
ఉగ్రమూకలను ఏరివేసేందుకు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైన్యం చేసిన కచ్చితమైన దాడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 105.71 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 80,746.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34.80 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 24,414.40 వద్ద ముగిసింది.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.36 శాతం, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ 1.16 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి.
రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్ మినహా మిగతా అన్ని రంగాలు గ్రీన్‌లో ముగియడంతో ఆటో, మీడియా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతానికి పైగా పెరిగాయి.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 5.2 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.02 శాతం, ఎటర్నల్ 1.41 శాతం, అదానీ పోర్ట్స్ 1.41 శాతం, టైటాన్ 1.27 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 4 శాతం, సన్ ఫార్మా 1.95 శాతం, ఐటీసీ-1.3 శాతం, నెస్లే ఇండియా-1.06 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.01 శాతం నష్టపోయాయి.
పాక్ స్టాక్ మార్కెట్ కుదేలు
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ జరిపిన దాడుల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. ఆ దేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కేఎస్ఈ 100 (కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్) ప్రారంభ ట్రేడింగ్లో 6,272 పాయింట్లు లేదా 6 శాతం పడిపోయింది. భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన కొన్ని గంటల్లోనే కేఎస్ఈ-100 సూచీ క్షీణించి 1,12,076.38 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్) కోలుకునే సూచనలు కనిపించలేదు. పీఎస్ఎక్స్ వెబ్‌సైట్ మూతపడింది. ఆ వెబ్‌సైట్ తెరిస్తే "తదుపరి నోటీసు వచ్చే వరకు నిర్వహణలో ఉంటుంది" అన్న సందేశం కనిపిస్తోంది.