ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గురువారం రాత్రి తల్లిని వేధించాడు. ఆమె ఇవ్వకపోవడంతో తెల్లవారుజామున ఒంటరిగా పడుకుని ఉన్న తల్లి చెవి కమ్మలను బలవంతంగా లాక్కొన్నాడు. అనంతరం ముక్కు మూసి హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. జమ్మన్న కూతురు జ్ఞానేశ్వరి ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                                       AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్‌రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
- 
      
                   
                                                       సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్.. నాలుగు రోజులుగా రెక్కీ..రంపచోడవరం: సచివాలయ మహిళా ఉద్యోగిని అపహరించుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం శరభవరంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. శరభవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సోయం శ్రీసౌమ్య ఉదయం 10.30 గంటలకు రోజూ మాదిరిగా విధులకు హాజరయ్యారు.ఈ క్రమంలో వేటుకూరుకి చెందిన కె.అనిల్‌కుమార్ మరికొందరి సహాయంతో AP31TJ1462 నంబరు గల ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్లి బెదిరించి, బలవంతంగా ఈడ్చుకుంటూ ఎక్కించుకుని పారిపోయాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు నాలుగు రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందూ కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది.
- 
      
                   
                                                       విశాఖలో విషాదంవిశాఖ సిటీ: విశాఖ వన్‌టౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ రోడ్డులోని వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విస్ఫోటనం ధాటికి షాపు తునాతునకలైంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. సున్నపువీధి ప్రాంతంలో నివాసముంటున్న చల్లా గణేష్ (44) 6 నెలల క్రితమే బుక్కావీధి ప్రాంతంలోని ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని ప్రారంభించాడు. వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ తో పాటు హెల్పర్ శ్రీను, రోజువారీ వేతనం కింద ఎర్ర ఎల్లాజీ (45), డి.సన్యాసిరావు (46) పని చేస్తున్నారు. సాయంత్రం 4.30 సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండాపోయింది. షాపు యజమాని చల్లా గణేష్, హెల్పర్ శ్రీను శరీరాలు ముక్కలై షాపు వెనుక ఉన్న 9 అడుగుల గోడ పైనుంచి ఎగిరి అవతలివైపు పడ్డాయి. వర్కర్లు ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు దాని పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు (27), ఇప్పిలి రంగారావు(53)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో వన్‌టౌన్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి కేజీహెచ్‌కు తరలించారు. చింతకాయల ముత్యాలు శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 7 గంటలకు మరణించాడు. ప్రస్తుతం 95 శాతం కాలిన గాయాలతో ఎల్లాజీ, 75 శాతం గాయాలతో ఇప్పిలి రంగారావు, 18 శాతం గాయాలతో డి.సన్యాసిరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ద్వారా పేలుడుకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ పేలుడుకు వెల్డింగ్ సిలిండర్ కారణమా? లేదా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగంతోనే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
- 
      
                   
                                                       AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలంసాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు.
- 
      
                   
                                                       మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా..మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కారి్మకుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు.
- 
      
                   
                                                       అల్లూరి: కత్తులతో బెదిరించి ఉద్యోగిని కిడ్నాప్సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: దేవీపట్నం మండలంలో కిడ్నాప్ కలకలం రేగింది. సౌమ్య అనే మహిళను కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయారు. శరభవరం సచివాలయంలో ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు వాళ్లనూ బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌమ్యను ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారు? అనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
- 
      
                   
                                                       హరిత నన్ను క్షమించు..అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి..వాటిని తీర్చేమార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాలు..కర్నూలు నగరంలోని సీ క్యాంప్‌కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అనంతపురంలో నివాసం ఉంటున్న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పారు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ ..అటెండర్ రవికుమార్ భార్యకు ఫోన్ చేశారు. బాత్రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడని, పిలిస్తే పలకడం లేదని, మీరు వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టారు. అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకున్న రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు ఎస్.దీక్షిత, ఎస్.వీక్షిత ఉన్నారు.అప్పులే శాపంగా మారాయి..రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే... ‘హరిత క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక..వడ్డీలకు తిరిగి అప్పు చేసి అలా ఒకదానికి ఒకటి తోడయ్యాయి. కరణ్ నన్ను క్షమించరా.. నిన్ను మోసం చేశాను. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. హుస్సేన్.. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినైనా అప్పు అడుగుదామనుకుంటే నా పరిస్థితి బాగోలేదు. హుస్సేన్ నాకో హెల్ప్ చెయ్.. నా తర్వాత హరితకు బ్యాంకుకు సంబంధించి ఏదైనా సహాయం చేస్తావని నమ్ముతున్నాను. గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరీష్ సారీ రా..నీవు చాలా సార్లు హెల్ప్ చేశావు. నా కోసం చీటీ కూడా ఎత్తేసి డబ్బిచ్చావు. నువ్వు చాలా చాలా హెల్ప్ చేసినా.. నేను నీకోసం ఏమీ చేయలేని పరిస్థితి. కిశోర్ ఇకనైనా లోన్ కట్టుకోరా.. చాలా సార్లు హెల్ప్ చేశాను. కానీ నువ్వు చాలా మోసం చేశావు. హరిత పిల్లలు జాగ్రత్త.. శ్రావణి పిల్లలు జాగ్రత్త..వదిన చిన్నారిని నువ్వే చూసుకో’ అని పేర్కొన్నారు.
- 
      
                   
                                                       పలమనేరులో మహిళ దారుణ హత్య!చిత్తూరు జిల్లా: పట్టణ సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌హైవే పనులు సాగుతున్న ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం.. పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయానికి వెనుకవైపు ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటీవల ఆ గుంతల్లో వర్షపునీరు చేరింది. ఓ గుంతలో 30 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు. ఆపై మృతదేహాన్ని వెలికితీసి గమనించగా ముఖంపైన, శరీరంపై పలుచోట్ల రక్తగాయాలు కనిపించాయి. ఆ ప్రదేశానికి పైన గుంత ఒడ్డున ముళ్లపొదలపై మృతురాలి పాదరక్షలు, నైటీ, లోదుస్తులు కనిపించాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పోలికలున్న మహిళ కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో తచ్చాడుతూ ఉండేదని కొందరు చెబుతున్నారు. ఆమెకు మతి బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఘటన జరిగి మూడురోజులైంటుదని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పారు.
- 
      
                   
                                                       కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్యధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, విద్యారి్థని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                                       పెళ్లి వద్దంటే వినరా.. టెకీ ఆత్మహత్యజె.పంగులూరు: ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలంలోని కొండమంజులూరు గ్రామంలో మంగళవారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. కొండమంజులూరు గ్రామానికి చెందిన బొప్పుడి శివయ్య కుమార్తె బొప్పుడి మానస (26) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇది ఆమెకు ఇష్టం లేదు. దీంతో మంగళవారం చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చేశారు.
- 
      
                   
                                                       ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
- 
      
                   
                                                       నవ వధువు, శ్రీ చైతన్య లెక్చరర్ ఆత్మహత్య.. కారణం అదేనా?సాక్షి, కృష్ణా: కుటుంబ కలహాల కారణంగా నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకే తమ బిడ్డ చనిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్యతో అరుణ్ కుమార్ వివాహం జరిగింది. ఐదు నెలల క్రితమే ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. శ్రీవిద్య(24) ఉయ్యూరులోని శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అరుణ్ కుమార్ కలాపాములు గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా ఉన్నారు. అయితే, వీరికి వివాహం జరిగిన నాటి నుంచే అత్తరింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆమె.. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. ఇక, వివాహం జరిగిన ఐదు నెలలకే ఇలా తమ కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు.. కన్నీటి పర్యంతమవుతున్నారు.
- 
      
                   
                                                       తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్యసామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తుఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ధనుప్రసాద్ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్వైజర్ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.
- 
      
                   
                                                       యువతిని మోసం చేసిన కేసు.. టీడీపీ నేత తనయుడి అరెస్ట్కృష్ణాజిల్లా: యువతిని మోసం చేసేన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభివన్‌ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడేయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రలు.. తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్‌ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అభినవ్‌కు 14 రోజులు రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి..
- 
      
                   
                                                       తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులుసాక్షి టాస్క్‌పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్‌లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్‌కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు.
- 
      
                   
                                                       వాటిని తెరిస్తే తంటాలే..!సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. మోసపోతున్నారిలా.. » ముందుగా ‘ఆర్టీఓ టిఆర్ఏఎఫ్ఎఫ్ఐసి సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది. » మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది. » ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్‌బాక్స్‌లో మన ఫోన్ నంబర్ చేరుతుంది. » వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్‌ను అదే నంబర్‌తో ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చుతారు. » మన ఫోన్‌పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది. » మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది. » మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్‌కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. » వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు. » ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్‌కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు. » ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్‌ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులకే బురిడీసైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్‌తో సైబర్‌కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గానే తీసుకుంది.ఎం.పరివాహన్ యాప్‌లోనే కట్టాలి.. వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్‌లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్‌లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్
- 
      
                   
                                                       ఇంజినీ‘రింగ్ రింగ’తెనాలిరూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి అమ్మకాల్లో భాగస్తులై కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల వరుసగా గంజాయి కేసుల్లో స్టూడెంట్లు అరెస్టు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం గంజాయి అమ్ముతున్న, తాగుతున్న 13 మందిని గుంటూరు జిల్లా కొల్లిపర, తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 5.2 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హం. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం మాల డొంక ప్రాంతంలో కొల్లిపరకు చెందిన మల్లోల శోభన్ బాబు, పాముల రుషిబాబు, మండ్రురాజ్ కుమార్, ఆరే ఆదిత్య, అమిరే ఆనంద్ కిషోర్ గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోకూరి శ్రీను, కాజా గ్రామానికి చెందిన కారంకి నిఖిల్‌కుమార్, అత్తోటకు చెందిన యర్రు శశికుమార్, దాసరి చేతన్, రేపల్లెకు చెందిన కొసరాజు రోహిత్, కుంచవరానికి చెందిన గరిక గోపినాథ్, మేడా ప్రవీణ్, విశాఖపట్నంకు చెందిన కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి గంజాయి తాగుతున్నారని డీఎస్పీ వివరించారు. ఈ ముఠా విశాఖ జిల్లా పాడేరుకు చెందిన పరమేశ్వరన్ వద్ద గంజాయిని చౌకగా కొని తెనాలి పరిసర ప్రాంతాలలో 20 గ్రాములు రూ.500 చొప్పున అమ్ముతున్నట్టు తేలిందని వెల్లడించారు. నిందితులలో 9 మందిపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే 21 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేశామని, ఇప్పుడు మరో 13 మంది గంజాయి కేసులో అరెస్టు అయ్యారని డీఎస్పీ వివరించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి విక్రేతలు పదిమందిపై పీడీ యాక్టు ప్రయోగించబోతున్నామని పేర్కొన్నారు. నిందితుల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోందని, తల్లిదండ్రులు విద్యార్థులను కనిపెడుతుండాలని, లేకుంటే వారి జీవితాలు నాశనం అవుతాయని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పి.కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


