ఇరువురు చంద్రులూ చింతాక్రాంతులే

Devulapalli Amar Article On Chandrababu Naidu And KCR - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

తెలుగు రాష్ట్రాల సీఎంలకు అంతుబట్టని రాజకీయం ఇప్పుడు నడుస్తున్నట్లుంది. నిన్న మొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీపై ఈగవాలినా సహించని వీరభక్తుడిలా ఉండిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడేమో ఈ దేశాన్ని మోదీ కబంధ హస్తాల నుంచి కాపాడటానికి బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తానని దేశమంతా తిరుగుతున్నారు. మరోవైపున కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రతిపక్ష పార్టీలను కూడగట్టే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎవరికెన్ని స్థానాలు వస్తాయో తెలీని స్థితిలో తెలుగు సీఎంల దేశ పర్యటనలు.. తమకు రేపు ఏమవుతుందన్న ఆందోళన ఫలితమే అని జనాభిప్రాయం.

‘‘మన దేశంలో ఇప్పటివరకు ఇంత గొప్ప ప్రధానమంత్రి ఎవరూ లేరని నేను కచ్చితంగా చెప్పగలను అధ్యక్షా’’అని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో నరేంద్రమోదీని వేనోళ్ళా పొగుడుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు ఈ దేశాన్ని, వ్యవస్థలనూ, ప్రజాస్వామ్యాన్నీ మోదీ కబంధ హస్తాల నుంచి కాపాడటానికి బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తానని ప్రత్యేక విమానం వేసుకుని పిలవని పేరంటానికి దేశమంతా తిరుగుతున్నారు. ఎన్నికల్లో మోదీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం బీజేపీని ఎక్కడా పల్లెత్తు మాట అనకపోవడం (కాంగ్రెస్‌ నాయకులూ, వారి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ విషయం గమనించారో లేదో పాపం). చంద్రబాబుకు బీజేపీతో ఏ తగాదా లేదు, ఇప్పటికింకా ఆయన బీజేపీ మిత్రుడే. మోదీ, అమిత్‌ షా లేని.. వెంకయ్య నాయుడు, గడ్కారిలు ఉన్న బీజేపీ ఆయనకు కావాలి.

ఆంధ్రప్రదేశ్‌లో మొన్న ముగిసి ఇంకా ఫలితాలు వెలువడని లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చంద్రబాబు సూచించిన విధంగా వెంకయ్యనాయుడు ఆదేశాల మేరకే కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించారని ఆ పార్టీ రాష్ట్ర నేతలే ప్రైవేటు చర్చల్లో చెపుతున్నారు. చంద్రబాబు కూడా తన పార్టీ సహచరులతో ప్రైవేటు చర్చల్లో కేంద్రంలో మన ప్రభుత్వమే వస్తుంది అని చెప్తున్నారు తప్ప ఆ ‘మన’ ఎవరు అనే స్పష్టత ఇవ్వడం లేదట. దానితో తెలుగు తమ్ముళ్ళు బయటికొచ్చి ఈ ‘మన’కు రెండు మూడు అర్థాలు ఊహించుకుంటూ ఉన్నారట. ఒకటేమో అందరూ నేనంటే నేను అని కొట్లాడుకొని కాంప్రమైజ్‌ అభ్యర్థిగా మన బాబు గారినే ప్రధాన మంత్రిని చేస్తారేమో, అందుకే ఆయన మన ప్రభుత్వం అని చెప్పారు. పైగా మన పత్రికలూ, చానళ్ళు కూడా రాశాయి, మాట్లాడాయి కదా చంద్రబాబే ప్రధాని అని. రెండవది బీజేపీ నాయకత్వంలోనే మోదీ లేని ప్రభుత్వం ఏర్పడితే అది మనదే కదా అని. మూడోది బీజేపీయేతర కూటమి కాంగ్రెస్‌ నాయకత్వంలో వచ్చినా మన ప్రభుత్వమే కదా అని. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు ఫలానా అన్నట్టుగా ఉంది ఈ ఊహాగానాలన్నీ వింటుంటే.

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏ మాత్రమూ కనిపించడం లేదు. దేశమంతటా సర్వేలన్నీ ఘోషించడం ఒక ఎత్తు అయితే ఈవీఎంల మీద చంద్రబాబు చేస్తున్న యాగీ స్పష్టం చేస్తోంది ఆయన అధికారాన్ని కోల్పోబోతున్నారని. ఒక్క ఆఖరి మంత్రివర్గ సమావేశం అయినా నిర్వహించి తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఆయన పడ్డ తిప్పలు కూడా స్పష్టం చేస్తూనే ఉన్నాయి ఆయన అధికారంలోకి రాబోవడం లేదని. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఖాయం అని తెలిశాక కనీసం కేంద్రంలో మోదీని నిలువరించడం మీద దృష్టి పెట్టాలన్నది బాబు పట్టుదల. రాజకీయ ప్రత్యర్థుల పట్ల మోదీ, అమిత్‌ షా ద్వయం ఎట్లా వ్యవహరిస్తారో పొరుగు రాష్ట్రం తమిళనాట శశికళ ఉదంతం ఒక మంచి ఉదాహరణ.

మోదీ కేంద్రంలో మళ్ళీ రాకూడదు అనడానికి బాబు చెప్తున్న దేశ సమగ్రత, వ్యవస్థల సంరక్షణ వంటివేవీ కారణాలు కాదు. మళ్ళీ మోదీ వస్తే తాను స్టేల మీద కాలం వెళ్ళదీస్తున్న కేసులన్నీ తెరిపించి జైలుపాలు చెయ్యడం ఖాయం అన్న భయంతోనే ఆయన మోదీ వ్యతిరేక జపం మొదలు పెట్టారు. అయినా మోదీని నిలువరించడం గానీ, కాంగ్రెస్‌ కూటమిని గద్దె నెక్కించడంగానీ బాబువల్ల అయ్యే పనేనా? కూట్లో రాయి ఏరలేని వాడు ఏట్లో రాయి ఏరతానన్నాడనే సామెత బాబుకు బాగా వర్తిస్తుంది. ఏపీలో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలు. అందులో ఆయన పార్టీ ఎన్ని గెలవబోతుందో ఆయనకే తెలియదు. తాను  వేసిన ఓటు తనకు పడిందో లేదో తెలియని అయోమయం తనది.

ఇదంతా చూస్తుంటే 1989లో జరిగిన ఎన్నికల తదనంతర పరిణామాలు గుర్తొస్తున్నాయి. అవి బాబుకు గుర్తు లేవని ఎట్లా అనుకుంటాం. 1989 ఎన్నికలకు ముందు నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా ఎన్‌టీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకే బోఫోర్స్‌ కుంభకోణానికి వ్యతిరేకంగా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశమంతా పర్యటించి ప్రచారం చేశారు. ఫలితాలు చూస్తే నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడి పార్టీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో చిత్తుగా ఓడిపోయింది. 42 లోక్‌సభ స్థానాలు ఏపీలో ఉంటే రెండు మాత్రమే తెలుగుదేశంకు దక్కాయి. నేషనల్‌ ఫ్రంట్‌లో భాగం అయిన వీపీ సింగ్‌ ప్రధానమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ఫ్రంట్‌ అధ్యక్షుడయిన ఎన్‌టీఆర్‌ వైపు కన్నెత్తి అయినా చూసిందా?

నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా గౌరవం ఇవ్వకపోతేపోయారు కనీసం టీడీపీ ఎంపీ పర్వతనేని ఉపేంద్రను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్న సమాచారం అయినా ఇచ్చారా టీడీపీ అధ్యక్షుడికి? కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్ధాంతాలు, నైతిక విలువలు ప్రధానం.. అంకెలు కాదు అనుకోవడానికి ఇది వాజ్‌పేయి జమానా కాదు మోదీ కాలం అని చంద్రబాబుకు తెలియదా? కొనగలిగి ఉండి కూడా ఒక్క ఓటు తక్కువయిందని అధికారాన్ని వదులుకున్న వాజ్‌పేయితో ఇప్పటి నాయకులను ఎట్లా పోల్చగలం? రాష్ట్రంలో అధికారం కోల్పోయి, సంఖ్యాపరంగా లోక్‌సభలో తగిన బలం లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? అన్నీ 1996 రోజులు కావు కదా. అప్పుడంటే మామ దగ్గరి నుంచి లాక్కున్న అధికారం ఉంది, ఆయన మృతి వల్ల కలిసొచ్చి గెలిచిన లోక్‌సభ స్థానాల సంఖ్యా ఉంది. ఇప్పుడవి ఉంటాయన్న గ్యారంటీ ఉందా? ఇంకెంత.. 23వ తేదీ దాకా ఆగితే తెలిసిపోతుంది.

మరి చంద్రబాబు జాతీయ రాజకీయాల విషయంలో ఎందుకిన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ స్థితి నుంచి తనను తాను బయట పడేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదంతా. రాష్ట్రంలో అయిదేళ్ళు అధికారం గ్యారంటీ అయిన తెలంగాణా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా తీవ్ర ఆందోళన లోనే ఉన్నారు. గుళ్ళూ గోపురాలు తెగ చుట్టేస్తున్నారు. ఇంటర్వెల్‌లో రాజకీయ నాయకులను కలుస్తున్నారు. ఎక్కడా ఆయనకు అనుకూలమయిన హామీ లభించడం లేదు. మొన్ననే అంటే గతేడాది డిసెంబర్‌ లోనే కదా రెండో సారి మంచి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ఏలుతుంటే ఆయనకు ఆందోళన ఎందుకు అనొచ్చు ఎవరయినా. ఎందుకో చూద్దాం. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటయి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు సాధించుకోవడం తన లక్ష్యం అన్నది ఆయన చెపుతున్న మాట. కానీ ఆయన కూడా చంద్రబాబు లాగానే బయటికి చెపుతున్నది ఈ మాట అయితే అసలు మనసులో ఉన్నది వేరే ఆందోళన. ఓ ఏడాది కిందట ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌ రాగం మొదలు పెట్టగానే అందరూ కేసిఆర్‌ కేంద్రంలో మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావడం కోసమే కొన్ని పార్టీలను జమ చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో బయలుదేరాడని అన్నారు. అందుకు ఉదాహరణగా ఆయన ఈ ఫ్రంట్‌లోకి ఎన్‌డీఏలో లేని పక్షాలనే తెచ్చే ప్రయత్నం చేయడాన్ని చూపారు. 

నిజమే మొన్నటిదాకా కేసీఆర్‌ కూడా మోదీ భక్తుడే. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ మొదలయిన పలు నిర్ణయాలను బహిరంగంగానే సమర్ధించారు. అనాయాసంగా లభించే ప్రధాని అపాయింట్‌మెంట్‌లతో మోదీకి శాలువాలు కప్పి సన్మానించి వచ్చారు. లోక్‌సభలో రాష్ట్రంలోని 17కు 16 స్థానాలు సంపాదించి మోదీ జతన చేరి రాజ్యాన్ని, క్షమించాలి రాష్ట్రాన్ని, కొడుక్కు అప్పగించి ఢిల్లీకి మకాం మార్చాలనుకున్నారు. అందుకోసం తనకు రోజూ మందులు ఇచ్చే బంధువును రాజ్యసభ సభ్యుడిని చేశానని ఆయనే స్వయంగా చెప్పారు. ఎక్కడో మోదీతో స్నేహంలో తేడా వచ్చింది. తనతో సహా తన పార్టీకి చెందిన పలువురు ఎంఎల్‌ఏలకు ఆదాయపు పన్ను నోటీసులు రావడం మోదీతో సంబంధాలు చెడటమేనని అనుకుంటున్నారు. పనిగట్టుకుని నిజామాబాద్‌ నుంచి రైతులు వారణాసి వెళ్లి మోదీకి వ్యతిరేకంగా నామినేషన్‌లు వేసేందుకు ప్రయత్నించడం వెనక కేసీఆర్‌ ఉన్నాడని మోదీ అనుమానిస్తున్నారు. 

వెరసి చంద్రబాబు అంత కాకపోయినా కేసిఆర్‌కు కూడా మోదీతో స్నేహంలో తేడా వచ్చినట్టే కనిపిస్తున్నది. ఈలోగా చంద్రబాబు కేంద్రంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శిబిరంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చెయ్యడంతో తానూ వెనక పడిపోతాననే ఆందోళన కేసిఆర్‌ది. మోదీ వ్యతిరేక కాంగ్రెస్‌ అనుకూల శిబిరంలో చంద్రబాబునాయుడు ఉంటే తనకు ప్రవేశం కష్టం అని కేసీఆర్‌ భావన. పైగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమిలో తానూ చేరితే తెలంగాణాలో తన ప్రధాన శత్రువు కాంగ్రెస్‌ మళ్ళీ పుంజుకునే ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీలో ఏదో ఒక ప్రధాన పాత్ర లేకుంటే కొడుక్కు రాజ్యం అప్పగించి కాళ్ళు ఊపుకుంటూ కాలక్షేపం చెయ్యడం ఎలా అన్నది ఆయన ఆందోళన. అందుకే కుడి పక్కన బోయినపల్లి వినోద్‌ కుమార్, ఎడమ పక్కన జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ను వెంట పెట్టుకుని ఎక్కి దిగే రాజకీయ గడపలు అన్నట్టు తిరుగుతున్నారు .
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాల్సిందే, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చి గౌరవంగా చూడాల్సిందే. దాని కోసం ఫలితాలవరకూ వేచి ఉండాల్సిందే కదా, ఎవరికెన్ని స్థానాలు లభిస్తాయో చూడాలి కదా. ఇద్దరు చంద్రులు ఇంత ముందు నుంచే ఆందోళన చెందితే ప్రయోజనం ఏముంటుంది?

దేవులపల్లి అమర్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top