Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India Slams Chinese State Media Over Op Sindoor1
అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులు హతమయ్యారు.

CM Revanth says Holidays cancelled for emergency services employees2
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్‌ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రజల కోసం 24/7 టోల్‌ ఫ్రీ నంబర్‌ ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్‌ క్రాస్‌తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్‌ న్యూస్‌ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్‌ న్యూస్‌ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్‌ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి హైదరాబాద్‌లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్‌ డ్రిల్‌ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..? ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్‌రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్‌ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.సైన్యానికి సెల్యూట్‌: సీఎం రేవంత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్‌..’అని సీఎం తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్టు చేశారు. నేడు సంఘీభావ ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

Operation Sindoor: India struck multiple targets in Pakistan and pok3
Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'

అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్‌ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్‌’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్‌ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజర్‌ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్‌ నిర్వహించాయి. ఎయిర్‌ టు ఎయిర్‌ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్‌ క్రూయిజ్‌ క్షిపణులు, హామర్‌ ప్రెసిషన్‌ బాంబులు, గైడెడ్‌ బాంబ్‌ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా నాలుగు స్వయానా పాక్‌ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్‌ దాడుల మాదిరిగా పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్‌ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి. అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్‌ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది. ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్‌ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్‌’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్‌ అజర్‌ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్‌ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్‌ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు. భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్‌ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్‌ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్‌ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.అద్భుత నైపుణ్యం దాడులపై నిపుణులు సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్‌ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్‌ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది. 25 నిమిషాలు.. 9 లక్ష్యాలుదాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్‌ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

Sakshi Editorial On India Actions On Pak Terrorism Operation Sindoor4
అదనుచూసి పదునైన పాఠం!

తీరికూర్చుని భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో జగడాలమారి పాకిస్తాన్‌కూ, దాని కీలుబొమ్మలైన ఉగ్రమూకలకూ తెలిసొచ్చి ఉండాలి. 2016 నాటి ‘ఉరి’ సర్జికల్‌ దాడులు, 2019 నాటి బాలాకోట్‌ వైమానిక దాడులకు అనేక రెట్లు అధికంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సంకేతనామంతో మన త్రివిధ దళాలు పకడ్బందీ సమన్వయంతో పాకిస్తాన్‌లోనూ, ఆక్రమిత కశ్మీర్‌ లోనూ తొమ్మిది చోట్ల గంటసేపు సాగించిన క్షిపణి దాడులు పాక్‌ సైన్యాన్నీ, ఉగ్రమూకల్నీ గుక్క తిప్పుకోనీయకుండా చేశాయి. ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలూ, వారి ఆయుధ గిడ్డంగులూ, ఇతరేతర అవసరాలకు వినియోగిస్తున్న బహుళ అంతస్తుల భవంతులూ లక్ష్యంగా మొత్తం 24 చోట్ల సాగించిన దాడుల్లో 70 మంది వరకూ ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారని చెబు తున్నారు. ఉగ్రవాద ముఠాలైన జైషే మొహమ్మద్‌ (జేఈఎం), లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ప్రధాన కార్యాలయాలు రెండూ కుప్పకూలాయని సమాచారం. జేఈఎం చీఫ్‌ మసూర్‌ అజర్‌ సోదరితోసహా అతగాడి కుటుంబానికి చెందిన పదిమంది హతమయ్యారని కూడా చెబుతున్నారు. జరిగిన నష్టాన్ని కప్పెట్టే ఎత్తుగడతో అయిదు భారత్‌ విమానాలను కూల్చామంటూ పాక్‌ స్వోత్కర్షలకు పోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పాక్‌ లోలోపలివరకూ చొచ్చుకెళ్లి దాడులు సాగించిన తీరూ, ఒక్క క్షిపణి కూడా గురితప్పకుండా శత్రుమూకలపై చండ్రనిప్పులు కురిపించిన విధానం మన త్రివిధ దళాల పకడ్బందీ అంచనాలకూ, పదునైన వ్యూహచతురతకూ దర్పణాలు. పాక్‌ గడ్డపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఉగ్రశిబిరాల ఆనుపానుల్ని శత్రునేత్రానికి చిక్కని విధంగా గత పక్షం రోజులుగా మానవ రహిత విమానాలతో జల్లెడపట్టాకే ఈ దాడులు జరిగాయి. పహల్‌గామ్‌ సమీపంలో అకారణంగా, అన్యాయంగా నిరాయుధ భారత పౌరులను గురిచూసి కాల్చిచంపటానికి కిరాయిమూకల్ని పంపి కొన్నిరోజులుగా పాకిస్తాన్‌ మురుస్తోంది. దీనిపై నిలదీస్తే షరా మామూ లుగా సాక్ష్యాలడుగుతోంది. గత నెల 22న పహల్‌గామ్‌ సమీపంలో ఉగ్రవాద ముఠా 26 మందిని పొట్టనబెట్టుకున్నప్పటి నుంచీ భారత ప్రజ ప్రతీకారంతో రగిలిపోతోంది. కంటికి కన్ను సిద్ధాంతం పాటించి గట్టి దెబ్బతీయాల్సిందేనన్న అభిప్రాయం అలుముకుంది. ఈ నేపథ్యంలో మన దళాల దాడులు విజయవంతం కావటం అందరినీ సాంత్వన పరుస్తుందనటంలో సందేహం లేదు.అనుకోని పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన పద్ధతులపై పౌరులకు అవగాహన కల్పించటానికి బుధవారం మాక్‌ డ్రిల్‌ జరగటం, అంతకుముందు రోజు రాత్రే మన త్రివిధ దళాలు దాడులు చేయటం గమనిస్తే వర్తమానం ఎంత జటిలంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇది మనం కోరుకున్నది కాదు. మన ప్రమేయం లేకుండా వచ్చిపడిన విపత్తు. అకారణంగా మనపై రుద్దిన సంక్లిష్ట సమస్య. దీనికి దీటుగా స్పందించకపోతే ఉగ్రదాడులకు అంతూ పొంతూ ఉండదు. కనుకనే పహల్‌గామ్‌ మారణకాండ గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనను రద్దుచేసుకుని వెను దిరిగారు. ఆ వెంటనే మంత్రివర్గ సహచరులతో, త్రివిధ దళాల అధిపతులతో వరస సమాలోచనలు సాగించారు. ఎప్పుడు, ఎక్కడ ఎలా దాడులు సాగించాలో, తీవ్రత ఏ స్థాయిలో వుండాలో మీరే నిర్ణ యించండంటూ మన దళాలకు అధికారం ఇచ్చారు. పర్యవసానంగానే పాక్‌ ప్రాపకంతో చెలరేగి పోతున్న ఉగ్రముఠాలకు గట్టి సమాధానం వెళ్లింది. ఈ దాడులకు చాలాముందే ఇతరేతర నిర్ణ యాలు తీసుకున్నారు. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించ టంతోపాటు ఇండియా పలు చర్యలు తీసుకుంది. దీన్నంతటినీ గమనిస్తున్నవారికి మన దేశం సైనిక చర్యకు కూడా వెనకాడబోదని పక్షం రోజుల క్రితమే అర్థమైంది. యుద్ధం దేనికీ పరిష్కారం కాకపోవచ్చు. చర్చలే అంతిమంగా ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తాయన్న సిద్ధాంతం కూడా సరైనదే కావొచ్చు. కానీ పొరుగు పచ్చగావుంటే ఓర్వలేక నిష్కారణంగా దాడులకు దిగే నైజాన్ని శాంతిప్రవచనాలతో ఎదుర్కొనటం సాధ్యమేనా? ఒకపక్క పహల్‌గామ్‌ దాడులతో సంబంధం లేదంటూనే గత కొన్ని రోజులుగా అధీనరేఖ వద్దా, అంత ర్జాతీయ సరిహద్దు వద్దా పాక్‌ ఎలాంటి కవ్వింపూ లేకుండా కాల్పులకు దిగుతోంది. ఈ దాడుల కారణంగా ఒక్క బుధవారంనాడే పూంఛ్‌ జిల్లా గ్రామాల్లో 12 మంది పౌరులు బలయ్యారు. తన దుష్ట పన్నాగాలను కప్పిపుచ్చటానికి భద్రతామండలిలో పాకిస్తాన్‌ అమాయకత్వం నటిస్తూ భారత్‌ తీసు కుంటున్న వరస చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని విఫలయత్నం చేసింది. రేపో మాపో అది నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ప్రతీకారం పేరిట చెలరేగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉగ్రముఠాల ద్వారా మారణహోమానికి పాల్పడటం కన్నా ఒకరకంగా ఇది మంచిదే. భారత్‌ బెదిరిపోయి సైనిక దాడుల ఆలోచన మానుకుంటుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని రోజులుగా అది అణుబాంబు బెదిరింపులకు కూడా తెగించింది. ఆ దుస్సాహసానికి పూనుకుంటే చేజేతులా స్వీయవినాశనాన్ని కొనితెచ్చుకున్నానని పాక్‌ పశ్చాత్తాపపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఈ కష్టకాలంలో దేశ ప్రజానీకం కుల మత భేదాలు మరిచి కలిసికట్టుగా ఉండటం అత్య వసరం. ఇదే అదనుగా నాలుగు ఓట్ల కోసమో, మరికొన్ని సీట్ల కోసమో ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూసే అవాంఛనీయ శక్తుల్ని అందరూ సకాలంలో పోల్చుకుని దూరం పెట్టడం, తగిన బుద్ధి చెప్పటం ఎంతో అవసరం. మనలోని సమష్టితత్వమే ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్ని స్తుంది. విజయాన్ని మన చేతికందిస్తుంది.

Sakshi Guest Column On Operation Sindoor5
గతానికి భిన్నంగా...

ఏప్రిల్‌ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్‌గామ్‌ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్‌ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్‌లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌ కేంద్ర బిందువైన పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్‌పూర్‌లో జైష్‌–ఎ–మొహమ్మద్‌ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్‌కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్‌లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్‌ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్‌ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్‌ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్‌ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్‌ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్‌ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్‌ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్‌ తలసరి జీడీపీ భారత్‌ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్‌ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్‌ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్‌ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్‌’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్‌ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్‌ఎఫ్‌ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్‌ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్‌ అసీమ్‌ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్‌ శంకరన్‌ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్‌’ ఒపీనియన్స్‌–ఫీచర్స్‌ ఎడిటర్‌

GLEX 2025: Indian astronauts footprints will be on Moon6
2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర 

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ముందంజలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. 2040 నాటికి చందమామపై మన వ్యోమగాములు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. అంగారక(మార్స్‌), శుక్ర(వీనస్‌) గ్రహాలపైనా ప్రయోగాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్‌ స్పేస్‌ ఎక్ప్‌ప్లోరేషన్‌ కాన్ఫరెన్స్‌(గ్లెక్స్‌–2025) సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. అంతరిక్ష ప్రయోగ ప్రణాళికలు వివరించారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర ఉంటుందని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లలో భారతీయ వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టడం తథ్యమని స్పష్టంచేశారు. మన అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీకి సంబంధించింది కాదని, అందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే అసలు లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం మానవాళికి లబ్ధి చేకూరేలా అంతరిక్ష ప్రయోగాల్లో తమ ఉమ్మడి లక్ష్యాన్ని అందరితో పంచుకుంటామని వ్యాఖ్యానించారు. జీ20 ఉపగ్రహం ప్రయోగిస్తాం దక్షిణాసియా దేశాల కోసం ఒక శాటిలైట్‌ ప్రయోగించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు బహుమతిగా జీ20 ఉపగ్రహం ప్రయోగించబోతున్నామని చెప్పారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు మన దేశ ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని అన్నారు. మన తొలి మానవసహిత స్పేస్‌–ఫ్లైట్‌ను త్వరలో అంతరిక్షంలోకి పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రో–నాసా ఉమ్మడి మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి మరికొన్ని వారాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) చేరుకోబోతున్నాడని వివరించారు. అంతరిక్షం అంటే కేవలం ఒక గమ్యం కాదని.. ఉత్సకత, ధైర్యం, సమీకృత ప్రగతికి ఒక ప్రతీక అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం ఆ దిశగానే సాగుతోందని చెప్పారు. 1963లో ఒక చిన్న రాకెట్‌ ప్రయోగంతో మన అంతరిక్ష యాత్ర ఆరంభమైందని గుర్తుచేశారు. అనంతరం ఈ రంగంలో ఎంతగానో పురోగమించామని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్‌ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. మన ప్రయాణం చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. మన రాకెట్లు పేలోడ్స్‌ కంటే అధికంగా 140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకెళ్తుంటాయని వివరించారు. తొలి ప్రయత్నంలోనే మార్స్‌ వద్దకు చేరుకున్న దేశంగా ఇండియా చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రయాన్‌ ప్రయోగాలతో చంద్రుడిపై నీటి జాడ కనిపెట్టామని, అత్యంత నాణ్యమైన చంద్రుడి ఫొటోలు చిత్రీకరించామని, అక్కడి దక్షిణ ధ్రువం గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని వెల్లడించారు. రికార్డు సమయంలో క్రయోజెనిక్‌ ఇంజన్లు తయారు చేశామని, ఒకేసారి 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించామని గుర్తుచేశారు. 34 దేశాలకు చెందిన 400కుపైగా శాటిలైట్లను మన అంతరిక్ష నౌకల ద్వారా ప్రయోగించామని అన్నారు. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించామని, ఇదొక గొప్ప ముందడుగు అని తెలియజేశారు.

India set to save Rs 1. 8 lakh crore on oil imports after global price dip7
చమురుపై రూ.1.8 లక్షల కోట్లు ఆదా 

న్యూఢిల్లీ: చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరిన క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వీటి దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతుండడం తెలిసిందే. వీటి దిగుమతుల కోసం భారత్‌ 2024–25లో 242.4 బిలియన్‌ డాలర్లను (రూ.20.60 లక్షల కోట్లు) వెచ్చించినట్టు ఇక్రా నివేదిక తెలిపింది. ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం 15.2 బిలియన్‌ డాలర్లు (రూ.1.29 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఈ వారంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 60.23 డాలర్ల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. 2021 ఫిబ్రవరి తర్వాత కనిష్ట స్థాయికి చమురు ధరలు చేరుకుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. 2024 మార్చితో పోల్చి చూసుకున్నా బ్యారెల్‌ ముడి చమురు ధర 20 డాలర్లు తక్కువగా ఉంది. నాడు పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.2 చొప్పున తగ్గించడం తెలిసిందే. 2025–26 సంవత్సరంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 60–70 డాలర్ల మధ్య ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ ధరల ప్రకారం అప్‌స్ట్రీమ్‌ ఆయిల్‌ కంపెనీలకు (ముడి చమురు ఉత్పత్తి సంస్థలు) రూ.25,000 కోట్ల మేర పన్నుకు ముందు లాభం సమకూరుతుందని అంచనా వేసింది. ఇక ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై రూ.6,000 కోట్లు, ముడి చమురు దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల చొప్పున మిగులుతుందని పేర్కొంది. ఆయిల్‌ మార్కెటింగ్‌ (రిటైల్‌) సంస్థలకు మార్జిన్లు మెరుగ్గా ఉంటాయని.. ఎల్‌పీజీపై నష్టాలు తగ్గుతాయని వెల్లడించింది.

Defence Minister Rajnath SIngh Hails Operation Sindoor8
‘అమాయకుల ప్రాణాలు తీసిన వారిని మట్టుబెట్టాం’

న్యూఢిల్లీ: అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఆపరేషన్ సిందూర్‌తో మట్టుబెట్టామని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామన్నారు. ఈ రోజు(బుధవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ‘రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. భారత సైనం తన సత్తాను చాటింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. పహల్గామ్ లో అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదు.. ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీశాం. ఆపరేషన్ సిందూర్‌తో రికార్డు సృష్టించాం. పాక్ పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్‌ లోని జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది..

Pak PM Shehbaz Sharif  In Action Army Chief No Action9
పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్‌ కెప్టెన్‌’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్‌ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్‌ మాజీ సైనాకాధికారి ముషారఫ్‌.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.

The style of Miss World competitions has completely changed10
స్కిన్ షో నుంచి స్కిల్‌ షోగా..

బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ (ఓ ప్రయోజనంతో కూడిన సౌందర్యం).. హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి నిర్వాహకులు పదేపదే చెబుతున్న మాట. ఎక్కడా అందాల పోటీలు అనే మాటే లేదు. 1951లో యూకేలో ఎరిక్‌ మోర్లే మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభించినప్పుడు కేవలం శరీర సౌందర్యాన్ని ప్రదర్శించటానికే అవి పరిమితమయ్యాయి. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలపాటు అదే పంథా కొనసాగగా, ఇప్పుడు పోటీల తీరు సమూలంగా మారిపోయింది. పోటీదారులను అన్నివిధాలా పరిశీలించే, పరీక్షించే విధానం వచ్చింది.ఇక సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే మన దేశంలో పోటీలనేసరికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది ముంబైలో నిర్వహించినప్పుడు ‘ఒళ్లు’దగ్గర పెట్టుకుని వ్యవహరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం. ‘అందమే’ప్రదాన అంశంగా ఉన్నా.. అది అంతర్లీనంగా మాత్రమే ఉండేలా చూస్తున్నారు. సామాజిక బాధ్యత, మహిళా సాధికారత, వ్యక్తిగత ప్రతిభలే ప్రధాన అంశాలుగా పోటీలకు రూపకల్పన చేశారు. -సాక్షి, హైదరాబాద్‌ఇప్పుడు ప్రతిభకే పట్టం..బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యం ముఖ్యం అనే అంశం జనంలోకి వెళ్లేలా ఇప్పుడు కార్యక్రమాలను డిజైన్‌ చేశారు. పోటీదారులు సృజనాత్మక, కళాత్మక నైపుణ్యాలను, సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ప్రధాన రౌండ్‌ను రూపొందించారు. టాలెంట్‌ షోలో నృత్యం, గానం, వాయిద్య ప్రదర్శన, నాటకం, కవిత్వం, ఇతర సృజనాత్మక కళలు చేర్చారు. మే 22న శిల్పకళా వేదికలో మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలే నిర్వహిస్తున్నారు. దాదాపు 115 మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. దీనితో పాటు వారి మేధో సంపత్తి, ప్రపంచ విషయాలపై పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తారు. 1996 ప్రపంచ సుందరి పోటీలువేదిక: బెంగళూరు ‘మహిళను అంగడి బొమ్మగా చూపే పోటీలు వద్దు.. మహిళంటే శరీర ప్రదర్శన కాదు..’అంటూ మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీసులు అడ్డుకునే సమయంలో కొందరు ఆత్మహత్యకు యత్నించగా ఒకరు చనిపోయారు. ఈ ఘటనలు పోటీలపై పెద్ద దుమారమే రేపాయి. చివరకు భారీ సంఖ్యలో పోలీసు పహారా ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించాల్సి వచ్చింది. 2025 ప్రపంచ సుందరి పోటీలువేదిక: హైదరాబాద్‌అక్కడక్కడా కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు తప్ప, ఎక్కడా నిరసన ప్రదర్శనలు లేవు. పైగా ఈ పోటీలు రాష్ట్రానికి మేలు చేస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. అందాల పోటీల నిర్వహణ తీరులో వచ్చినమార్పే... ప్రజల ఆలోచన విధానంలో ఇలాంటి మార్పు తీసుకొచ్చిoది. ఆ పోటీలు వద్దేవద్దు అన్న తీరు నుంచి, వాటిని ఓ వేడుకలాగా నిర్వహించే స్థాయికి చేరింది.స్పోర్ట్స్‌ చాలెంజ్‌.. అందం కంటే ఆరోగ్యం ముఖ్యమన్న సంకేతం ఇస్తూ ఈ రౌండ్‌ను డిజైన్‌ చేశారు. ఆరోగ్యం బాగుండాలంటే శారీరక దృఢత్వం ఉండాలి, అది సమకూరాలంటే ఆటలు ఆడగలగాలి, ఈ ఆటల్లో ముందున్న పోటీదారులు మంచి మార్కులు తమ ఖాతాలో వేసుకుంటారు. ఆటలతో పాటు నాయకత్వ లక్షణమనే మరో కీలక విషయాన్ని ఇందులో ప్రదర్శించాల్సి ఉంటుంది. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఇది ప్రేరణగా నిలు స్తుందని మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చెబుతోంది. స్పోర్ట్స్‌ చాలెంజ్‌లో రన్నిoగ్, రిలే రేస్‌లు, ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు ఉంటాయి. మే 17న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ ఫినాలే పోటీలు జరగనున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలు.. మిస్‌ వరల్డ్‌ సంస్థ ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌‘ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. పోటీదారులు తమ దేశాలలో సామాజిక సమస్యలపై తాము చేపట్టిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. రొమ్ము క్యాన్సర్‌పై సమాజంలో అవగాహన కల్పించటమే కాకుండా, బాధిత పేద మహిళలకు చికిత్స అందించేందుకు కృషి చేస్తున్న నటుడు సోనూసూద్‌ను పోటీల వేదికపై ఘనంగా సన్మానించేందుకు మిస్‌వరల్డ్‌ లిమిటెడ్‌ ఏర్పాట్లు చేస్తోంది. సామాజిక సేవలో మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ మహిళల అందాన్ని ఆదాయంగా మార్చుకుంటోందన్న విమర్శను దూరం చేసుకునేందుకు మిస్‌ వరల్డ్‌ సంస్థ గట్టిగా కృషి చేస్తోంది. ప్రస్తుతం దానికి చైర్‌ పర్సన్‌గా ఉన్న 86 ఏళ్ల జూలియా మార్లే ఈ విషయంలో పట్టుదలగా పనిచేస్తున్నారు. మిస్‌ వరల్డ్‌ సంస్థ దాదాపు 100 దేశాలలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, యుద్ధ బాధితులకు చేయూత, విపత్తు నివారణ, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంక్షేమం, బాలికా విద్య వంటి అంశాలు వీటిల్లో ఉన్నాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలోని పేద దేశాలలో విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, శుభ్రమైన నీటి సరఫరా వంటి ప్రాజెక్టులు చేపట్టింది. నైజీరియా, ఘనా, బంగ్లాదేశ్, నేపాల్‌ వంటి దేశాలలో సేవలందిస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement