VD Satheesan
-
కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం
-
కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం
సాక్షి, తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణం చేశారు. సతీశన్‌తో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. డిప్యూటీ సీఎంలతో పాటు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు. సతీశన్ ప్రభుత్వంలో మంత్రులుగా 21 మంది ప్రమాణం చేశారు. వాళ్లలో సీఎం రేసులో భంగపడ్డ చెన్నితల్ రమేశ్ కూడా ఉన్నారు. కున్హల్కుట్టి, మురళీధరన్, షాజీ, అబ్దుల్ గఫర్, బషీర్, మోన్స్ జోసెఫ్.. ఇతరులు ఉన్నారు. అలాగే ఆయన కేబినెట్లో ఇద్దరు మహిళలకు చోటు లభించింది. తులసి, బిందు కృష్ణలు మంత్రులుగా ప్రమాణం చేశారు. -
కేరళంలో నేడు కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం
తిరువనంతపురం: కేరళలో దశాబ్దకాలంపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి నేడు నూతన ప్రభుత్వాన్ని కొలువు తీర్చనుంది. ఇందులోభాగంగా కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురంలోకి సెంట్రల్ స్టేడియంలో సతీశన్‌తోపాటు 20 మంది నేతలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశముండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే సీఎం సతీశన్ శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి మంత్రివర్గం జాబితాను అందజేశారు. నేడు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా హాజరు కానున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. తన మంత్రివర్గంలో సీనియర్ నేతలు రమేశ్ చెన్నితాల, కె. మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్, ఏపీ అనిల్ ఉంటారని కాబోయే సీఎం సతీశన్ చెప్పారు. దీంతో, సీఎం కుర్చీ కోసం పోటీ పడిన చెన్నితాల కేబినెట్లో చేరే అవకాశం లేదంటూ వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఈసారి కేబినెట్లోకి 14 మంది కొత్తముఖాలకు అవకాశం కల్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోస్టుకు మరో సీనియర్ నేత టి.రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినట్లు సతీశన్ చెప్పారు. ఐయూఎంఎల్ నేతలు పీకే కున్హలికుట్టి, ఎన్.షంషుద్దీన్, కేఎం షాజీ, పీకే భాస్కర్, వీఈ అబ్దుల్ గఫూర్, ఆర్ఎస్పీ నేత శిబూ బేబీ జాన్, కేరళ కాంగ్రెస్ నేత మోన్స్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్(జాకబ్) నేత అనూప్ జాకబ్లకూ కేబినెట్ బెర్త్ ఖారారైంది. సీఎంగా సతీశన్ బాధ్యతలు చేపట్టక మునుపే మంత్రి పదవులకు ఎంపిక, అధికార పంపిణీ, అధిష్టానం నిర్ణయాలపై అంతర్గత అసమ్మతి రగులుతోంది. సీఎంగా సతీశన్‌ను ఎంపిక చేయడం వెనుక కూటమి భాగస్వామ్య పక్షం ఐయూఎంఎల్ ఒతిళ్లున్నాయని నాయర్ సేమా సమాజం(ఎన్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి సుకుమారన్ ఆరోపించారు. కూటమిలో ఎస్ఎన్డీపీ ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మణి కప్పన్ సంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. కేబినెట్ కూర్పులో రొటేషన్ విధానాన్ని ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. -
2 రోజుల్లో సీఎంగా సతీశన్ ప్రమాణం.. వేణు గోపాల్ ఏమన్నారంటే?
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వీడీ సతీశన్ శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌ను కలిశారు. వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన సతీశన్ కాసేపు మాట్లాడారు.ఈ సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. “ఇందులో అసాధారణం ఏమీ లేదు. ఇది సాధారణ సమావేశమే. వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా దానికి కట్టుబడి ఉండాలి. ఎల్లుండి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వీడీ సతీశన్ నాయకత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కేరళ మొత్తం ఆశిస్తోంది. అభివృద్ధి, పాలనలో కేరళలో మార్పు అవసరం. అందుకే కేరళ ప్రజలు, దేశ ప్రజలు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు.మాది ప్రజాస్వామ్య పార్టీ.. బీజేపీ లేదా సీపీఐఎంలా కాదు. కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఐక్యంగా ఉండాలి. దేశానికే మా తొలి ప్రాధాన్యం. పార్టీకి రెండో ప్రాధాన్యం. దేశ సంక్షేమం కోసమే ముందుకు సాగుతాం” అని అన్నారు.కాగా, వీడీ సతీశన్ మే 18న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాట్లలో భాగంగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వీడీ సతీశన్ వెళ్లారని కూడా స్థానిక మీడియా పేర్కొంటోంది. కాంటోన్మెంట్ హౌస్‌లో లీగ్ నేతలతో కూడా చర్చలు జరిగాయి.కాగా, కేరళలో యూడీఎఫ్ గెలిచాక కేసీ వేణుగోపాల్ సీఎం అవుతారని చాలా మంది భావించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. వేణుగోపాల్‌కు హైకమాండ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రమేశ్ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్ బలమున్న నాయకులు. చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. వీడీ సతీశన్ కేరళలో మొన్నటివరకు ప్రతిపక్ష నాయకుడు. చివరకు ఆయననే సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీ వేణుగోపాల్ అసంతృప్తితో ఉన్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. कांग्रेस के संगठन महासचिव केसी वेणुगोपाल से केरल के मनोनीत मुख्यमंत्री वीडी सतीशन ने आज मुलाकात की pic.twitter.com/yBHDCsjulZ— News Capsule (@newscapsule_) May 16, 2026 -
చెల్లి మాటే నెగ్గింది.. కేరళలో చక్రం తిప్పిన ప్రియాంక
-
సతీశన్ సమర్థుడైన సీఎం అవుతారు: రాధాకృష్ణన్
కొట్టాయం: వీడీ సతీశన్ సమర్థుడైన నాయకుడని, ఆయన దూరదృష్టి, దృఢత్వంతో పాలించి మంచి ముఖ్యమంత్రి అవుతారని కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరువంచూర్ రాధాకృష్ణన్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మంత్రివర్గాన్ని కేంద్ర నాయకత్వం ఆమోదంతో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు చాలా అంచనాలున్నాయని, మంత్రవర్గాన్ని ఏర్పాటు చేసేవారు ఈ గుర్తుంచుకోవాలన్నారు. ఇతరులు చేస్తున్న వివిధ రకాల వ్యాఖ్యలకు ప్రభావితం కాకూడదని సూచించారు. ‘యూడీఎఫ్ ప్రభుత్వంపై ప్రజలకు భారీ ఆశలున్నాయి. అవి నెరవేర్చడానికి ఒక సమష్టి కృషి అవసరం. గత ప్రభుత్వ పనితీరే మళ్ళీ పునరావృతమైతే, ప్రజల అంచనాలు దెబ్బతింటాయి. అది మంచిది కాదు. ‘కొత్త కేరళ’ఆవిర్భవిస్తోందన్న భావన ప్రజలకు కలగాలి’అని అన్నారు. ఏ శాఖ విలువైనదని కాకుండా, మంత్రి తనకు అప్పగించిన శాఖను ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారన్న విషయానికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతి శాఖా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. కొత్త ప్రభుత్వంలో ఏ పాత్రను పోషించడానికి ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను వెళ్లనని, పార్టీ అప్పగించిన పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించనని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశానికి రమేశ్ చెన్నితాల గైర్హాజరీ, ముఖ్యమంత్రి పేరు ప్రకటన తరువాత ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మాట్లాడుతూ.. సతీశన్‌కు మద్దతు తెలుపుతూ చెన్నితాల ఒక లేఖ ఇచ్చారని, అలాగే ఆయనకు అభినందనలు కూడా తెలిపారని ఆయన చెప్పారు. -
ప్చ్ విజయన్.. ఎలా తట్టుకుంటారో?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామన్న పినరయి విజయన్ కల నెరవేరలేదు. ఘోర ఓటమితో.. కేరళంలో ఎల్డీఎఫ్ దశాబ్దకాల పాలన ముగిసింది. దీనికి తోడు అక్కడి రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని మలుపు ఒకటి చోటు చేసుకుంది.తాజా అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించింది. 140 స్థానాల్లో 102 సీట్లు గెలుచుకుంది ఈ కూటమి. ఇందులో కాంగ్రెస్ 63 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. తీవ్ర తర్జన భర్జనల తర్వాత వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. ఎల్డీఎఫ్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది. అందులో సీపీఎం 26, సీపీఐ 8, ఆర్జేడీ 1 సీటు గెలిచాయి. మరోవైపు బీజేపీ 3 సీట్లు సాధించి కేరళ చరిత్రలోనే మెరుగైన ఫలితం అందుకుంది.ఈ ఫలితాలతో.. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న పినరయి విజయన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారబోతున్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పినరయి విజయన్ను శాసనసభా పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అయితే ఈ విషయంలో పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఓటమికి విజయన్ నాయకత్వ శైలే కారణమని.. ప్రతిపక్ష నేతగా కొత్త ముఖాన్ని తీసుకురావాలని.. మారుతున్న రాజకీయాలను అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మిత్రపక్షం సీపీఐలోని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సీపీఎం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయన్నే ప్రతిపక్ష నేతగా నిర్ణయించింది.సీపీఎం చరిత్రలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతిపక్ష నేతగా మారడం కొత్త విషయం కాదు. ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, వీఎస్ అచ్యుతానందన్‌లు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పినరయి విజయన్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా విజయన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విజయం సాధించిన 61 ఏళ్ల వీడీ సతీశన్.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఇంతకాలం అసెంబ్లీలో ప్రత్యర్థిగా సతీశన్ దూకుడు చూపించేవారు. ఆ దూకుడే విజయన్ సర్కార్‌ను ఇరకాటంలో పడేసేది. కానీ ఇప్పుడు 82 ఏళ్ల వయసులో విజయన్‌కి అంత ఓపిక ఉందా? అనే సందేహం తలెత్తుతోంది. మరోవైపు.. ఈ పాత్రల మార్పు కేరళ అసెంబ్లీ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. అదే సమయంలో అక్కడి ప్రజలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓటమి తర్వాత కూడా పార్టీకి పెద్దదిక్కుగా మారిన పినరయి.. ప్రతిపక్షంలో తన శక్తిని ఎలా వినియోగిస్తారన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. -
కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై 10 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ నేత వి.డి.సతీశన్‌కు సీఎం పీఠం కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం గురువారం నిర్ణయించింది. ఇప్పటిదాకా జరిగిన చర్చల ఆధారంగా సతీశన్‌ను కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పి) నాయకుడిగా నియమించాలని నిర్ణయించినట్లు కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వెల్లడించారు. ఆమె గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, సీనియర్ నేత జైరామ్ రమేశ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7న తిరువనంతపురంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో.. రాష్ట్రంలో సీఎల్పికి కొత్త నాయకుడిని నియమించే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూర్తి అధికారం కట్టబెడుతూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సహా పార్టీ ఎంపీలు, నేతలతో ఖర్గే విస్తృతంగా సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. సీఎల్పీ నాయకుడిగా సతీశన్‌ను నియమిస్తూ తుది నిర్ణయం తీసుకున్నట్లు దీపాదాస్ మున్షీ స్పష్టంచేశారు. పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం కె.సి.వేణుగోపాల్, సతీశన్, రమేశ్ చెన్నితాల పోటీపడ్డారు. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, దాదాపు 10 రోజులపాటు ఢిల్లీలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు సతీశన్‌కే సీఎం పోస్టు అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఖర్గే, రాహుల్ గాంధీ 40 నిమిషాలపాటు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. గురువారం తుది నిర్ణయం వెలువడింది. నూతన కేరళను సృష్టిస్తాం: సతీశన్ తనను సీఎంగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు సతీశన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకు అతిపెద్ద బాధ్యత అప్పగించిందని అన్నారు. కేరళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేరళ ప్రజలు పదేళ్ల వామపక్ష పాలనను అంతం చేశారని, ఎన్నో ఆశలతో తమకు అధికారం అప్పగించారని పేర్కొన్నారు. నూతన కేరళను సృష్టించడానికి, నూతన యుగాన్ని ప్రారంభించడానికి అంకితభావంతో పని చేస్తామని వెల్లడించారు. గురువాయూర్కు రమేశ్ చెన్నితాల! కేరళ సీఎం పదవిని ఆశించిన సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల గురువారం అధిష్టానం నిర్ణయం తెలిసిన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. తిరువనంతపురంలోని తన ఇంటి నుంచి గురువాయూర్ శ్రీకృష్ణ మందిరానికి వెళ్లిపోయినట్లు సమాచారం.ఐయూఎంఎల్ ఒత్తిడి పెంచడం వల్లే.. కాంగ్రెస్ అధిష్టానం మద్దతు కె.సి.వేణుగోపాల్‌కు ఉన్నప్పటికీ సీఎంగా సతీశన్‌ను ఎంపిక చేయడం వెనుక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో ప్రధాన భాగస్వామి అయిన ఐయూఎంఎల్ అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లు గెల్చుకుంది. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీఎం పదవిని సతీశన్‌ను కట్టబెట్టాలని ఆ పార్టీ కాంగ్రెస్ పెద్దలపై గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సొంతంగా స్పష్టమైన మెజార్టీ లేని నేపథ్యంలో మిత్రపక్షమైన ఐయూఎంఎల్ ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. మరోవైపు మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కె.సి.వేణుగోపాల్‌కు అండగా నిలిచారు. కానీ, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు సతీశన్‌కే జైకొట్టారు. క్యాడర్‌పై బలమైన పట్టుండడం ఆయనకు అనుకూలంగా మారింది. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం సతీశన్‌ను సీఎంగా ఎంపిక చేయక తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం సతీశన్ సహా కాంగ్రెస్ నేతలు గురువారం కేరళ గవర్నర్ ఆర్.వి.ఆర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నెల 18న సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సతీశన్ ఆచరణాత్మక రాజకీయవేత్తవి.డి.సతీశన్.. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూనే, ప్రశాంతమైన శైలితో ప్రజలకు అందుబాటులో ఉండే నేత. కేరళ రాజకీయాల్లో దూకుడుగల ప్రతిపక్ష నేతగా ప్రతిష్టను పెంచుకున్నారు. 2021లో ఓటమి తర్వాత దశాబ్దకాలంగా పార్టీ పునరుజ్జీవనానికి కృషి చేశారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉద్భవించి, కేరళలోని అత్యంత బలమైన ప్రతిపక్ష నాయకులలో ఒకరిగా ఎదిగిన సతీశన్, తన రాజకీయ వ్యూహంతో ఆచరణాత్మక రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజాకర్షక నేతగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి సారించారు. పినరయి విజయన్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. క్రమశిక్షణ కలిగిన నేతగా పేరుతెచ్చుకున్న సతీశన్.. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేకపోయినప్పటికీ, మీడియా వ్యవహారాలలో నేర్పరి. ఆయన శైలి.. వర్గపోరాటాలతో సతమతమవుతున్న పార్టీలో కొందరు సీనియర్ నాయకులను కలవరపెట్టింది. యువతను కాంగ్రెస్ వైపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. దిగ్గజ నాయకులైన కె. కరుణాకరన్, ఎ.కె.ఆంటోనీ, ఊమెన్ చాందీల తర్వాత కాంగ్రెస్‌లో ప్రజలను ఆకర్షించే నాయకుడిగా ఎదిగారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని అధికారంలోకి తీసుకురాలేకపోతే రాజకీయ అజ్ఞాత వాసం చేస్తానని సంచలనాత్మక ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు, యూడీఎఫ్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక ధైర్యమైన ప్రకటన. సతీశన్ క్షేత్రస్థాయి విధానం, స్థానిక సమస్యలపై నిరంతర దృష్టి, పార్టీ వ్యవస్థను, ఓటర్ల విశ్వాసాన్ని పునరి్నరి్మంచడంలో తోడ్పడ్డాయి. కాంగ్రెస్‌లో ఏఐసీసీ కార్యదర్శి, కేపీసీసీ ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులలో పనిచేశారు. సాధారణ కుటుంబం నుంచి1964 మే 31న ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కె.దామోదర మీనన్, తల్లి వి.విలాసిని అమ్మ. ఎర్నాకులంలోని సేక్రెడ్ హార్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ వర్క్ మాస్టర్స్ చదివారు. రాజకీయంలోకి రాకముందు ఆయన కేరళ హైకోర్టులో దాదాపు పదేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన భార్య ఆర్.లక్ష్మీప్రియ. వారికి ఉన్నిమాయ అనే ఒక కుమార్తె ఉంది. సతీశన్ రాజకీయ ప్రస్థానం విద్యారి్థగానే మొదలైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన కేఎస్‌యూ (కేరళ స్టూడెంట్స్ యూనియన్) ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జాతీయ కార్యదర్శిగానూ పనిచేశారు. ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం1996లో మొదటిసారి పరవూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2001 ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కేరళలో లెఫ్ట్ వేవ్ ఉన్నప్పుడూ తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, రమేష్ చెన్నితల స్థానంలో హైకమాండ్ సతీశన్‌ను అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నియమించింది. అసెంబ్లీలో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత దూకుడును అవలంబించారు. అసెంబ్లీలో ఏదైనా మాట్లాడేప్పుడూ పూర్తి సమాచారం, పక్కా ఆధారాలతో మాట్లాడి బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో, యూడీఎఫ్ ఉప ఎన్నికల విజయాలతో పాటు లోక్‌సభ ఎన్నికలలో బలమైన ప్రదర్శనతో ఇచ్చింది. పార్టీలోపల, బయటా వివాద రహిత నాయకుడిగా క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళ కిరీటం సతీశన్‌కు...
పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత కేరళ ప్రజలు మెచ్చి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటానికి కాంగ్రెస్ పదిరోజుల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఎట్టకేలకు వడస్సేరి దామోదరన్ సతీశన్‌కు ఆ పదవి కట్టబెట్టాలని గురు వారం నిర్ణయించింది. ఈ కాంగ్రెస్ మార్కు కథ అన్నిచోట్లా ఉండేదే. కాకపోతే ఆ పార్టీకి మెజారిటీ లభించే రాష్ట్రాలు కుంచించుకుపోతుండటంవల్ల ఇటీవలి కాలంలో ఆ సంగతి ఎవరికీ పెద్దగా తెలియకుండాపోయింది. కేరళలో సతీశన్‌తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. వారి మధ్య తీవ్ర పోటీ ఉంది. అంతేకాదు... కేరళలో వారి ఇళ్ల దగ్గర గత పది రోజులుగా సాగుతున్న హడావుడికి అంతూ పొంతూ లేదు. ఏ క్షణంలోనైనా తమ నాయకుణ్ణి అధిష్టానం ఎంపిక చేస్తుందని ఆ నాయకుల్ని సమర్థిస్తున్న పార్టీ కార్య కర్తలు రాత్రింబగళ్లు ఆశగా ఎదురుచూశారు. బెదిరింపులు, ఆగ్రహ ప్రకటనలు సరేసరి. అందుకే ఎంపికలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని చెప్పడం, శాసనసభాపక్షం తీర్మానం ఆమోదించటం రివాజు. అయితే మెజారిటీ సభ్యుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న మెలిక ఎప్పుడూ ఉంటుంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63 స్థానాలు లభించగా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమికి మొత్తంగా 102 వచ్చాయి. ఇలా భారీ స్థాయిలో జనం ఆమోదముద్ర ఉన్నా, కూటమి పక్షాలు ఆ అంశాన్ని త్వరగా పూర్తిచేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా పార్టీ అధిష్టానం అడుగు ముందుకేయలేక పోయిందంటే సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏఐసీసీ నాయకుడిగా తనకున్న పలుకుబడితో అధికశాతం మందికి కేసీ వేణుగోపాల్ టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు విడివిడిగా భేటీ అయినప్పుడు 47 మంది ఆయన వైపే మొగ్గారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంతమంది ఆయన వెనకుండటం చిన్న విషయం కాదు. అయితే మిత్ర పక్షాలు, ముఖ్యంగా ఐయూఎంఎల్ మరో నాయకుడు వీడీ సతీశన్‌కు ఇవ్వాలని సూచించాయి. మొన్నటివరకూ విపక్ష నేతగా ఉండటంవల్ల ఆ పార్టీలతో ఏర్పడిన సాన్నిహిత్యం సతీశన్‌కు పనికొచ్చినట్టుంది. రమేష్ చెన్నితలకు మద్దతు పలికినవారి సంఖ్య స్వల్పం. ఎన్నికలొస్తే ఓటమిపాలవుతామన్న బెరుకుకన్నా, గెలిస్తే ఎవరిని ఎలా ఒప్పించా లన్న చింత పార్టీ అధినాయకత్వానికి అధికం. ఇందుకు తనను తానే నిందించుకోవాలి. రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషిచేస్తూ, ప్రజానీకంలో పట్టు సాధించిన వారంటే నాయకత్వానికి భయం. అందుకే వారికి సమాంతరంగా మరొకరిని ప్రోత్సహించటం అలవాటు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల ముఠా కక్షలు ముదిరి పార్టీ చీలికదాకా పోయింది. కాంగ్రెస్‌లో ఎప్పటికీ తనకు భవిష్యత్తు ఉండబోదన్న నిర్వేదంతో ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిజానికి కేరళ విషయంలో జరిగినంత జాప్యం గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి చోట్ల లేదు. ఆ రాష్ట్రాల్లో కూడా సీఎం కుర్చీ కోసం నాయకులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు బయటికొచ్చాయి. అయితే పార్టీలోని యువతరం ఎక్కువగా సతీశన్వైపే మొగ్గింది. కొందరు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించిన నేతలపై చర్య తీసుకోవటంలో సతీశన్ వెనకాడకపోవటం, ఫలానా కులంవారూ, మతంవారూ దూరమవుతారని ఎందరుచెప్పినా వినకపోవడం యువతను ఆకర్షించింది. మంత్రిగా అనుభవం లేకున్నా నిజాయితీ, మంచి చదువరి కావటం, మేధోపరమైన అంశాలు చర్చించటంవంటివి సతీశన్కున్న అదనపు అర్హతలు. యూడీఎఫ్‌కు వందకుమించి స్థానాలు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాలు కూటమికి ఉత్సాహాన్నిచ్చింది. కాంగ్రెస్‌లో నాయకత్వం దక్కితే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవటానికి భిన్న వర్గాలను ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆకాంక్షలు తీర్చాలి. ఆ విషయంలో సతీశన్ ఏ మేరకు విజయం సాధిస్తారన్నది మున్ముందు తెలుస్తుంది. -
కేరళం సీఎంగా సతీశనే ఎందుకు?
పది రోజుల సస్పెన్స్‌కు తెర దించుతూ కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. తమకు ఎంతో దగ్గరైన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను పక్కనపెట్టి మరీ లాయర్ నుంచి లీడర్‌గా ఎదిగిన సతీశన్‌కు ఆ అవకాశం ఇవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. ఈ ఎంపికను గమనిస్తే అనేక రాజకీయ గణాంకాలు కనిపిస్తున్నాయి. కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక కావడం ఒక సాధారణ నిర్ణయం కాదు. ప్రధానంగా.. ప్రజా మద్దతు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు, కేఐఐఎఫ్బీ ఫండింగ్ వివాదం, ఇతర కుంభకోణాల ఆధారంగా విజయన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఈ పోరాటం వల్ల ఆయనకు ‘క్లీన్ లీడర్’ గా ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది.మిత్రపక్షాల బలం.. కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రెస్‌లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అయితే మరో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలతో పోలిస్తే వీడీ సతీశన్‌కు పార్టీలో మద్దతుదారుల సంఖ్యా బలం తక్కువే. అయినపపటికీ మిత్రపక్షాలు ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వచ్చాయి. కేరళలో ముస్లిం లీగ్, ఇతర చిన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ స్థిరమైన ప్రభుత్వం సాధ్యం కాదు. కాబట్టి మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్న సతీశన్‌ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా అధిష్టానం భావించింది.మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో ‘‘నేను సీఎం పోస్ట్ కోసం లేను.. పార్టీ కోసమే ఉన్నా అని ప్రకటించడం’’ కేసీ వేణుగోపాల్‌కు పెద్ద మైనస్ అయ్యింది. ఇది వీడీ సతీశన్‌కు మిత్రపక్షాల్లో, కేడర్‌లో మరింత సింపథీ తెచ్చి పెట్టింది. కేసీ అనుకూల వర్గం ఆయన పేరిట పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. ఓన్లీ వీడీ అంటూ పార్టీ కేడర్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. సమర్థుడనే ట్యాగ్ లైన్.. 2001 నుంచి పరవూర్ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారాయన. 2021 నుంచి 2026 మధ్య ప్రతిపక్ష నేతగా పని చేశారు. కేరళంలో యూడీఎఫ్ విక్టరీలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. పైగా ఆయనకు ఉన్న న్యాయవాది నేపథ్యం, కిందస్థాయి నుంచి ఎదిగిన వైనం, అదనంగా సామాజిక సేవా దృక్ఫథం, .. ప్రజలు మాత్రమే కాదు పార్టీ కేడర్ ప్రజలు ఆయన్ని సమర్థుడైన నాయకుడిగా భావించడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కిందిస్థాయి వాళ్లకూ కాంగ్రెస్‌లో సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని సింబాలిక్‌గా చెప్పడానికి ఓ అవకాశం దొరికింది. వీడీ సతీశన్‌కు పాలనలో ప్రత్యక్ష అనుభవం లేకపోవచ్చు. కానీ, ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం అసామాన్యమైనది. మిత్రపక్షాల మద్దతు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత.. అన్నీ కలిపి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచి ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టగలిగాయి.


