వేటు పడింది

MRO suspended for giving caste certificate without verification - Sakshi

నెన్నెల తహసీల్దార్‌ సత్యనారాయణ సస్పెన్షన్‌

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌

కొత్త తహసీల్దార్‌గా రాజలింగు నియామకం

రంగు రామాగౌడ్‌ ఆత్మహత్య ఉదంతంలో పురోగతి

పోలీస్‌ శాఖ తీరుపైనా విచారణ

మంచిర్యాలసిటీ : అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన రంగు రామాగౌడ్‌ ఉదంతంలో తొలి వికెట్‌ పడింది. రామాగౌడ్‌పై అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్‌ అనే వ్యక్తికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసినందుకు నెన్నెల తహసీల్దార్‌ సత్యనారాయణను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రాజలింగును నెన్నెల తహసీల్దార్‌గా బదిలీ చేశారు. అట్రాసిటీ కేసు విషయంలో తనకు న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో ఈ నెల 22న కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో రామాగౌడ్‌ క్రిమిసంహారక మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు.

పల్ల మహేష్‌ ఎస్టీ కాకున్నా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అట్రాసిటీ కేసు పెట్టాడని, తనకు న్యాయం చేయాలని ఆయన ప్రజావాణిలో రెండుసార్లు ఫిర్యాదు చేయడం, అధికారులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే రామాగౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ పీఎస్‌.రాహుల్‌రాజ్‌ను కలెక్టర్‌ కర్ణన్‌ విచారణ అధికారిగా నియమించారు.సబ్‌ కలెక్టర్‌ బుధవారం నెన్నెలకు వెళ్లి రామాగౌడ్‌ కుటుంబసభ్యులను విచారించారు. పల్ల మహేష్‌కు సంబంధించిన వివరాలు సేకరించారు. రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రాథమిక విచారణలోనే తేలింది. కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్‌ సత్యనారాయణ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

కొలావర్‌ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్‌ నేరుగా సర్టిఫై చేశారు. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు నమోదు కావడం, రామాగౌడ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ప్రాథమిక విచారణలో తహసీల్దార్‌పై మొదటి వేటు పడింది. ఎస్సై కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్‌ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో పోలీస్‌శాఖ తీరుపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఆ శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నిబంధనల మేరకు పోలీసులు కేసు పెట్టారా, ఒత్తిళ్లతోనే కేసు నమోదైందా అనేది తేలితే ఆ శాఖపై కూడా చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top