కేరళం సీఎంగా సతీశనే ఎందుకు? | Reasons Behind AICC Choose VD Sateeshan For Kerala CM | Sakshi
Sakshi News home page

కేరళం సీఎంగా సతీశనే ఎందుకు?

May 14 2026 1:46 PM | Updated on May 14 2026 2:11 PM

Reasons Behind AICC Choose VD Sateeshan For Kerala CM

పది రోజుల సస్పెన్స్‌కు తెర దించుతూ కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ పేరును ప్రకటించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. తమకు ఎంతో దగ్గరైన సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ను పక్కనపెట్టి మరీ లాయర్‌ నుంచి లీడర్‌గా ఎదిగిన సతీశన్‌కు ఆ అవకాశం ఇవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. ఈ ఎంపికను గమనిస్తే అనేక రాజకీయ గణాంకాలు కనిపిస్తున్నాయి. 

కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్‌ ఎంపిక కావడం ఒక సాధారణ నిర్ణయం కాదు. ప్రధానంగా.. ప్రజా మద్దతు కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేశారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు, కేఐఐఎఫ్‌బీ ఫండింగ్‌ వివాదం, ఇతర కుంభకోణాల ఆధారంగా విజయన్‌ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఈ పోరాటం వల్ల ఆయనకు ‘క్లీన్‌ లీడర్‌’ గా ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది.

మిత్రపక్షాల బలం.. కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రెస్‌లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అయితే మరో కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితాలతో పోలిస్తే వీడీ సతీశన్‌కు పార్టీలో మద్దతుదారుల సంఖ్యా బలం తక్కువే. అయినపపటికీ మిత్రపక్షాలు ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వచ్చాయి. కేరళలో ముస్లిం లీగ్‌, ఇతర చిన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్‌ స్థిరమైన ప్రభుత్వం సాధ్యం కాదు. కాబట్టి మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్న సతీశన్‌ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా అధిష్టానం భావించింది.

మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో ‘‘నేను సీఎం పోస్ట్‌ కోసం లేను.. పార్టీ కోసమే ఉన్నా అని ప్రకటించడం’’  కేసీ వేణుగోపాల్‌కు పెద్ద మైనస్‌ అయ్యింది. ఇది వీడీ సతీశన్‌కు మిత్రపక్షాల్లో, కేడర్‌లో మరింత సింపథీ తెచ్చి పెట్టింది. కేసీ అనుకూల వర్గం ఆయన పేరిట పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. ఓన్లీ వీడీ అంటూ పార్టీ కేడర్‌తో పాటు సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.  

సమర్థుడనే ట్యాగ్‌ లైన్‌.. 
2001 నుంచి పరవూర్‌ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారాయన. 2021 నుంచి 2026 మధ్య ప్రతిపక్ష నేతగా పని చేశారు. కేరళంలో యూడీఎఫ్‌ విక్టరీలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. పైగా ఆయనకు ఉన్న న్యాయవాది నేపథ్యం, కిందస్థాయి నుంచి ఎదిగిన వైనం, అదనంగా సామాజిక సేవా దృక్ఫథం, .. ప్రజలు మాత్రమే కాదు పార్టీ కేడర్‌ ప్రజలు ఆయన్ని సమర్థుడైన నాయకుడిగా భావించడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్‌ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కిందిస్థాయి వాళ్లకూ కాంగ్రెస్‌లో సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని సింబాలిక్‌గా చెప్పడానికి ఓ అవకాశం దొరికింది. 

వీడీ సతీశన్‌కు పాలనలో ప్రత్యక్ష అనుభవం లేకపోవచ్చు. కానీ, ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం అసామాన్యమైనది. మిత్రపక్షాల మద్దతు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత.. అన్నీ కలిపి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచి ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టగలిగాయి. 

Advertisement
 
Advertisement
Advertisement