కేరళంలో నేడు కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం | UDF finalises Kerala cabinet ahead of VD Satheesan swearing in | Sakshi
Sakshi News home page

కేరళంలో నేడు కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం

May 18 2026 5:01 AM | Updated on May 18 2026 7:04 AM

UDF finalises Kerala cabinet ahead of VD Satheesan swearing in

తిరువనంతపురం: కేరళలో దశాబ్దకాలంపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ కూటమి నేడు నూతన ప్రభుత్వాన్ని కొలువు తీర్చనుంది. ఇందులోభాగంగా కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురంలోకి సెంట్రల్‌ స్టేడియంలో సతీశన్‌తోపాటు 20 మంది నేతలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నేతలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశముండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే సీఎం సతీశన్‌ శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసి మంత్రివర్గం జాబితాను అందజేశారు. నేడు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రా హాజరు కానున్నారు. 

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. తమిళనాడు సీఎం విజయ్‌ జోసెఫ్‌ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. తన మంత్రివర్గంలో సీనియర్‌ నేతలు రమేశ్‌ చెన్నితాల, కె. మురళీధరన్, కేపీసీసీ చీఫ్‌ సన్నీ జోసెఫ్, ఏపీ అనిల్‌ ఉంటారని కాబోయే సీఎం సతీశన్‌ చెప్పారు. 

దీంతో, సీఎం కుర్చీ కోసం పోటీ పడిన చెన్నితాల కేబినెట్‌లో చేరే అవకాశం లేదంటూ  వచ్చిన వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈసారి కేబినెట్‌లోకి 14 మంది కొత్తముఖాలకు అవకాశం కల్పించనున్నారు.  అసెంబ్లీ స్పీకర్‌ పోస్టుకు మరో సీనియర్‌ నేత టి.రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినట్లు సతీశన్‌ చెప్పారు. ఐయూఎంఎల్‌ నేతలు పీకే కున్హలికుట్టి, ఎన్‌.షంషుద్దీన్, కేఎం షాజీ, పీకే భాస్కర్, వీఈ అబ్దుల్‌ గఫూర్, ఆర్‌ఎస్‌పీ నేత శిబూ బేబీ జాన్, కేరళ కాంగ్రెస్‌ నేత మోన్స్‌ జోసెఫ్, కేరళ కాంగ్రెస్‌(జాకబ్‌) నేత అనూప్‌ జాకబ్‌లకూ కేబినెట్‌ బెర్త్‌ ఖారారైంది.

 సీఎంగా సతీశన్‌ బాధ్యతలు చేపట్టక మునుపే మంత్రి పదవులకు ఎంపిక, అధికార పంపిణీ, అధిష్టానం నిర్ణయాలపై అంతర్గత అసమ్మతి రగులుతోంది. సీఎంగా సతీశన్‌ను ఎంపిక చేయడం వెనుక కూటమి భాగస్వామ్య పక్షం ఐయూఎంఎల్‌ ఒతిళ్లున్నాయని నాయర్‌ సేమా సమాజం(ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ ఆరోపించారు. కూటమిలో ఎస్‌ఎన్‌డీపీ ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మణి కప్పన్‌ సంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. కేబినెట్‌ కూర్పులో రొటేషన్‌ విధానాన్ని ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement